‘చెల్లుకు చెల్లు’ పై తస్లిమా

 

తస్లీమా నస్రీన్‌ ‘చెల్లుకు చెల్లు’ ధారావాహిక చదివాక, పాఠకుల నుంచి రకరకాల అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం అయినాయి. పంతానికి పోయి ఒక స్త్రీ శీలాన్ని పోగొట్టుకోవడం గొప్ప పరిష్కారం యెట్లా అవుతుందని కొందరి ప్రశ్న. అందరి అభిప్రాయాల సారాన్ని ఆమెముందుంచి, తస్లీమా ఏమంటారో తెలుసుకుని, అనువదించిన వెనిగళ్ల కోమల యీ వివరణ అందించారు. దానిని యథాతథంగా పాఠకులకు అందిస్తున్నాం.

షోధ్‌ (గెట్‌ ఈవెన్‌-Revenge ) చెల్లుకు చెల్లు నవలలో తస్లీమా ప్రత్యేక ధోరణిని అవలంబించారు. వింతపోకడగా చదువరులకు అనిపించి అమ్మో! తస్లీమా ఇలా చెపుతున్నారేంటి అనుకుంటారు.ఝూముర్‌ ప్రేమించి, పెళ్ళాడిన భర్త హరూన్‌ ఆమెను అనుమానించి గర్భ విచ్ఛిత్తి చేయిస్తాడు. ఆమె కన్య అని రుజువు పరుచుకొని పెళ్ళాడాడు. ఆమె యూనివర్సిటీ చదువు చదివింది. మంచి కుటుంబం నుంచి వచ్చింది. స్వేచ్ఛను ప్రేమించినా అవధులెపడూ దాటని వ్యక్తి. భర్త పతిత అని అంటే అవమానభారం ఒక పక్క, భర్త ద్వారా కనబోతున్న బిడ్డను కడుపులోనే చంపించిన భర్త మీద ఆగ్రహం, కడుపు కోతతో కొంతకాలం కుతకుతలాడిపోతుంది. ప్రతీకారేచ్ఛ ప్రబలి పొరుగున ఉన్న ఆర్టిస్ట్‌తో తాత్కాలిక సంబంధం పెట్టుకుని కొడుకుని కంటుంది. భర్త బిడ్డడుగానే చలామణి చేస్తుంది. ఇదేమి సాహసం, ఇదేమి దుర్నీతి అని చదువరులు దిగ్ర్భాంతి చెందితే ఆశ్చర్యం లేదు.ఈ నవలనర్థం చేసుకోటానికి తస్లీమానస్రీన్‌ జీవితం పూర్వపరాలు తెలియాలి. ఆమె అనుభవాలు, స్త్రీగా పుట్టటమే నేరంగా మగవారి చేతుల్లో పడిన అవహేళనలు, అవమానాలు, బంగ్లాస్త్రీల దుర్భర జీవితం, పితృస్వామ్య వ్యవస్థలో మగవారి మీద ఆధారపడి స్త్రీలు జీవించటం, ఇది చాలదంటూ మత ఛాందసులు దేవుని పేరుతో స్త్రీల మీద బలవంతంగా రుద్దుతున్న మూఢాచారాలు - అన్నీ కలబోసి ఆమె స్త్రీవాద రచయిత్రిగా ఎదగటానికి ఎలా దోహదం చేశాయో తెలుసుకోవాలి. ఆమె స్త్రీవాద రచనల్లో ఉగ్రవాదిగా నిలిచారు. ఎదురీదుతున్నారు.

మగవారి అహంకారం, పెత్తనం, క్రూరత్వం పట్ల ఆమె కసి, క్రోధం, అసహ్యం, వారి మీద తిరగబడి తమ హక్కులను సంపాదించుకోవటానికి పోరాడమని మహిళలను జాగృతం చేయటం ఆమె లక్ష్యం. పుట్టుకతోనే మగవారికి అన్ని హక్కులు సంక్రమిస్తాయి. ఈ విషయంలో ఆమె ప్రాచుర్యంలో ఉన్న బంగ్లా సాహిత్యాన్ని ఆమోదించలేదు. మరి స్త్రీ పట్ల ఈ వివక్ష దేనికి అని ప్రశ్నిస్తున్నారామె. రచనలు చేస్తున్న స్త్రీలు మృదువైన భాషను వాడాలి, అణకువ ప్రదర్శించాలి, మగవాడిని ఎట్టిపరిస్థితులలోనూ శత్రువుగా చూపరాదు అని చెప్పే రచయితలను త్రోసిరాజన్నారు. తన భావాలను ప్రస్ఫుటంగా, నిస్సంకోచంగా, బాహాటంగా, బలమైన భాషలో రాశారామె. పురుషులు స్త్రీ హక్కులను కాలదొక్కితే, స్త్రీని వస్తువుగా, ఆస్తిగా భావించి మొఖం మొత్తితే విసిరేసే పద్ధతిని ఆమె పూర్తిగా వ్యతిరేకించారు. ఆడవారిని చైతన్యపరచే దిశలోనే గద్యం, పద్యం, వ్యాసాలు, నవలలు రాశారు. రాస్తూన్నారు.షోధ్‌ (చెల్లుకు చెల్లు) లో ఝూమర్‌ అలీన నడవడిని, పవిత్రతను ఖూనీ చేసిన భర్త మీద వివాహేతర సంబంధం ద్వారా కసి తీర్చుకున్నది. నవలంతా ప్రథమా విభక్తి ( ఐ-ఐ) లోనే నడిచింది.

ఇలా చెప్పటం తస్లీమా ప్రత్యేకత. ఆమె స్వీయ అనుభవాలే ఈ నవలకు ప్రాణం పోసాయి. ఇందులో ఆమె ఎలీట్‌ (ఉన్నత) సమాజకుల మధ్య ప్రేమ, పెళ్ళి అనే జీవన సంబంధాలను విప్లవాత్మకంగా లేవనెత్తారు. స్త్రీకి ప్రేమికురాలిగా, భార్యగా, కోడలుగా, తల్లిగా చేపట్టవలసిన విధులను ఆధారం చేసుకొని ప్రేమ, పెళ్ళికి నిర్వచనం చెపుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయత, నమ్మకం ఉండవలసిన విషయాలు. అనుమానాలతో స్త్రీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే పరిస్థితులలో ప్రేమ ఎలా పెంపొందుతుంది అని ప్రశ్నిస్తారామె. ఆమె రచనలన్నీ ఈ విషయాన్ని ఎత్తి చూపుతున్నాయి. పెండ్లిలోని పవిత్రత దెబ్బతిన్నపడు స్త్రీ మనసు, కోర్కెలు, ప్రేమ, పెళ్ళి అనే విషయాలు పలచబడి, చులకన చేయబడతాయి. ప్రేమ, గౌరవమర్యాదలు పాటించని భర్తతో స్త్రీమనుగడ ప్రశ్నార్థకమే అవుతుందని తస్లీమా నమ్ముతారు.