చివరకు మిగిలింది?

మూలం: మార్గరెట్‌ మిచ్చెల్‌

అనువాదం: ఎంవీ రమణారెడ్డి

ఈ చారిత్రాత్మక నవలతో శ్రీమతి మార్గరెట్‌ మిచ్చెల్‌గారు ఒక చరిత్రను సృష్టించారు. ఈ నవలకు పాఠకుల నుండి అందిన ఆదరణ టూకీగా చెప్పాలంటే అమ్మకాల్లో బైబిల్‌ తరువాత ఇదే ప్రథమంగా నిలిచింది. 1936లో అచ్చయింది మొదలు 1998 వరకు ప్రపంచవ్యాప్తంగా రెండుకోట్ల కాపీలు అమ్ముడుబోయి రికార్డును సృష్టించింది. 1937లో ప్రతిష్టాత్మకమైన ‘పలిట్జెర్‌ బహుమతి’ సంపాదించింది. నవల ప్రజల్లోకి వెళ్లిన రెండేళ్లకే, దాని సినిమా హక్కులకోసం హాలీవుడ్‌ పరిశ్రమ పోటీ పడింది. సినిమాగా తయారై 1939లో విడుదలైన ‘గాన్‌ విత్‌ ద విండ్‌’ నవల ‘ఉత్తమ చిత్రం’ బహుమతితోపాటు మరో 9 అకేడమీ అవార్డులుసంపాదించి రికార్డును బద్దలుకొట్టింది. ప్రేక్షకులపరంగా, దాదాపు ఇరవైకోట్లమంది ఆ సినిమాను చూసుంటారని నిర్మాతల అంచనా.1861లో మొదలైన అమెరికా సంయుక్తరాష్ట్రాల అంతర్యుద్ధం నేపథ్యంగా ఈ నవల ఒక స్త్రీ జీవితాన్నీ, అంతరంగాన్నీ భూమికగా చిత్రించింది. అమెరికన్‌ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ పట్టుదల కారణంగా, అప్పటికే చివరిమెట్టుకు చేరిన బానిసవిధానం, భూస్వామ్య విధానాలు ఎంత అవలీలగా కూలిపోయాయో ఇందులో కళ్ళకు కట్టినట్టు మనకు అగుపిస్తుంది.

ప్రేమ, యుద్ధం, సంస్కృతి అనే మూడు వేరువేరు పాయలను జడగా అల్లి, సాహితీసౌందర్యానికి కానుకగా అర్పించిన శ్రీమతి మార్గరెట్‌ మిచ్చెల్‌ ఒకేవొక నవలతో పాఠకుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. 1923 నుండి 2005 వరకు వెలువడిన వంద ప్రఖ్యాత ఇంగ్లీషు నవలల జాబితాలో ‘గాన్‌ విత్‌ ద విండ్‌’ను అగ్రగాముల్లో ఒకటిగా ‘టైమ్‌’ పత్రిక కీర్తించింది.ఈ రచయిత్రి 8 నవంబర్‌ 1900న అమెరికాలోని అట్లాంటా నగరంలో నివసించే సంపన్న కుటుంబంలో పుట్టింది. తండ్రి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. తల్లి మహిళా హక్కుల ఉద్యమకారిణి. 1914 నుండి 1918 దాకా అట్లాంటాలోని ‘వాషింగ్టన్‌ సెమినరీ’లో ఉన్నత విద్య పూర్తిచేసింది. ఇంకా పై చదువులకు ‘మచూటప్‌’ వెళ్ళింది గానీ, అక్కడ ఉండలేక వెంటనే తిరిగొచ్చింది. 1922 నుండి 26 వరకు ఆమె ‘అట్లాంటా జర్నల్‌’కు కాలమిస్టుగా పనిజేసింది. అదే సమయంలో ఆమె వైవాహిక జీవితం ఒడిదుడుకులతో మొదలైంది. 1922లో పెళ్ళాడిన మొదటి భర్త ఒక పెద్ద తాగుబోతు. భరించడం సాధ్యపడక ఆరు నెలలకే అతన్ని వదిలేసింది. 1925లో జూన్‌ మార్ష్‌ను పెళ్ళాడింది. రెండో పెళ్ళితో ఆమె జీవితం కుదుట పడింది. కానీ-ఆ మరుసటి సంవత్సరమే ఆమెకు మడమ విరిగి మంచం పట్టింది. చికిత్స పొందుతున్న సమయంలో భర్త ఆమెకు అన్నివిధాలా సహకరించాడు. గ్రంథాలయంనుండి చరిత్రకు సంబంధించిన పుస్తకాలెన్నో తీసుకొచ్చి చదివించాడు. సొంతంగా ఆమెతో నవలను రాయించడానికి పరిపరి విధాల ప్రోత్సహించాడు. ఆమె నవలను మొదలెట్టింది.

అతడు ప్రూఫులు దిద్దుతూ సలహాలు అందించాడు.చాలా పెద్ద నవల; పూర్తికావడానికి ఐదేళ్ళు పట్టింది. పూర్తయినట్టు ఆ భార్యాభర్తలకు తప్ప మరెవరికీ తెలీదు. బయటికి చెప్పాలంటే వాళ్ళకు సాహసం చాలలేదు. దానివల్ల, ఆ ప్రతిభ ఆరేళ్ళపాటు చీకట్లో ఉండిపోయింది.1935లో మ్యాక్మిలన్‌ ప్రచురణ ప్రకాశకుడు హెరాల్డ్‌ లేథమ్‌ అట్లాంటా వచ్చాడు. దక్షిణాదినుండి సత్తా కలిగిన రచయితలను ఏరుకోవడం అతని ప్రణాళిక. జార్జియారాష్ట్రంలోని రచయితలను తనకు పరిచయం చేసేందుకు మిచ్చెల్‌ సహాయం అర్థించాడు. ఆమె ఒప్పుకుంది. ఆ ఇద్దరూ రాష్ట్రంలో పర్యటించే సందర్భంలో లేథమ్‌, ‘‘మీరేదైనా పుస్తకం రాస్తే నాకు తప్పకుండా చూపించండి.’’ అన్నాడు మిచ్చెల్‌తో. అది విన్న ఒక స్నేహితురాలు ‘‘ఈ మిచ్చెల్‌ ఎక్కడ, పుస్తకం రాయడమెక్కడ? ఊహించడానికైనా వీలయ్యేదా?’’ అంటూ హేలన చేసింది.