ఆ కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. వాటిలో దయ అనేది ఏ కోశాన లేదు. ఆ కంటి చూపులో ఆవేశం లేదు. కోపం లేదు. కాని కపటం ఉంది! ధీమా ఉంది! నన్ను దాటుకుని ఎక్కడికి వెళ్ళగలవు అన్న పొగరు ఉంది!ఆ చూపుకి మండించే శక్తి ఉంటే అది పడిన చోట బూడిద మిగలాల్సిందే!ఆ చూపుకి బాణాలను సంధించే శక్తి ఉంటే అది సోకిన ప్రాణి శరీరం, శరపరంపర తాకిడికి అంపశయ్యపైనున్న భీష్ముడిని గుర్తుకి తేవాల్సిందే!ఆచూపుకి ఈ శక్తులేమీ లేకున్నా, ఆకళ్ళకు తన శత్రువులో భయం కలిగించే శక్తి మాత్రం ఉంది. బేల చూపులు చూస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని తల్లడిల్లే అబలను చూపులతోనే స్థాణువుగా మార్చగల శక్తి మాత్రం ఆ కళ్ళకు ఉందని నిశ్చయంగా చెప్పొచ్చు.తన పట్టు నుంచి తప్పించుకున్న భ్రాంతిని కల్పించి, ప్రాణాలు కాపాడుకోవచ్చేమో అన్న ఆశను చిన్నగా వెలిగించి, ఏదో ప్రయత్నం చే స్తూ ప్రమాదానికి దూరంగా వెళ్ళాలి అన్న కోరికను ఆ బేలకి కలిగిస్తాడు. అటూ ఇటూ చూస్తూ మెల్లగా ఒంట్లోకి ఓపిక తెచ్చుకుని, అదురుతున్న గుండెలను అతి ప్రయత్నం మీద గుప్పెట్లో పట్టుకుని, కాపాడమంటూ కనిపించని దైవాన్ని వేడుకుంటూ, ప్రాణాలు దక్కించుకునే దిక్కుకి పారిపోతుంది బేల చూపులు చూస్తూ. ఇంకా నాలుగు అంగల్లో సురక్షితమైన తన ఇంటికి వెళ్ళిపోతుందనగా ఆకాశం నుంచి హఠాత్తుగా పడిన పిడుగులా అతడి పిడికిలి ఆమెపై పడి నడుము చుట్టి గట్టిగా పట్టుకుంటుంది.

విలవిల లాడుతూ అతని ఉక్కు పిడికిలి నుంచి బయట పడడానికి విఫలయత్నం చేస్తుంది మౌనంగా రోదిస్తూ. మళ్ళీ తీసుకుని వచ్చి తనకు అనువుగా ఉన్న చోటికి తెచ్చి పెడతాడు. చెలగాటం మళ్ళీ మొదలు!నన్నొక్కసారిగా చంపి తినవచ్చుగా, మెల్లమెల్లగా నరకం చూపించకుండా అనుకుంటుంది. అబ్బ ఆశ! ఒక్కసారిగా నువ్వు చస్తే నాకు ఆనందం ఏముంది. ఎలాగూ నువ్వు నా ఆకలి తీర్చాల్సిందే. అప్పటివరకు నాకు నువ్వో ఆట వస్తువ్వి, అప్పుడే నిన్ను వదిలిపెడితే.. వెంటనే నిన్ను చంపుతే.. నాకు ఆడుకోవడానికి బొమ్మ లేక బోరు కొట్టదూ అనుకుంటాడు అతను.అతని కళ్ళల్లో ఆట ఉంది! అతని కళ్ళల్లో ఆకలి ఉంది!పిల్లి చెలగాటాన్ని, ఎలుక ప్రాణ సంకటాన్ని దూరం నుంచి చూస్తున్న సీత గట్టిగా నిట్టూర్చింది.

ఆ పిల్లిని చూస్తుంటే తనకు మనోహర్‌ వెకిలి నవ్వు కనిపించి ఒళ్ళు గగుర్పొడిచింది. ఆ ఎలుకని రక్షించాలి అనుకుని తన చేతిలోని టెన్నిస్‌ బాల్‌ని పిల్లకి తగిలేలా విసిరింది. అనుకోకుండా మీద పడిన బంతి వల్ల పిల్లి డిస్టర్బ్‌ అయ్యింది. ఎలుక మీద నుంచి ఆ పిల్లిగాడి దృష్టి క్షణకాలం తన మీద పడిన బంతి మీదకు మరలింది. అనుకోకుండా లభించిన సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకున్న ఎలుక సందు చూసుకుని రక్షిత ప్రాంతానికి వెళ్ళింది.బంతి నుంచి దృష్టిని ఎలుకపైకి తిప్పిన పిల్లికి అక్కడ ఎలుక లేకపోవడం ఆశాభంగం కలిగించింది. రుసరుసలాడుతు ఎలుక జాడ తీయడానికి ప్రయత్నించింది. కాని ఫలితం లేకపోయింది. అసహనంగా చుట్టూ చూసి ఒక గెంతులో గదిలోనుంచి బయటకు వెళ్ళింది.