పుస్తక మహోత్సవం...!

ఊరి మధ్యలో ఉన్న పెద్ద మైదానంలో ఏర్పాటు చెయ్యబడింది ‘పుస్తక మహోత్సవం.’అందంగా అలంకరించి అమర్చిన ప్రవేశ ద్వారం పైన మరింత ఆకర్షణీయంగా మెరిసిపోతున్న ‘పుస్తక మహోత్సవం’ అన్న అక్షరాలను అపురూపంగా చదువుకుని, మెల్లగా కారుని ముందుకు పోనిచ్చి ఖాళీ ప్రదేశంలో ఓ ప్రక్కగా పార్కింగ్‌ అన్న చోట కారు ఆపాడు వంశీకృష్ణ.అది చూసి ఒకతను పరిగెత్తుకుంటూ కారు దగ్గరకి వచ్చి నెంబరు నోట్‌ చేసుకొని టోకెన్‌ తీసి వంశీకిచ్చాడు.పరిచయమున్న వ్యక్తిలాగా నవ్వి ‘‘నిన్ననే వెళ్ళిపోతున్నాను అన్నారు కదా సార్‌?’’ అడిగాడు.‘‘వెళ్ళిపోదామనుకున్నాను. కానీ, ఇంకా కొనాల్సిన పుస్తకాలున్నాయి. అదీకాక ఇవ్వాళేదో ప్రోగ్రాం వుంది.’’‘‘ఏం ప్రోగ్రాం సార్‌?’’‘‘వక్తృత్వపు పోటీలని చెప్పారు. నిన్న నా పేరు కూడా ఇచ్చాను.’’ అని వాచ్‌ చూసి ‘‘ఇంకా టైముందిలే’’ అన్నారు.ప్రతి ఏడాది ఒక సారి జరిగే బుక్‌ ఎగ్జిబిషన్‌ అంటే పెద్ద పండగే వంశీకి. తనకి కావల్సిన పుస్తకాలు కొని, ఆ సంవత్సరమంతా వాటితోనే గడుపుతాడు. సాహిత్యమంటే ఎంతో ప్రాణం అతనికి.‘‘ఇవ్వాళ పెద్దగా జనం లేరే?’’ అన్నాడు వంశీ కదుల్తూ.‘‘అవున్సార్‌...శని, ఆదివారాల్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు.’’వంశీ ఎంట్రన్స్‌ దగ్గర ఆగి లోపలికి వెళ్ళబోతూ తలెత్తి చూసి మళ్ళీ చదివాడు.అద్వితీయమైన భావం కలిగింది. మనస్సుకి చాలా ఇష్టమైన పనులు చేస్తుంటే కలిగే ఆనందం అది. లోపలికి వెళ్ళాడు. చాలా విశాలమైన మైదానంలో దాదాపు రెండొందలు పైగా ఉన్న బుక్‌ స్టాల్స్‌తో కళకళలాడుతోంది ఎగ్జిబిషన్‌.ప్రతిరోజూ కన్నా పల్చగా ఉన్నారు జనం. అతను వరుసగా మూడో రోజు రావడం. ఎన్ని కొన్నా ఏదో దొరకలేదన్న అసంతృప్తి. నెమ్మదిగా నడుచుకుంటూ ఒక్కొక్క స్టాల్‌ దగ్గరకు వెళ్ళి నిశితంగా పరిశీలిస్తున్నాడు.