హైదరాబాదు నుంచి 120 కిలోమీటర్ల దూరంలో మెదక్‌ జిల్లాలోఒక మారుమూల పల్లె.ఆ ఊరిలో ఒక పాడు బడి, శిథిలావస్థలో వున్నఒక రైస్‌మిల్‌. దానికి దాదాపు నాలుగుకిలోమీటర్ల వ్యాసార్థంలోఎటువంటి నివాసాలు లేవు. సమయం అర్థరాత్రి పన్నెండు కావ స్తోంది.ఆ రైస్‌ మిల్‌లోంచి సన్నగా మూలుగులు వినిపిస్తున్నాయి. కాని ఆ మూలుగులు మిల్లును దాటి బయటకు వినిపించడం లేదు. రైస్‌మిల్‌లో పై అంతస్థులో ఒక మనిషిని కట్టేసున్నారు. ఆ మూలుగులు అతని దగ్గర నుంచే వస్తున్నాయి. ఆ మనిషి కూర్చుని వున్నాడు. అతని వీపు స్తంభానికి ఆనుకొని వుంది. రెండు చేతులు వెనక్కి విరిచి, తాడుతో కట్టబడున్నాయి. కాళ్లు రెండూ ముందుకు చాచి, ఆ రెండింటిని కూడా కట్టేసారు. నడుము కూడా తాడుతో స్తంభానికి కట్టేసి వుంది. ఇక మిగిలింది నోరు. అట్టపెట్టెలను ప్యాకింగ్‌ చేయడానికి ఉపయోగించే వెడల్పాటి బ్రౌన్‌ కలర్‌ టేప్‌ను అతని తల చుట్టూ నోటిని మూసేస్తూ మూడు సార్లు తిప్పి అంటించేశారు. నీరును తాగడానికి వీలుగా అతని నోటి మధ్యన వున్న టేపు భాగానికి, స్ర్టా పట్టేంత రంధ్రం మాత్రం వుంది.ఇక అతని ముందున్న స్టూల్‌ మీద నోటికి అందేటట్లు రెండు నీళ్ల బాటిల్స్‌, వాటికి స్ర్టాలు వున్నాయి.

అప్పటికే ఒక నీళ్ల బాటిల్‌ ఖాళీ అయిపోయి వుంది.ఇంత దుర్భరమైన స్థితిలో వున్నది ఏ అనామకుడో, సామాన్యుడో కాదు. కోట్లకు పడగలెత్తిన వ్యక్తి. కొన్ని వందలమందిని కనుసన్నలతో శాసించే వ్యక్తి. రాష్ట్రం లోనే అతి పెద్ద కనస్ట్రక్షన్‌ కంపెనీ డైరక్టర్లలో ఒకడు. తన తలుచుకుంటే కొన్ని గంటల్లోనే సెక్రటేరియట్‌లోంచి ఫైలును బయటకి తేగలడన్న పేరున్న వ్యక్తి. అతనే శ్రీచరణ్‌. ప్రస్తుతం అత్యంత దుర్భరమైన పరిస్థితిలో చావుకు దగ్గరవుతున్నాడు.అప్పటికే అర్థరాత్రి దాటింది. కుక్కల అరుపులు ఎక్కువయ్యాయి. ఒక్కసారిగా శ్రీచరణ్‌కు మెలకువ వచ్చింది. తనకు ఏడుపొచ్చింది. ఎలాగొలా శక్తిని కూడదీసుకొని ‘రక్షించండి... హెల్ప్‌...హెల్ప్‌’ అని అరుస్తున్నాడు. కానీ నోటికి ప్లాస్టర్‌ అడ్డుగా వుండడంతో అవి అరుపుల్లా కాక మూలుగుల్లాగానే వినిపిస్తున్నాయి. అసలు పదాలను స్పష్టంగా పలకలేకున్నాడు.

అయినా అరవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ‘రక్షించండి...రక్షించ..’ అని హృదయ విదారకంగా అరుస్తూనే వున్నాడు. కానీ ఆ అరుపులు కనీసం ఆ మిల్లును దాటకుండానే అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. అలా అయిదునిమిషాలు అరచి అరచి చివరకి నీరసించి సొమ్మసిల్లిపోయాడు.

రెండునెలల క్రితం...హైదరాబాద్‌ శివార్లలో అది ఒక సిమెంట్‌ గోడౌన్‌. అక్కడ నలుగురు కూర్చుని వున్నారు. అందరి మొహాల్లోనూ టెన్షన్‌ స్పష్టంగా కనపడుతోంది. వాళ్లు చేయబోయే పని అంత ప్రమాదకరమైంది మరి. అందరి చేతుల్లోనూ విస్కీ గ్లాసులున్నాయి. అయినా ఒక్కడికీ మత్తెక్కినట్లు కనపడడం లేదు.ఇంతలో సుబ్బరాజు లేచి, ‘ఇపడు వాడిని చంపడం అంత అవసరమా?’ అని మిగిలిన ముగ్గురిని ప్రశ్నించాడు.‘‘డిసైడ్‌ చేసేది మనమేరా’’ అబ్బాస్‌ ఒక్కసారిగా నవ్వాడు.‘‘వాడిని చంపకుంటే మనం మిగలమేమో’ జగన్‌, సుబ్బరాజును సూటిగా ప్రశ్నించాడు.ఇంతలో వాళ్ల బాస్‌ ఇబ్రహీం వచ్చాడు.‘‘ఏమనుకున్నారు చెప్పండిరా’’ అంటూ అందరి మొహాల్లోకి చూశాడు.