మనిషికి కావలిసినవి ఏమిటీ అంటే కూడూ గుడ్డా, గూడూ అని తేలిగ్గా చెప్పేస్తారు ఎవరైనా! ఆ మాట ముమ్మాటికీ నిజం. సర్వసామాన్యంగా మనిషై పుట్టిన ప్రతి వ్యక్తికీ ఆహారం, బట్టలూ తలదాచుకునేందుకు చోటూ ఉండనే వుంటాయి.కలిగిన శ్రీమంతుడు భవంతులలో నివసిస్తూ, చీనీ చీనాంబరాలు ధరిస్తూ పంచభక్ష్య పరమన్నాలు భుజిస్తే, పేదవాడు కలోగంజో తాగి, చింకి పాత కట్టుకుని ఏ చెట్టుకిందో నివసిస్తాడు.నిజం చెప్పాలంటే తిండీ, బట్టా నిలవనీడా వుంటే చాలదు. ఆ మూడు అవసరాలూ వున్నంత మాత్రాన జీవితం గడిచిపోదు. మానవ జీవితంలో ముఖ్యంగా కావలిసింది తోడు, ఆత్మీయత, ఆదరణ, ప్రేమ, అనురాగం, స్నేహం. ఇవేవీ లేకపోతే మనిషికీ రాతికీ తేడా వుండదు. మనిషన్నాక మనసుంటుంది. మనసున్న మనిషికి మరో పదిమంది మనసున్న మనుషుల సాంగత్యం కావాలి.జన్మనెత్తిన మూడవ నెలలో మనిషిని గుర్తుపట్టి బోసి నవ్వులు నవ్వడంతో మొదలవుతుంది స్నేహం కోసం ఆరాటం. ఆఖరి క్షణం దాకా ఆ ఆరాటం కొనసాగుతూనే వుంటుంది. కంఠం లోంచి ప్రాణం పోయే స్థితికి ఆ జీవి అయినవారి వంక ఆశగా చూస్తూనే ప్రాణం వదిలేస్తాడు.జీవితకాలంలో ఎన్నో సంబంధాలు, ఎన్నో బాంధవ్యాలు, మరెన్నో అనుబంధాలు ఎందరో వ్యక్తులు ఎదురవుతూ వుంటారు.

కొందరు తమ స్నేహ స్వభావంతో, మంచి మనసుతో మనసుకు సాంత్వన చేకూరుస్తారు. మరికొందరు చురకల్లాటి మాటలతో మనసుని గాయపరుస్తారు. విచిత్రం ఏమిటంటే ఈ సంబంధ బాంధవ్యాలు మన చేతుల్లో వుండవు.మనం కోరుకునే వ్యక్తి దూరమైపోయే సంఘటనలూ వుంటాయి. వద్దురా భగవంతుడా అనే వ్యక్తి అనుదినం ఎదురయ్యే సంఘటనలూ వుంటాయి.ఒకే రకమైన అభిరుచులూ, ఒకే రకమైన ఆలోచనలూ కలిగిన వ్యక్తులు ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా ఎదురుపడి చెప్పలేనంత దగ్గరై పోతారు. ఐతే అటువంటి అదృష్టం చాలా కొద్దిమందికి మాత్రమే దక్కుతుంది.మనసుకు నచ్చిన వ్యక్తితో స్నేహం కొనసాగించడం తేలికకాదు. ఒక విధంగా కత్తిమీద సాములాటిది. వయోబేధాలూ, స్త్రీ, పురుష బేధాలూ, అంతస్తులలోని తేడాలూ పరిస్థితుల ప్రభావాలూ అడ్డు గోడగా నిలుస్తాయి.వీటిన్నింటినీ అధిగమించి, మంచిస్నేహం ఏర్పడి ఆ అపురూపమైన బాంధవ్యం కలకాలం కొనసాగించడం అంటే ఎక్కడా పాము నోట పడకుండా వైకుంఠపాళిలో ఆఖరి గడికి చేరడమంతకష్టం.స్నేహం అంటే ప్రాణం ఇచ్చే నాకు ఎంతోమందితో పరిచయలూ, స్నేహాలూ ఏర్పడ్డాయి. ఎంతోమంది ఆప్తులున్నారు. ఆత్మీయులున్నారు. నీ జీవితంలో నీకు అత్యంత ఆనందం కలిగించే విషయం ఏమిటి అని ఎవరైనా నన్ను అడిగితే నా స్నేహితుల గురించి గుర్తు చేసుకోడం అని తడుముకోకుండా సమాధానం చెప్తాను.

అసంఖ్యాకంగా వున్న నా మిత్రుల జాబితాలో ఒక మంచి స్నేహితుడి కథ ఇది.1978వ సంవత్సరం. ఒక ఇంటి నించి మరో ఇంటికి మారాం. అన్నీ ప్రభుత్వం వారి ఇళ్ళే. అలా ఇళ్ళు మారడంలో మా ప్రమేయం అంతగా వుండదు. బి టైప్‌ నించి సి టైప్‌కీ, సి టైప్‌ నించీ డి టైప్‌కీ పదోన్నతిని బట్టి, ఏలినవారి జాబితాలో వున్న పేర్లను బట్టి వారి నిర్ణయానుసారం మారాల్సిందే. అలాగే బి టైప్‌ నించి సి టైప్‌కి వచ్చాం. ప్రభుత్వం వారు నిర్మించిన కాలనీలన్నీ చక్కగా తీర్చిదిద్దినట్లు వుంటాయి. విశాలమైన రోడ్లు, చెట్టూ, చేమా చూడముచ్చటగా వుంటాయి.