ఉదయం ఐదు గంటల సమయం... మసక చీకట్లింకా తొలగిపోలేదు.కడుపునిండా కప్పల్ని మింగి మత్తుగా పడుకున్న కొండ చిలువలా ఉందా జైలు. కేవలం ఆడ ఖైదీలను మాత్రమే ఉంచే ఆ జైల్లో ఆ సమయానికి దాదాపు అందరూ నిద్రలు పోతున్నారు. కొంత మందికి మెలకువొచ్చినా బ్యారక్స్‌ తాళాలు ఎప్పుడు తెరుస్తారా అని అసహనంగా ఎదురుచూస్తున్నారు.అప్పుడే లోపలికి ప్రవేశించిన జైలర్‌ యామిని అన్ని బ్యారక్‌ల తాళాలు తెరవమని కింది సిబ్బందికి హుకుం జారీ చేసింది. ప్రతిరోజూ ఐదింటికి జైలర్‌ వచ్చాకే ఖైదీలను కాల కృత్యాలు తీర్చుకోడానికి బైటికి వదుల్తారు. ఉదయం ఖైదీలకు ఫలహారాలు పెట్టడం పుార్తయ్యాక ఎనిమిదింటికి జైలర్‌ యింటికెళ్ళి పోయి మళ్ళా పదింటికి డ్యూటీకి వచ్చేస్తుంది.ఏడు గంటల సమయం.. పొగలు కక్కుతున్న కాఫీని కొద్దికొద్దిగా చప్పరిస్తూ తెలుగు దినపత్రిక ముందరేసుకుని వార్తలు చదవడంలో మునిగిపోయిన యామిని ‘‘మేడం’’ అన్న పిలుపుతో తల యెత్తి చూసింది. ఎదురుగా లేడీ కానిస్టేబుల్‌... ఆమె చేతిలో రెండు పెద్ద సైజు నోటు పుస్తకాలున్నాయి.‘ఏంటవి’ అన్నట్టు ప్రశ్నార్థకంలా కళ్ళు ఎగరేసింది.‘‘క్రిష్ణా బ్యారక్‌లో దొరికాయట మేడం. గదిని వూడుస్తున్నప్పుడు నిన్న ఖాళీ అయిన బెడ్‌ దులుపు తుంటే కన్పించాయట. మీ దృష్టికి తీసుకురావడం మంచిదని...’’ తన చేతిలో ఉన్న రెండునోటు పుస్తకాలని జైలర్‌ ఎదురుగా టేబుల్‌ మీద పెడుతూ అంది.యామిని మొదటి పుస్తకం చేతిలోకి తీసుకుని అట్ట తెరిచి చూసింది. తెల్ల కాగితం మీద మధ్యలో బాల్‌ పాయింట్‌ పెన్‌తో ‘అనామిక డైరీ’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. పక్క పేజీ తిప్పి చుాసింది. పేజీ మొత్తం వాక్యాలతో నిండిపోయి.. అన్ని పేజీలూ అలానే ఉన్నాయి. పేజీకి పైన కుడి వైపున నంబర్లు వేసి ఉన్నాయి. చేతి రాత అందంగా లేదు. కోడి గెలికినట్టు చిన్నచిన్న అక్షరాలు...‘‘ఎవరీ అనామిక? ఏమైనా ఎంక్వయిరీ చేశావా?’’ గద్దించినట్టు అడిగింది యామిని.

‘‘ఆ బ్యారక్‌లో ఉన్న తొమ్మిది మంది ఖైదీలను అడిగాను మేడం. తెలీదన్నారు. ఎవరి బెడ్‌ కింద దొరికిందో ఆ ఖైదీ నిన్ననే విడుదలై వెళ్ళిపోయింది. కానీ ఆమె పేరు అనామిక కాదు. స్వప్న... ఆమె సాయంత్రాలు డిన్నర్‌ చేసి బ్యారక్‌లోకి రాగానే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదుట. ఏదో రాస్తూ గడిపేదని మిగతా ఖైదీలు చెప్పారు. కాబట్టి ఆవిడే అనామిక పేరుతో ఇదంతా రాసి ఉంటుందని నాకనిపిస్తోంది.’’‘‘ఏం రాసి ఉందో చదివావా?’’‘‘లేదు మేడం. దొరికిన వెంటనే ప్రిలిమినరీ ఎంక్వయిరీ చేసి మీకు చూపిద్దామని తెచ్చాను’’‘‘సరే. నువ్వెళ్ళు’’యామినికి వాటిలో ఏం రాసి ఉందో చదవా లన్న ఆసక్తి కలగలేదు. ఏమీ తోచక కొంతమంది ఖైదీలు రాసుకునే పిచ్చి రాతలనుకుంది. లేకపోతే కథల్రాసే పైత్యమున్న ఖైదీ ఎవరో కాగితాలమీద తనకు తోచింది రాసి ఉంటుందనుకుంది. ఆ రెండు పుస్తకాలని పక్కన పడేసి తన రోజువారీ పనిలో నిమగ్నమైపోయింది. ఎనిమిది కాగానే లేచి యింటికెళ్ళిపోయింది.మళ్ళా పదింటికి తిరిగొచ్చినపుడు టేబుల్‌ మీద ఎదురుగా ఆ రెండు నోటు పుస్తకాలూ కన్పిం చాయి. ఒకట్రెండు పేజీలు చదివితే విషయం అర్థమైపోతుందనీ, ఆ తర్వాత డస్ట్‌ బిన్లో పడేయ వచ్చని చదవడం ప్రారంభించింది. వెంటనే పరిస రాల్ని కూడా మర్చిపోయి అందులో పూర్తిగా లీనమై పోయింది.