ప్రేమ..ఆప్యాయత...మమకారం!నదీ నదాలు జీవం ఇస్తుంటే, నేలతల్లి ప్రేమగా చూస్తూ పచ్చని పైరులతో పులకరిస్తూ..ఠీవిగా, పర్వత శ్రేణులనే శతసహస్ర బాహువులతో ఆకాశాన్ని ఆర్ధించి తన బిడ్డల దాహాన్ని, ఆకలిని తీరుస్తుంటే...ఆ ముద్దు బిడ్డలు కొండల్ని తవ్వి, నీటిని కలుషితం చేసి, ఆ తల్లిని నిర్వీర్యం చేస్తున్నారు.కన్నతండ్రి ఆప్యాయతని, మాతృమూర్తి మమకారాన్ని హక్కుగా, వారి యోగక్షేమాలు చూసే బాధ్యతని భారంగా చూస్తున్న తమ బంగారు కొండల ఆంతర్యం తెలియని పిచ్చి అమ్మానాన్నలు...అచ్చు భూమ్యాకాశాలలాగే నిర్వీర్యం అయిపోతున్నారు.నిలకడగా సాగిపోతోందనుకుంటున్న సంసారంలో అనుకోని ఆపద వచ్చిపడితే...పెద్దలు ఆ జీవన సంధ్యా సమయంలో పడవలసిన కష్టాలు, తట్టుకోవలసిన మానసిక, భౌతిక వత్తిడులు ఎన్ని...ఆ ప్రకృతిని, ఈ వ్యవస్థని కాపాడే వారు ఎవరు?అక్కడక్కడ కొద్ది మంది తాపత్రయపడుతున్నా వారి ప్రయత్నాలు గంగానది మైలని శుభ్రపరచడం వంటివే. అధిక శాతం క్షీణిస్తున్న శక్తితో ఎదుర్కోవలసిందే ఏ ఇక్కట్లయినా! అదే పోరాటం ప్రసన్న, సూరిబాబులు చెయ్యవలసి వచ్చింది. తళతళలాడుతూ స్థిరంగా ఉన్న చెరువు నీటిలో వేల రాళ్ళు పడి అల్లకల్లోలం అయినట్లుయింది. చల్లగా సాగుతున్న వారి సంసారంలోకి ‘‘కాంతి’’ రాక.అర్థరాత్రి దాటింది...పన్నెండు గంటలు గట్టిగా కొట్టేసిన గోడ గడియారం వినీ వినిపించకుండా టిక్‌ టిక్‌ మంటోంది. కిటికీలోంచి వెన్నెల కిరణాలు సరిగ్గా మంచం మీద పడుతున్నాయి. 

ప్రసన్న మొహం మీదికి పడుతున్న వెలుగును తప్పించుకోవడానికి ఎడం పక్కకి వత్తిగిల్లి పడుకుంది. తెల్లారగానే ఎదుర్కోబోయే తుఫాను తెలియకపోవడం ఒక వరమే!సరిగ్గా ఒంటిగంటకి....సన్నగా మొదలయిన ఏడుపు, నెమ్మదిగా పుంజుకుని తారస్థాయికి చేరుకుంది. ప్రసన్న నిద్ర కళ్ళతోనే కుడిపక్కకి తిరిగి, చెయ్యి పైకి లేపి జోకొట్టబోయింది. నిటారుగా మంచం నడిమధ్యలో నిల్చున్న రెండేళ్ళ వేణి, చేతికి దొరకలేదు. కళ్ళు మూసుకునే వేణి కాళ్ళు లాగి పడుక్కోబెట్టింది.ఊహూ! స్ర్పింగ్‌లా లేచి ప్రసన్న భుజం మీద రెండుచేతుల్తో కొడ్తూ ఇంకొంచెం ఏడుపు పెంచింది వేణి. కొంచెం దూరంలో ఇంకో మంచం మీద గాఢ నిద్రలో ఉన్న సూరిబాబు హూహూ అనుకుంటూ కళ్ళు నులిమాడు.‘‘రోజూ అర్థరాత్రి ఈ అంకమ్మ శివాలేవిటే బాబూ! పొద్దున్నే లేచి మనం పన్లు చేసుకోవాలా వద్దా...దాన్నోరు నొక్కు ముందు.’’ప్రసన్న మాట్లాడకుండా వేణిని ఎత్తుకుని మేడ మీద నుంచి కిందకి దిగింది. రోజూ పన్నెండు దాటాక ఒక అరగంట ఆరునొక్క రాగంలో కచేరీ చేస్తుంది వేణి. అయ్యాక పాలు తాగి పడుకుంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం ఆపలేకపోయింది ప్రసన్న.

ఇంట్లో అందరికీ అలవాటైపోయి, ఎవరూ పట్టించుకోరు. తనకి మాత్రం తప్పట్లేదు.‘‘వాళ్ళమ్మ దగ్గరికి పంపించేయి. నీకు మాత్రం నిద్ర సరిపోవద్దూ!’’ అంటాడు సూరిబాబు. భార్య కష్టపడుతోందని అతని బాధ.అదీ నిజమే..కాని పడుకునే ముందు, ‘‘నానమ్మా! కథ చెప్పవూ’’ అంటూ ముద్దు ముద్దుగా పక్కలోకి చేరుతుంది వేణి. కథ వింటూ సగంలోనే పడుకుంటుంది. కోడలు ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చి ఇంత తినేసి పడుకుంటుంది అప్పటికే. లేపడానికి మనసొప్పక దాన్ని తన దగ్గిరే ఉంచుకుంటుంది ప్రసన్న. వేణిని సముదాయించి పడుక్కోబెట్టాక... అప్పటికే నిద్రలోకి జారుకుంది.