సాయంత్రం నాలుగు దాటింది.కానీ, ఉండాల్సిన వేడి లేదు వాతావరణంలో.సముద్రపు ఒడ్డున మనుషుల హడావుడి లేదు.ఎందుకంటే, ఆకాశం నల్లటి మేఘాలతో నీరు కారిపోతోంది.బయట చీకటి వాలుతోంది.యింట్లో చీకటి.కిటికీలోంచి బయట ఉరకలేస్తున్న సముద్రాన్నే చూస్తూ నుంచున్నాను.నీళ్ళు నల్లగా మారిపోయాయి. ఉవ్వెత్తున లేస్తున్న కెరటాలు నురగల్ని, ఒడ్డుకి తెచ్చి పడేస్తున్నాయి.మేఘాల బరువుకి ఓ పక్కగా ఒరిగిపోయింది ఆకాశం. సరిగ్గా అక్కడే సముద్రపు అంచు. ఆ రెండూ కలుసుకున్నట్లే ఉన్నా, కలుసుకోలేదని ఆ రెండి ంటికి నడుమ ఉన్న గీత చెప్తోంది.అక్కడెంత ఒంటరితనం?ఆకాశం చివర, భూమి అంచున, సముద్రపు అంచున ఒంటరితనమే ఉంటుందా?జీవితం కూడా అంతే అని మనకు చెప్తున్నాయా! ప్రపంచం తీరే అంతా?మనిషి ఎప్పుడూ ఒంటరివాడే. మరో మనిషితో కలిసినట్లే ఉన్నా చివరికి మిగిలేది ఒంట రితనమేనా?‘‘ఏమంటారండీ?’’ఉలిక్కిపడి వెనక్కి తిరిగాను.ఎదరుగా పబ్లిషర్‌ స్వామి. వాస్తవంలోకి వచ్చాను.చాలాసేపటినుంచి, స్వామి ఆ గదిలోనే ఉన్నా కూడా, నా ఆలోచనా లోకంలోకి వెళ్ళిపోయినందుకు ఒక్కక్షణం సిగ్గుపడ్డాను.

వెనక్కి తిరిగి, కిటికీకి వీపు ఆనించి అలాగే నుంచున్నాను.‘‘క్షమించండి. ఏదో ఆలోచిస్తూండిపోయాను. బయట చీకటి తెరలు దిగిపోతూంటే సముద్రాన్ని చూస్తూ, మీరు ఉన్నారన్న సంగతి మర్చిపోయాను సారీ’’ అన్నాను నొచ్చుకుంటూ.‘‘అబ్బే... ఏం పర్వాలేదండి. కానీ నాకు సమాధానం యివ్వలేదు. మీకు టైమిస్తున్నాను. ఎన్ని రోజులయినా పర్వాలేదు కానీ, మీరు ఎప్పుడు మొదలెడ్తారో చెప్పండి’’‘‘ఏదో జంకుగా ఉంది. మీదీ, నాదీ కూడా అనవసర ప్రయాస అవుతుందని నాకనిపిస్తోంది’’‘ఆగండి’ అన్నట్లుగా అరచేయి ఊపాడు.‘‘అనవసర ప్రయాస కానీయండి, వ్యర్థ ప్రయత్నం అననీయండి, ఏమయినా సరే, మన ప్రయత్నం మనం చెయ్యడంలో తప్పులేదు కదా! గీతలో కృష్ణుడు ఏమన్నాడు? నీ పని నువ్వు చెయ్యి, నీ కర్తవ్యంలో లోపం రానీకు, మిగిలింది నేను చూస్తాను నాకొదిలెయ్యి. అవునా?’’పెదిమలు రెండూ బిగించి, స్వామివైపు చూస్తూ ఏం అనలేదు.‘‘ఏమంటారు?’’ అంటూ గడ్డాన్ని ముందుకు తెస్తూ ప్రశ్నించాడు. పెదిమలు విరిచాను.‘‘ఏమోనండీ, ఏం రాయాలి? ఎలా రాయాలి? ఓ డిజార్డరు గురించి ఏం రాయమంటారు?’’ఉత్సాహంగా ముందుకి వంగాడు.

‘‘హమ్మయ్య! దారిలోకి వచ్చారు. ఏం రాయాలంటే మీ అనుభవాలు రాయండి. ఓ బాధ్యత గల నాగరికురాలిగా, ఈ సమాజంలో ఉంటున్నందుకు, మీరు రాయండి. మీరు పడ్డ కష్టాలు, అవస్థలు, మీరు ఎదుర్కొన్న యిబ్బందులు అన్నీకూడా రాయండి. ప్రజల్లో అవేర్‌నెస్‌ రావాలి ఈ మాత్రం’’ అంటూ ఆగిపోయాడు.ఒక లాంటి యిబ్బంది, భయం నన్ను చుట్టేసింది.‘‘నాలో ఉన్న డిజార్డరు... అదే ఈ హీమోఫీలియా గురించి రాయమంటారా?నాలోని హీమోఫీలియాని, నా కొడుక్కి, నా ఎక్స్‌ క్రోమోజోం ద్వారా సరఫరా చేసేసి, ఓ హీమోఫీలిక్‌ కొడుకుకి తల్లిగా నేను పడ్డ ఆవేదన రాస్తే ఎవరు చదువుతారు?రెండో ఏటనుంచే రక్తం ఎక్కిస్తూ ప్రాణం నిలబెడ్తున్న ఓ అమాయకుడి గురించి రాయమంటారా?అలా రక్తం ఎక్కిస్తున్నప్పుడు, హెచ్‌.ఐ.వి.తో కూడిన రక్తం కూడా కలిసిపోయిందన్న బాధని రాయమంటారా?హెచ్‌.ఐ.వి. ఓ అమాయకుడికి సోకిందన్న మా బాధని ఏమాత్రం బయటికి చెప్పుకోలేని అశక్తతని అక్షరాల్లో చూపాలా...ఏడేళ్ళు నిండిన వెంటనే ఎయిడ్స్‌తో బాధ పడ్తున్నాడని తెలిసిన తల్లిగా, ఆ కొడుకుతో మేమంతా కలిసి , ప్రతీరోజూ, ప్రతీ నిముషం, మృత్యువు దగ్గరికెళ్ళిపోతున్న ఆ కొడుకు పడ్డ నరకయాతనతో, జరిపిన పోరాటం గురించి రాయమంటారా? అసలు అసలు ఎక్కడినుంచి మొదలు పెట్టాలో ఎలా మొదలు పెట్టాలో’’ నా గొంతు వొణికింది.