‘‘అగ్రతో చతురో వేదాఃపృష్ఠతో సశరం ధనుఃఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రంశాపాదపి శరాదపి!!’’శ్లోకం పఠించి నిర్వికల్పానంద శిష్యుల్ని చిరునవ్వుతో చూశాడు.‘‘అర్థం చెప్పండి, గురువుగారూ’’ విమలానందుడు వినయంగా అన్నాడు.‘‘ఇది భగవాన్‌ పరశురాముడి వ్యక్తిత్వానికి అద్దం పట్టే శ్లోకం. పరశురాముడి ముందు భాగాన-అంటే ముఖంలో నాలుగు వేదాలు, వెనుక వైపున అంటే వీపు మీద బాణాలూ, విల్లూ. ఇదే బ్రాహ్మణత్వం! ఇదే క్షాత్రం! శాపాలు పెట్టడంలోనూ; శరాలతో కొట్టడంలోనూ!విడమరిచి చెప్పుకోవాలంటే-పరశురాముడిలో వేద విజ్ఞానం ఉంది. శపించే శక్తి ఉంది. అది బ్రాహ్మణ లక్షణం. ఆయన వెనక వైపున విల్లూ, బాణాలున్నాయి. శరసంధానం చేసి తునుమాడే శక్తీ ఉంది. అది క్షత్రియ లక్షణం. అంటే పరశురాముడిలో బ్రాహ్మణత్వమూ, క్షత్రియత్వమూ పెనవేసుకుని ఉన్నాయన్నమాట! వేద విజ్ఞాన ఖని అయిన బ్రాహ్మణుడిలాగా ఆయన శపించి, తపించజేయగలడు. ధనుర్విద్యానిపుణుడైన క్షత్రియుడిలాగా శర పరంపర చేత పరలోకానికి పంపగలడు!భగవాన్‌ పరశురాముడిలో ఈ రెండు లక్షణాలూ మహా తీక్షణమైనవే! ద్విముఖమైన ఈ విశిష్ఠతతో బాటు ఆయనలో మరెన్నో విశిష్ఠతులున్నాయి!’’ అర్థమైందా అన్నట్టు శిష్యుల వైపు చూశాడు నిర్వికల్పానంద.

‘‘గురువు గారూ, ఆ విశిష్ఠతలేమిటో చెప్పండి’’ సదానందుడు కుతూహలంగా అడిగాడు.‘‘వినండి’’ నిర్వికల్పానంద ఉత్సాహంగా అన్నాడు.‘‘పరశురాముడు శ్రీరామచంద్రుడి కన్నా ముందు జన్మించాడు. రామావతార సమయంలో ఉన్నాడు. రామావతారం ముగిసిన తర్వాత కూడా ఉన్నాడు! శ్రీకృష్ణావతార కాలంలో కూడా ఆయన ఉన్నాడు. అంటే రామాయణ కాలమైన త్రేతాయుగంలోనూ, భారత భాగవతాల కాలమైన ద్వాపర యుగంలోనూ పరశురాముడు సజీవంగా ఉన్నాడు. ఆయనకు రామయణంతోనూ, మహాభారతంలోనూ ప్రత్యక్ష సంబంధం ఉంది. క్రమానుగతంగా ఆ కథనాలను శ్రవణం చేద్దాం.పరశురాముడు శ్రీమహావిష్ణువు ఆరవ అవతారం. ఆయన భృగువంశంలో అవతరించాడు. అందుకే ఆయనకు భార్గవరాముడు అనే నామధేయం కూడా ఉంది. భృగు వంశానికి మూల పురుషుడు ఎవరో తెలుసా? బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన భృగువు. భృగు మహర్షి భార్య పులోమ. ఆమె హిరణ్యకశ్యపుడి కూతురు. పులోమా భృగుమహర్షి దంపతుల కుమారుడు చ్యవనుడు. చ్యవనుడికి ఇద్దరు భార్యలు. సుకన్య ప్రథమ పత్ని. ద్వితీయ పత్ని ఆరుషి.ఔర్వుడు చ్యవనుడిపుత్రుడు.

తల్లి ఆరుషి. తల్లి ఊరువు(తొడ) నుండీ జన్మించిన కారణంగా చ్యవన పుత్రుడికి ఔర్వుడు అనే సార్థక నామధేయం లభించింది. ఔర్వునికి ఒక కుమారుడు కలిగాడు. ఆయన పేరు ‘రుచీకుడు’.రుచీకుడు విశ్వామిత్ర మహర్షి అక్కగారైన సత్యవతిని వివాహం చేసుకున్నాడు. సత్యవతీ రుచీక దంపతులకు జన్మించిన వాడే జమదగ్ని. జమదగ్ని భార్య రేణుక. జమదగ్నీ రేణుకల పుత్రుడే పరశురాముడు! పరశురాముడి తండ్రిగారైన జమదగ్ని జన్మగాథతో ప్రారంభించి, భగవాన్‌ పరశురాముడి చరిత్ర శ్రవణం చేద్దాం!’’ నిర్వికల్పానంద ఆగాడు.‘‘జమదగ్ని జనన వృత్తాంతంలో ఏదో ప్రత్యేకత ఉంటుంది! అందుకే గురువుగారు ఆయన జననంతో ప్రారంభిస్తున్నారు!’’ శివానందుడు చిరునవ్వుతో అన్నాడు.‘‘విశేష కథనాలు వినసొంపుగా ఉంటాయి, శివానందా’’ చిదానందుడు అన్నాడు.‘‘ఔర్వుని కుమారుడైన రుచీకుడు గాధిరాజు కుమార్తె సత్యవతిని కోరి వివాహం చేసుకొన్నాడు...’’ నిర్వికల్పానంద చెప్పసాగేడు..

నూతన వధువు సత్యవతి భర్త రుచీకుడిని సమీపించి, సిగ్గుతో తలవాల్చి నిలుచుంది. రుచీకుడు ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు.