‘‘ఆమ్‌స్టర్‌ డాం!... ‘‘ఆమ్‌స్టర్‌ డాం!...’’ అంటూ లక్షా యాభై ఆరోసారికలవరించాడు దమ్మలాల్‌ చోప్రా.నేను విసుగ్గా తల తిప్పి చూడగానే, అరమోడ్పు కళ్ళను పూర్తిగా తెరిచి ‘‘అబీ దో గంటా బాకీ హై! బాద్‌మే ఆమ్‌స్టర్‌డాం... వుస్‌ కే బాద్‌ ఆమ్‌స్టర్‌ డాం మే హోనేవాలా అద్భుత్‌!’’ అని గాలి వీచినప్పుడల్లా కణకణ మండే కార్చిచ్చులా వుద్వేగంతో వూగిపోసాగాడు దమ్మలాల్‌ చోప్రా.కె.యెల్‌.యెమ్‌ విమానం వేల అడుగుల యెత్తులో యెగురుతోంది. విమానపు కిటికీలోంచి మేఘాల దొంతరలు బుర్రా గుహలోపల కనిపించే స్టలక్టయిస్‌ దొంతరల్లా కనబడుతున్నాయి. అవును, స్టలక్టయిస్‌ను తెలుగులో యేమంటారు? సున్నపు శిలాజాలా? ‘గుహ మొదలైన వాటిపై కప్పు నుంచీ నీటి బొట్లు రాలిపడగా యేర్పడిన సున్నపు చారలు’ అని అర్థం చెబుతాడు సీపీ బ్రౌన్‌. ఇంగ్లీషులో స్టలక్టయిస్‌ అనేది వొకే వొక మాట! తెలుగులో చెప్పాలంటే యింత చాటభారతం రాయాలి. భాష అనేది ఎంత బలహీనమైనదో నిరూపించి చూపించాలంటే ‘చాట భారతం’ అనే మాటను ఇంగ్లీషులోకి అనువదించి చెప్పమంటే చాలు. అంటే యేమిటి? భాష అనేది గూడా వొక కాంప్రమెయిజ్‌. అంటే సర్దుబాటు. ఇప్పుడు నేనీ దమ్మలాల్‌ చోప్రాతో కాలం తోయడం గూడా సర్దుబాటే!కేవలం హిందీ మాత్రమే వచ్చిన దమ్మలాల్‌ చోప్రాతో కలిసి మెక్సికోకు వెళ్లడానికి కారణం ట్రావెలింగ్‌ ఏజెంటు గాబ్రియల్‌ ముండా మాత్రమే! నాకు వచ్చిన హిందీ అంతంత మాత్రమే! నా వుర్దూను వుత్తర భారతదేశం వాళ్ళు యెగతాళి చేస్తారని నాకు బాగా తెలుసు. మేమిద్దరమూ మాట్లాడుకుంటూంటే నోరు తిరగని ఇద్దరు చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్నట్టే వుంది. యిలా మేమిద్దరమూ వొకరితో వొకరు వేగడమే పెద్ద సర్దుబాటు. ఈ గొడవంతా మీకు చెప్పాలనుకున్నాను చూడండి. ఇది అంతకంటే పెద్ద సర్దుబాటు. ఆ సర్దుబాటు మీరూ చేసుకోవాలనుకుంటున్నారు చూడండి. అది మరీ మరీ పెద్ద సర్దుబాటు. అవతల దమ్మలాల్‌ చోప్రాదే మో హిందీ... నేనేమో సగం తెలుగూ, సగం యింగ్లీషూ... మేము వెళ్తున్న మెక్సికో దేశంలో ప్రజలు మాట్లాడేది స్పానిష్‌... యీ దమ్మలాల్‌ చోప్రా కలవరిస్తున్న ఆమ్‌స్టర్‌ డాంలో యే భాష మాట్లాడతారో నాకు తెలియదు. ఇప్పుడు మాతోబాటూ ప్రయాణం చేస్తున్న ఈ ప్రయాణీకులు ఏఏ భాషలవాళ్ళో వేరేవాళ్ళకు తెలియదు. వాళ్ళు మాట్లాడే భాషల్ని యధాతథంగా ఏక సంథాగ్రాహిలాగా మీకు తిరిగి వల్లించానే అనుకోండి. 

అప్పుడీ ప్రయాణం మొత్తం కిచిడీలా తయారౌతుంది. పర్వాలేదు, కిచిడీ గూడా రుచిగానే వుంటుందంటారా! కృతజ్ఞతలు మీకు! మీలాంటి వారికోసమనే ఇలా చెప్పడం మొదలు పెట్టాను నేను.సర్దుబాటును గురించిగదా చెబుతున్నాను. మళ్ళీ అక్కడికే వస్తాను.యీ కె.యెల్‌.యెమ్‌ విమానం పదిగంటల క్రితం మెక్సికో సిటీనుంచి బయల్దేరింది గదా! అప్పుడు అక్కడి సమయం సాయంత్రం 7 గంటలా 45 నిమిషాలు. మేము మెక్సికోసిటీ నుంచి ఆమ్‌స్టర్‌డాం చేరాలంటే పదిన్నర గంటలు ప్రయాణం చేయాలని మా టికట్టే చెబుతోంది. అంత సమయమూ ప్రయాణం చేసినా, మేము ఆమ్‌స్టర్‌డాం చేరేసరికి అప్పుడక్కడ సమయం మధ్యాహ్నం వొకటిన్నరయి వుంటుందట! ఇలా యిదే భూగోళం పైన ఒకే సమయంలో, వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు ప్రాంతీయ సమయాలుంటాయన్న సంగతి యీ విమాన ప్రయాణం తర్వాతే నాకు తెలిసి వచ్చింది.