సెంబర్ నెల...మంచి చలికాలం....ఢిల్లీ నగరం అంతా చలికి వణికి పోతోంది.ఢిల్లీకి పక్కనే ఉన్న నొయిడా అంతా పొగమంచుతో కప్పబడి ఉంది. ఉదయం ఎనిమిది గంటలు దాటినా, చీకటిగా ఉంది. పనివాడు సంత్‌రాం, మంచం మీద ఉంచిన బట్టల్ని వేసుకుంటూ, ‘‘సంతూ!ఛాయ్!’’ అన్నాడు మయాంక్.‘‘టేబుల్ పే తయార్ హై’’ అన్నాడు సంత్‌రాం.కోటు వేసుకుంటూ, డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చాడు.‘‘సంతూ, ఊరు వెళ్తానన్నావు కదా!’’తల ఊపాడు అవునన్నట్లుగా.బ్రెడ్‌కి వెన్న రాసి ఇస్తున్నాడు సంత్‌రాం.‘‘ఇవాళ నర్సింగ్ హోంకి వెళ్లాలి. ఫిజియో థెరపిస్ట్ వచ్చి, అమ్మని పరీక్ష చేసి చెప్తాడు అమ్మని ఎప్పుడు తీసుకెళ్లచ్చో. ఇంటికి వెళ్లాక ఏమేమి ఎక్సర్‌సైజులు చెయ్యాలో... ఇప్పుడు అక్కడికే వెళుతున్నాను. వంట చెయ్యక్కర్లేదులే....ఇంతకీ నువ్వెప్పుడు వెళుతున్నావు?’’ బ్రెడ్ తింటూ, కిటికి దగ్గర కెళ్లి, కర్టెన్ పక్కకి తప్పించాడు.ఏమీ కనపడలేదు. ఫాగ్. డ్రైవింగ్ చాలా కష్టం.‘‘మీరు వెళ్లాక వెళ్తాను సాబ్!’’టేబుల్ దగ్గరకొచ్చి టీ తాగుతున్నాడు మయాంక్.‘‘ఆఁ...సంతూ...ఇవాళ వెళ్లినా, రేపు వెళ్లినా సరే. నాకు మాత్రం ఓ పని చేయాలి.’’‘‘చెప్పండి, సాబ్!’’‘‘మీ ఊర్నించి ఎవరైనా ఓ ముప్ఫయి, నలభై సంవత్సరాల స్త్రీని తీసుకురావాలి. అమ్మకి అన్నీ చేస్తూ సాయపడాలి.’’‘‘మా అమ్మని తెస్తాను. మంచిగా చూస్తుంది సాబ్!’’‘‘నీ ఇష్టం. నువ్వు ఎవర్ని తెచ్చినా సరే. పూర్తిగా అమ్మ దగ్గరే ఉండాలి. చలికాలం, చాలా కష్టం అమ్మకి...మార్చి వరకూ ఇబ్బంది. ఆ తరువాత ఫర్వాలేదు లే...’’ టీ కప్పు పెట్టి, మిగిలిన బ్రెడ్ తినేశాడు.వాచి చూసుకున్నాడు తొమ్మిదవుతోంది టైము.అటూ ఇటూ నడుస్తూ, ఇంటి తాళాలు, కారు తాళాలు, చేతులకి గ్లవ్‌స్ తీసుకొని సంతురాం దగ్గరకొచ్చాడు.
‘‘ఈ కప్పులు, ఈ గిన్నెలు అవీ అన్నీ తోమి వెళ్లు. సింక్‌లో ఏమీ ఉంచకు. చీకటిగా ఉందని, అన్ని గదుల్లో లైట్లు వెలుగుతున్నాయి. అన్నీ ఆర్పేసి వెళ్లు’’ అంటూ బయటకి నడిచాడు.ఢిల్లీ వాళ్లకి ఇలాంటి పొగమంచు కొత్తకాదు. చలి అంతకన్నా కొత్త కాదు.రూం హీటర్ వేసుకొని, వెచ్చగా రజాయిలో దూరిపోతే బావుండుననిపిస్తోంది. కానీ ఉద్యోగం...చలికి బిగుసుకుపోయిన కారుని వేడి చేసి, సొసైటీ బయటకి రావడానికి చాలా కష్టపడ్డాడు.ఈ భయంకరమైన పొగమంచులోంచి కారు నడపాలి. పూర్ విజిబులిటీ, డ్రైవింగ్ చాలా కష్టం. కారు లైట్లు వేసాడు. అతి జాగ్రత్తగా నడిపించసాగాడు.అర్చనా నర్సింగ్ హోం నోయిడాలోని ముప్ఫయి నాలుగో సెక్టర్‌లో ఉంది. ఆ నర్సింగ్ హోంలో ఉన్న తల్లిని చూడడం కోసం, డాక్టరుతో మాట్లాడడం కోసం, ఆమెను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో తెలుసుకోవడం కోసం వెళుతున్నాడు.ఆమెకు రెండు నెలల క్రితం ఒక్కసారిగా బిపి పెరిగి పోయింది. దానితో కుడివైపు పక్షవాతం మైల్డ్‌గా వచ్చింది.వెంటనే ఈ నర్సింగ్ హోంలో ఉంచాడు. ఇప్పుడు కొంచెం ఫర్వాలేదు.పది గంటల ప్రాంతంలో డాక్టర్, ఫిజియోథెరపిస్ట్ వచ్చారు. ఆవిడ కాళ్లు, చేతులు, అటూ ఇటూ కదిలించి, టకా టకా కాళ్ల మీద కొట్టి, చిన్న చిన్న కదలికలు చేయించారు.‘‘ఇంకో పదిహేను రోజులు ఇక్కడే ఉంచండి’’ అంటూ ఇంకా కాస్సేపు మయాంక్‌తో మాట్లాడి వెళ్లిపోయారు డాక్టర్లిద్దరూ.తల్లి దగ్గర కూర్చున్నాడు.