‘‘అయామ్‌ సారీ సరళా! ఇంకా భరించటం నావల్ల కావట్లేదు..’’-బాధని అణుచుకుంటూ అన్నాను.‘‘కూల్‌డౌన్‌ స్వప్నా! ఇది ఒక్కరోజు సమస్య కాదుకదా..?’’ అనునయంగా చెప్పింది సరళ - నచ్చజెప్పటానికి ప్రయత్నిస్తూ.‘‘కాదు సరళా! సమస్యకి పరిష్కారంగానే ఒక నిర్ణయానికి రావాలనుకుంటున్నాను. ఒకసారి లాయర్‌ని కలవాలి.. వస్తావా?’’‘‘ఓ.. ష్యూర్‌.. తప్పకుండా.. సరేనా? ముందు రిలాక్స్‌ అవు! కంప్యూటర్‌ ఫీడ్‌వర్క్‌ ఒక్కటీ నువ్వు చెయ్యి.. పేమెంట్స్‌లో ఈరోజు నేను కూచుంటాను. అదీ చెయ్యలేకపోతే అకౌంటెంట్‌గారితో నేను చెప్పనా?’’సరళ చూపుతున్న శ్రద్ధకి చెప్పలేనంత సంతోషం కలుగుతుంటుంది.‘‘వద్దు సరళా.. చెయ్యగలను!’’‘సరళ స్నేహం - తన పేరంత సరళంగా, సున్నితంగా, హృద్యంగా వుంటుంది’ అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. వర్క్‌లో పడ్డాక కొంత ఆటోమేటిక్‌గా డైవర్ట్‌ అవటం ఎవరి విషయంలోనైనా జరుగుతుంది. నా విషయంలోనూ జరిగింది.‘‘హలో... మేమ్‌! లంచ్‌ అవర్‌లో కూడా వర్క్‌ చేస్తే ఏమన్నా ఓ.టి. ఇస్తామని ప్రకటించారా?’’శరత్‌ ప్రశ్నకి తలెత్తి చూశాను. సమాధానం ఏమీ ఇవ్వకుండా ఓ చిన్ననవ్వు నవ్వి డ్రాయర్‌ సొరుగులు లాక్‌ చేసి, లంచ్‌బాక్స్‌ తీసుకుని స్టాఫ్‌రూమ్‌లో కొచ్చాను... శరత్‌తో బాటు.సరళ, సునంద, సుకుమార్‌.. అప్పటికే వచ్చి వున్నారు. మేము అయిదుగురం కలిసి లంచ్‌ చేస్తుంటాం. సనళ, నేను, సుకుమార్‌ మేరీడ్‌. శరత్‌ వాళ్ళన్నయ్య లాయర్‌, వదిన హౌస్‌వైఫ్‌. శరత్‌ వాళ్ళతోనే వుంటాడు. వాళ్ళింట్లో మిగతా అంతా తెనాలిలో వుంటారు. సునంద వర్కింగ్‌ వుమెన్స్‌ హాస్టల్‌లో వుంటుంది... ఎవరింట్లోనూ వుండటం ఇష్టంలేక. ఊర్లో బంధువులున్నారు.

వాళ్ళ నాన్న స్కూల్‌ టీచర్‌, ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలు... వాళ్ళంతా రాజమండ్రిలో వుంటారు. తల్లి చిన్నతంలోనే పోయింది.సునంద, శరత్‌ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నట్టు అప్పుడప్పుడు వేసుకునే చూపుల బాణాలు చెప్తూ వుంటాయి. వాళ్ళ చెణుకులు, విసుర్లు.. ఆ తమాషా అంతా మేం గమనిస్తూ ఎంజాయ్‌ చేస్తుంటాం. ఆ గంట లంచ్‌ అవర్‌ చాలా త్వరగా గడిచిపోతుంటుంది.సుకుమార్‌.. ఆ పేరుకి తగ్గట్టు సుకుమారంగా వుంటాడు- ఎప్పుడూ మడత నలగని బట్టల్లో, చెదరని క్రాఫ్‌తో. వాళ్ళావిడ గొప్పలు చెప్పుకోవటానికి అతనికి వుండే టైమ్‌ సరిపోదు. చివరికి ఆమె ‘నూడిల్స్‌’ టిఫిన్‌ బాక్స్‌లో ఇచ్చినా- ఏదో.. పాయసం చేసినంత సంబరం!మేమంతా ఒకే బ్యాచ్‌లో బ్యాంక్‌లో జాయిన్‌ అయ్యాం. సుకుమార్‌ ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా వాళ్ళింటికి పిలవలేదు - వాళ్ళావిడ ఎక్కడ కష్టపడిపోతుందో, అలసిపోతుందోనని! చాలా పనులు అతనే చేస్తాట్ట..! అలా అని వినికిడి!!

శరత్‌ వాళ్ళన్నయ్య - కొడుకు బర్త్‌డేకి పిలిస్తే, ఓసారి వెళ్లాం. చాలా బాగా, గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. సరళ వాళ్ళమ్మగారు సరళతోనే వుంటారు. వాళ్ళాయన మెడికల్‌ రిప్రెజెంటేటివ్‌... ఎక్కువగా క్యాంప్‌లలో వుంటారు. సరళ అందరితోనూ స్నేహంగా వుంటుంది.ఇంక మిగిలింది.. మా ఐదుగురిలో నేను!ఏం చెప్పుకోను? నా గురించి నేనేం చెప్పుకోను? ‘నా కాళ్లమీద నేను నిలబడితే గానీ పెళ్ళి వద్దు’ అనుకుని... కష్టపడి బ్యాంక్‌ జాబ్‌ తెచ్చుకుంది. తెలిసిన వాళ్ళలోనైతే ‘గెంతెమ్మ కోరికలుండవు, మంచివాళ్ళు’ అంటూ రామ్మోహన్‌, ఎల్‌.ఐ.సి. ఫీల్డ్‌ ఆఫీసర్‌కిచ్చి ఘనంగా పెళ్ళి చేశారు.