రావ్‌మరీచిమహర్షి దర్భశయ్య మీద విశ్రాంతిగా పడుకున్నాడు. కశ్యపుడు వచ్చాడు.‘‘మీ అమ్మ ఏది కశ్యపా?’’ మరీచి అడిగాడు.‘‘ముద్దుల కోడళ్ళతో ముచ్చటలాడుతోంది నాన్నగారూ. ఒకరా, ఇద్దరా? పద ముగ్గురు!’’ కశ్యపుడు నవ్వుతూ అన్నాడు.‘‘వానప్రస్థంలో నాతో వొంటరిగా వుంటోంది కదా! ఆమెకు ఇదొక ఆట విడుపు!’’ మరీచి నవ్వాడు.కశ్యపుడు ఆయన పాదాల వద్ద కూచున్నాడు. సున్నితంగా పాద సంవాహనం చేయసాగేడు.మరీచి కుమారుడివైపు చిరునవ్వుతో చూశాడు.‘‘కశ్యపా...’’‘‘నాన్నగారూ!’’ కశ్యపుడు తండ్రి ముఖంలోకి చూస్తూ అన్నాడు.

‘‘ఇటీవల మా జనకపాదులు చతుర్ముఖుల దర్శనం చేసుకున్నాను...’’‘‘అలాగా... మీరు అదృష్టవంతులు నాన్నగారూ!’’‘‘నువ్వు కూడా అదృష్టవంతుడివే! ఇది నీ తండ్రిగారి వాక్కు కాదు; నా తండ్రి గారి వాక్కు. బ్రహ్మవాక్కు!’’ మరీచి చిరునవ్వుతో అన్నాడు.కశ్యపుడు ఉత్సాహంగా చూశాడు.‘‘త్వరలో నిన్ను వరించబోయే అదృష్టం ఏమిటో తెలుసా, నీకు? అదితి గర్భాన నీకు అఖండుడైన పుత్రుడు పుట్టబోతున్నాడు..’’‘‘నాన్నగారూ!’’ఆ అఖండపుత్రుడు ‘ఆఖండలుడు’గా ప్రఖ్యాతుడవుతాడు. దేవేంద్రుడుగా, మహేంద్రడుగా వ్యవహరింపబడతాడు. జాతకర్మ శుభ దినాన నా మనమడికి సార్థకమయ్యే నామధేయాన్ని నిర్ణయిస్తాను. బ్రహ్మదేవులు ఆ బాధ్యతనూ, భాగ్యాన్నీ నాకు అనుగ్రహించారు!’’ మరీచి మహర్షి మాటలలో సంతోషం ప్రతిధ్వనించింది.‘‘నాన్నగారూ... మీకు ఒక సంగతి విన్నవించాలి...’’‘‘ఏమిటి కశ్యపా?’’‘‘అదితి గర్భవతి కాకముందు, ఒక వేకువజామున నాకు ఒక కల వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించారు..’’ అంటూ కశ్యపుడు తన దివ్య స్వప్న వృత్తాంతాన్ని తండ్రికి వివరించాడు.మరీచి మహర్షి చిరునవ్వుతో చూశాడు. ‘‘నీ స్వప్నం సత్యమవుతుందని మా జనకుల వాక్కు నిరూపిస్తోంది!’’