‘‘కంగ్రాచ్యులేషన్స్’’ అన్నాడు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న మిత్రుడు భూషణ్ అర్ధరాత్రి ఫోన్లో.‘‘ఎందుకు?’’ అన్నాను అపడే నిద్రలోకి నిష్క్రమిస్తున్న నేను.‘‘ఈసారి లాస్‌ఏంజిల్స్‌లో జరుగుతున్న ఆటా సభలకు నిన్ను ఆహ్వానిస్తున్నాము’’ అన్నాడు భూషణ్.‘‘చాలా సంతోషమే. కానీ స్వంత ఖర్చుల మీద అక్కడకు వచ్చేంత డబ్బయితే నా దగ్గర లేదు’’ అన్నాను.‘‘నిన్ను స్వంత ఖర్చులు పెట్టుకుని రమ్మంటామా? ఖర్చులు మావే. నీకు టికెట్స్ పంపిస్తాం’’ అన్నాడు భూషణ్.‘‘థాంక్యూ. అమెరికా చూడాలని ఎన్నాళ్ళుగానో కంటున్న కలలు నిజవతున్నాయన్నమాట’’ అన్నాను.‘‘అమెరికా చూడాలని ఎందుకు కలలు గంటున్నావో?’’‘‘అమెరికా గురించి ఇంత చర్చ జరుగుతున్నది కదా. కొందరు అమెరికాను భూతలస్వర్గం అంటున్నారు. కొందరేమో సామ్రాజ్యవాదాన్ని పెంచి పోషిస్తున్న భూతం అంటున్నారు. ఇందులో ఏది నిజమో స్వయంగా చూసి తెలుసుకోవాలని’’‘‘ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా ఓపెన్ మైండ్‌తో వస్తే మంచిది.’’‘‘ఓపెన్ మైండ్‌తోనే వస్తాను.’’‘‘త్వరలోనే నీకు ఆహ్వానం అండ్ టికెట్స్ పంపిస్తాను. ఆహ్వానం అందగానే వీసాకోసం ప్రయత్నాలు మొదలెట్టు.’’‘‘టికెట్స్ పంపించడంలో ఎలాంటి డౌట్స్ లేవుకదా?’’ అన్నాను.‘‘నేను ఆటా సభల సన్నాహక కమిటీలో మెంబర్ని. నిన్ను ఆహ్వానించాలని మొన్ననే మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో నిర్ణయించాం. కాబట్టి నువ్వా విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు’’ అన్నాడు భూషణ్.‘‘ఓ.కె.’’ అన్నాన్నేను.
‘‘సో బై...’’ అంటూ ఫోన్ పెట్టేశాడు భూషణ్.భూషణ్ అమెరికాకు వెళ్ళి ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడకు వెళ్ళిన కొత్తలో చాలా కష్టాలు పడ్డాడట. కానీ త్వరలోనే అక్కడి జీవితానికి అలవాటుపడిపోయాడు. చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్ సంపాదించి, కెమిస్ర్టీలో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ సంపాదించాడు. లెక్చరర్ ఉద్యోగంలో చేరాడు. అప్పటినుంచి అతని పరిస్థితి చాలా మెరుగైంది. వెళ్ళిన ఐదు సంవత్సరాల తర్వాత ఇండియాకొచ్చి పెళ్ళి చేసుకున్నాడు. అతని పెళ్ళి ఇక్కడున్న అతని ఫ్రెండ్స్‌మి, మేమే కుదిర్చాం.కాలేజీలో చదువుకునే రోజుల్లోనే భూషణ్ నాకు మిత్రుడయ్యాడు. సాహిత్యం మీదున్న ఆసక్తే మమ్మల్నిద్దర్నీ కలిపింది. టెక్ట్స్‌బుక్స్ కంటే ఎక్కువగా మేం నవలల్నీ, కథల్నీ, కవితల్నీ చదువుతుండేవాళ్ళం. అలా మేమిద్దరం శ్రీశ్రీని, చలాన్ని, బుచ్చిబాబునూ, కొ.కును, గోపీచంద్‌నూ, ఆరుద్రనూ, తిలక్‌నూ ఔపోసనపట్టేశాం. చదివిన పుస్తకాలను గురించి గంటలకు గంటలు చర్చించుకునేవాళ్ళం.భూషణ్ కవిత్వం రాసేవాడు. నేను కథల్నీ, నవలల్నీ రాసేవాడిని.భూషణ్ బి.ఎస్.సీ, బి.ఎడ్ చేసి టీచరయ్యాడు. నేను ఎం.ఎ. చదివి లెక్చరర్‌ని అయ్యాను. ఉద్యోగాల్లో చేరాక కూడా మేం తరచుగా కలుసుకునేవాళ్లం - కలుసుకోలేకపోయినపడు పేజీలకొద్దీ ఉత్తరాలు రాసుకునేవాళ్ళం.నవలా రచయితగా నేను అంతో ఇంతో పేరు సంపాదించుకోగల్గాను. కానీ భూషణ్‌ను కవిగా ఎవరూ గుర్తించలేదు.‘‘నేను చాలా మంచి కవిని. కానీ నన్నెవరూ గుర్తించడం లేదు’’ అనే భావం భూషణ్‌లో క్రమంగా బలపడటాన్ని నేను గమనించాను.‘‘సాహిత్యంలో కూడా అన్నీ రాజకీయాలే. నేను అగ్రకులాలకు చెందినవాడిని కాను. నిమ్న కులానికి చెందినవాడినీ కాను. అసలు నాకో కులమనేదే లేదు. ఈ కారణం చేతనే నన్నో కవిగా ఎవరూ గుర్తించడం లేదు’’ అన్నాడోసారి భూషణ్.‘‘మన ఆనందంకోసం మనం రాసుకుంటున్నాం. ఎవడో గుర్తించడం లేదన్న బాధెందుకు. రాసుకున్నదేదో మనకు తృప్తినిస్తే చాలు’’ అన్నాన్నేను.