‘‘వ్వాట్‌?!’’తను నిలబడ్డచోటుకి అడుగుదూరంలో శక్తివంతమైన అణుబాంబు పేలినట్టు అదిరిపడ్డాడు వంశీకృష్ణ. అతని కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా చెప్పింది అనన్య. ‘‘నువ్‌ విన్నదే నేను చెప్పాను వంశీ...’’‘‘యు... యు... రియల్లీ మీనిట్‌?’’ అతను ఆ దిగ్ర్భాంతిలోనే ఉన్నాడు ఇంకా‘‘యస్‌’’ చాలా స్థిరంగా చెప్పింది అనన్య. అతనొక క్షణం అశాంతిగా జుట్టులోకి వేళ్ళు పోనిచ్చాడు.‘‘... తనలోని స్త్రీత్వానికి పరిపూర్ణతగా ప్రతి ఆడపిల్లా భావించే ఆ అపురూపమైన వరాన్ని కాదనుకుంటున్నావ్‌? మూర్ఖత్వంలా తోచడం లేదా నీకిది?’’ గంభీరమైన స్వరంతో చెప్పాడు వంశీ. అతని మాటకు ఎలా స్పందించాలో తెలీలేదుఅనన్యకు.‘‘... చిన్నదో పెద్దదో ఈ ఇరవై రోజులూ ఏదో ఒకటి చేసావ్‌. నన్నూ చేయమని ప్రోత్సహిస్తే నేనూ కొన్ని చేస్తున్నా. అంతా బానే ఉంది. కానీ, దిస్‌ ఈజ్‌ టూ మచ్‌... అన్‌నెసెసరీ..’’ అతన్లో ఒకింత కోపం, అసహనం, అయోమయం. అశాంతి, ఆమె మౌనంగా ఉంది.‘‘వొద్దు అనన్యా ప్లీజ్‌. ఇది సరైన పనికాదు. నేనేకాదు, మన తల్లితండ్రులూ ఒప్పుకోరు’’ అతను చెప్పాడు.‘‘మా అమ్మా నాన్నలను నేను ఒప్పించగలననుకుంటున్నాను వంశీ’’ చెప్పింది అనన్య.‘‘కానీ మా వాళ్ళూ చచ్చినా ఒప్పుకోరు’’ అతను వెంటనే చెప్పాడు.

‘‘అసలు మా వాళ్ళకుగానీ, మీ వాళ్ళకు గానీ ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేదేమో’’‘‘తెలీకుండా ఎలా ఉంటుంది. ఇదేమైనా చిన్న విషయమా?’’‘‘....’’‘‘అనన్యా ప్లీజ్‌! మరోసారి కూల్‌గా ఆలోచించు. ఇది చాలా డ్రాస్టిక్‌ డెసిషన్‌. ఈ ఇరవైరోజుల్లోనే ఏదో ఒక ‘చిన్నది’ చేసేద్దాం. కానీ ఇది మాత్రం వొద్దు’’ అనన్యకు తెల్సు. తను ప్రతిపాదించిన విషయం విని, అతని స్థానంలో ఎవరున్నా ఇలాగే మాట్లాడ్తారని ఆమె గొంతు విప్పింది. ‘‘ఈ ఇరవై రోజులూ మనం చేసినవేమన్నా గొప్ప విషయాలా వంశీ? ఏ ప్రాణాన్నైనా నిలబెట్టామా? ఏ చీకటినైనా తొలగించామా? ఎవరికైనా కొత్త జీవితాన్నిచ్చామా? కనీసం చెప్పుకోతగ్గ మొత్తంలో విరాళమైనా ఇచ్చామా?’’ఆమె మాటలు అతడ్ని మరింత నిర్ఘాంతపోయేలా చేసాయి. అవాక్కై ఆమెనే చూస్తున్నాడు.అసలు అనన్య ప్రతిపాదించిన ఆ అసాధారణ విషయం ఏమిటో, దాని వెనుక గల కారణమేంటో తెల్సుకునే ముందు, గత ఇరవై రోజులుగా వాళ్ళేం చేసారో ముందు చూడాలి.

ప్రారంభం: ఓ పెద్ద మల్టీనేషనల్‌ కంపెనీలో ఐటి నిపుణుడిగా పని చేస్తున్న వంశీకృష్ణ అనన్యను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. అనన్య కూడా బీటెక్‌ పట్టభద్రురాలే. కంప్యూటర్‌ సైన్స్‌లో. పైగా కాలేజీ టాపరూ, గోల్డ్‌ మెడలిస్ట్‌ కూడానూ. ఏ కంపెనీ ఎక్కువ ప్యాకేజ్‌ ఇస్తే ఆ కంపెనీలో జాయినౌతా అనే ఇతర విద్యార్థుల్లా కాదు అనన్య. కాలేజ్‌లో చదువుకునే రోజుల్నుండీ రచయిత్రి కావాలని అనుకునేది. కానీ అప్పట్లో ఏం రాయాలో తెలిసేది కాదు. కానీ రాయాలన్న కోరికైతే ఉండేది.‘‘ఎలాంటివి రాస్తావ్‌?’’ అని స్నేహితురాళ్ళడిగితే, ‘‘ఏమో తెలీదు. కానీ రాస్తాను. సమ్‌థింగ్‌ దట్‌మేక్స్‌ సమ్‌ డిఫరెన్స్‌. పాఠకుల్లో ఎంతో కొంత మార్పు తెచ్చేవి రాస్తాను’’ అనేది.అనన్యకు మరో హాబీ కూడా ఉంది. అదేంటంటే, గోరింటాకు కోన్‌తో డిజైన్లు వేయడం. చాలావేగంగా సెకన్లలోనే అందమైన డిజైన్లు వేసేస్తుంది.