వాళ్ళు ప్రయాణిస్తున్న కారు షంషాబాద్‌ ఫ్లయ్‌ ఓవర్‌ దాటి కల్వకుర్తి వైపు దూసుకుపోతోంది. దాని వేగంతో పోటీ పడుతూ సూర్యకుమార్‌ ఆలోచనలు సాగుతున్నాయి. కేదార్‌నాథ్‌కి విసుగనిపించింది. డ్రైవర్‌ మస్తాన్‌ పెట్టిన రఫీ పాటల క్యాసెట్‌ అతని మనసుని తాకటం లేదు. బ్యాంక్‌ లో బోలెడు పని మిగిలిపోయింది. నేను రాలేను మొర్రో అని మొత్తుకున్నా వినకుండా లాక్కొచ్చాడు సూర్యకుమార్‌. ఇపుడేమో తపస్సమాధిలో ఉన్న మునిలా మౌనంలో మునిగిపోయాడు.

నిద్రపోయేటపడు తప్ప నోటికి విశ్రాంతినివ్వని సూర్యకుమార్‌ మౌనంగా ఉండటమే కేదార్‌నాథ్‌కి మింగుడు పడటం లేదు. ఒకట్రెండుసార్లు తల తిప్పి మాట్లాడడానికి ప్రయత్నించి, సూర్యకుమార్‌ కళ్ళు మూసుకుని దీర్ఘాలోచనలో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.వాళ్ళిద్దరిదీ ఒకటే వూరు... కలిసి చదువుకున్నారు. డిగ్రీ పూర్తయ్యాక బ్యాంకు పరీక్షలు రాసి కెనరా బ్యాంకులో క్లర్క్‌గా జాయినైన కేదార్‌ నాథ్‌ ప్రస్తుతం హైద్రాబాద్‌ లోని గాంధీ నగర్‌ బ్రాంచికి మేనేజర్‌ గా పన్చేస్తున్నాడు. సూర్యకుమార్‌ హిస్టరీలో యం. ఏ పూర్తిచేసి నకిరేకల్‌లో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఆర్కియాలజీ అంటే అమితాసక్తి. పురాతన శాసనాలు... లిపి మీద రీసెర్చ్‌ చేశాడు. ఏదైనా శాసనం తవ్వకాల్లో బైట పడితే దాన్ని చదవడానికి ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ వాళ్ళు యితని సాయాన్ని తరచూ తీసుకుంటూ ఉంటారు.‘‘మన ప్రయాణం వృఽధా పోదుగా ’’ అన్నాడు కేదార్‌ నాథ్‌ ఏదోలా సంభాషణ మొదలెట్టే ప్రయత్నంలో.?ఆ మాటకు కళ్ళు తెరిచి చూశాడు సూర్యకుమార్‌. అతని కళ్ళు నిద్ర లేమి వల్లనేమో ఎర్రగా ఉన్నాయి. ‘‘మనం పొరపాటు పడటానికి అవకాశమే లేదు. డా. హైనీ తన డైరీలో రాసింది నిజమైతే మనం వెతికే వూరు యిక్కడెక్కడో దగ్గర్లోనే ఉండాలి’’ అన్నాడు. మరలా తనే ‘‘పద్దెనిమిదవ శతాబ్దంలో డా.హైనీ మచిలీపట్నం నుంచి గోల్కొండ వస్తూ తన డైరీలో రికార్డ్‌ చేసిన దాన్నిబట్టీ, రాబర్ట్‌ షోవెల్‌ రాసిన ‘ఫర్‌గాటెన్‌ ఎంపయిర్‌’ అనే పుస్తకంలో రాసిన విషయాల్ని బట్టి మహబూబ్‌ నగర్‌ జిల్లా లోని అమ్నాబాద్‌ మండలంలో ఉన్న మన్ననూర్‌ అనే గ్రామానికి పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో మన్నుగొండ అనే రాజ్యం ఉండేది. దాన్ని పద్మనాయకుల వంశస్థుడైన అనపోతానీడు పరిపాలించిన కాలంలో అక్కడ శత్రు దుర్బేఽధ్యమైన కోట కట్టించాడు. కొండమీద లక్షీనరసింహస్వామి ఆలయంలో పూజలూ పునస్కారాలు నిత్యం జరిగేవి. కృష్ణదేవరాయల దండయాత్ర తర్వాత ఆ రాజ్యం నాశనమైపోయింది’’ అన్నాడు.‘‘నాశనమైపోయిందంటున్నావుగా.. యిపడు మనం వెతికినా ఏం దొరుకుతుంది?’’‘‘మనకాకోట శిధిలాలు దొరికినా చాలు...నా శ్రమ ఫలించినట్లే’’‘‘ఇదేదో ఆర్కియాలజీ వాళ్ళకు చెప్తే వాళ్ళు చూసుకుంటారుగా కుమార్‌... మనకెందుకు చెప’’ కేదార్‌నాథ్‌ స్వరంలో విన్పించిన నిరుత్సాహానికి దెబ్బతిన్నట్లు చూశాడు కుమార్‌.

‘‘అజంతా ఎల్లోరా గుహల్ని ఓ ఆంగ్లేయుడు కనుక్కున్నాడని అందరం చెపకుంటున్నాం కదా. అలానే శిధిలమైన మన్నుగొండ రాజ్యాన్ని కనుక్కున్న కీర్తి నాకు దక్కాలనేదే నా తాపత్రయం. దీని కోసం ఎన్ని రాత్రులు శ్రమించానో...ఎన్ని పురాతన గ్రంథాల్ని తిరగేశానో నీకు తెలీదు. నువ్వు రచయితవి. కీర్తికాంక్ష గురించి నీకు వేరే చెప్పాలా... చరిత్ర పుస్తకాల్లో నా పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలంటే మనం దాన్ని కనుక్కుని తీరాలి. ఆర్కియాలజీవాళ్ళకి చెప్తే శ్రమ నాది క్రెడిట్‌ అంతా వాళ్ళదౌతుంది.’’