ఉదయం ఆరు గంటలయింది. ధనుర్మాసపు సీతగాలులు రివ్వున వీస్తున్నాయి. మంచు వాన చినుకులా టపటప పడడమే కాదు. నగరమంతా పొగలా వ్యాపించి స్ర్టీట్‌లైట్స్‌ని సైతం మకమకలాడిస్తోంది. కలవారు తలుపులు బిగించుకుని వున్ని బట్టల్లో ముసుగులు బిగించి పడుకున్నారు. రెక్కాడితేనే గానీ డొక్కాడని పేదలు మాత్రం లేవలేక, లేవలేకుండా వుండనూలేక తమ దరిద్రాన్ని, తమనూ పుట్టించిన దేవుణ్ణి తిట్టుకుంటూ కదుల్తున్నారు లేవాలా వద్దా అన్నట్టు.లాయర్‌ శాంతారామ్‌ గారి భవంతి ముందు చిరిగిపోయిన ఓ స్వెట్టర్‌ వేసుకొని తలకో గుడ్డ చుట్టుకుని వూడ్చి కళ్ళాపి జల్లి ముగ్గు వేస్తోంది వారింటి పనిపిల్ల మంగి.అప్పుడే పక్కింటి డాక్టర్‌ ధనుంజయగారబ్బాయి రాజు పిల్లిలా లోపలకి ప్రవేశించాడు. వణుకుతూ ముగ్గేస్తున్న మంగి అతగాణ్ణి గమనించలేదు.రాజుకి ఆ ఇల్లంతా సుపరిచితమే. కాబట్టి గబగబా హాల్లోకెళ్ళి, ఇంకా ఎవరూ లేవలేదని గ్రహించి తృప్తిగా మేడ మెట్లెక్కి ఓ గది గుమ్మం దగ్గర ఆగాడు.తలుపులు దగ్గరగా వేసున్నాయి. మెల్లగా తలుపు తీశాడు.ఫుల్‌ స్పీడ్‌లో ఫేన్‌ వేసుకొని, విశాలమైన ఫోమ్‌ బెడ్‌ మీద పడుకుని, రెండు బ్లాంకెట్లు, ఓ కంఫర్సరు ముసుగు బిగించి నిద్రపోతోంది శాంతారామ్‌ గారి ఏకైక పుత్రిక పంపాదేవి. 

ఎంత చలిగా వున్నా అలా ఫాను వేసుకుని మరీ పడుకోవడం ఆమెకలవాటు.గదంతా మసక వెలుతురుగా వుండడంతో రాజు లైట్‌ వేశాడు. గదంతా వెలుగు పరుచుకుంది. అయినా పంప కదల్లేదు.రాజు ఆమె పక్కన కూర్చుని-‘‘అక్కా’’ అన్నాడు గుసగుసగా.అయినా ఆమె కదల్లేదు.‘‘అక్కా! ముందులే!’’ కాస్త విసుగ్గా తట్టాడు రాజు.తృళ్ళిపడి మొహం మీంచి ముసుగు తొలగించి చూసిన పంప ఎదురుగా కనిపించిన రాజును చూసి-‘‘ఇదేవిఁట్రా! పూర్తిగా తెల్లారకుండా వూడి పడ్డావ్‌? ఏదైనా ఫ్లాష్‌ న్యూసా?’’ అంది కాస్త విసుగ్గా.ఎక్కళ్ళేని న్యూస్‌లూ ముందుగా రాజుకి తెలియడం, వాటిని మొదటగా పంపకి చెప్పడం అలవాటే. అతనికి పదహారేళ్ళున్నా ఒకోసారి మరీ పసివాడిలా ప్రవర్తిస్తుంటాడు. అందుకే అతన్ని పంప బావ జలంధర్‌ ఫ్లాష్‌ గాడు అంటూంటాడు.‘‘ముందు లేచి ఈ పేపర్‌లోని న్యూస్‌ చూడు’’ అన్నాడు రాజు ఆతృతగా.

‘‘ఏవిఁటి మందుపాతర పేలిందా? బస్సు నదిలో పడిపోయిందా? అదీగాక ట్రైన్‌ సరదాగా రోడ్‌మీదికొచ్చిందా...అంతే కాక...’’‘‘అక్కా!’’ గభాల్న లేచాడు రాజు కోపంగా.‘‘సారీ! సారీరా! చెప్పు’’ బుద్ధిగా లేచి కూర్చుంది పంప.‘‘నేను చెప్పడం కాదు. నువ్వే చూడు!’’ అంటూ చేతిలోని పేపర్‌ తీసి దాంట్లోని హెడ్‌లైన్‌ చూపించాడు రాజు.అది చదివిన పంప కెవ్వుమన్నంత పని చేసింది. అది ఇలా వుంది.‘‘అన్య గ్రహం నించి ఏదో వింత వాహనం నగరంలో ప్రవేశం!’’ దాని కింద వివరాలు ఇలా వున్నాయి.‘‘అర్థరాత్రి దాటాక గ్రహాంతర వాహనం అతి వేగంగా నగరంలో ప్రవేశించి అడవికి అవతలగా వున్న శంభుగిరులకేసి వెళ్ళి మాయమయింది. దాన్ని చూసిన కొందరు స్పృహ కోల్పోయారు. కొందరు భయంతో పరుగులు తీశారు.అది ఏ గ్రహానికి సంబంధించిందో మాత్రం ఎవరూ చెప్పలేక పోతున్నారు. దాని వల్ల మన భూగోళానికి ఏ ముప్పు వాటిల్లుతుందో అని కంగారు పడుతున్నారు’’ అంటూ ఇలాంటివే మరికొన్ని వివరాలు రాశారా పేపర్లో.