తమిళ మూలం: కీరా

అనువాదం: నంద్యాల నారాయణ రెడ్డి

పల్లె మత్తు తొంగు (నిద్ర)లో మునిగి ఉంది. కడవ పగిలి నేలంతా చిందిన పాలపోలె మిన్నులో వెన్నెల వెలుగు చల్లగా పరచుకొని ఉంది. ఆగి ఆగి తోలిన పైరగాలి అప్పుడే సుంత ఒదిగింది.ఎరగని దవ్వుల నుంచి ఎగిరి వచ్చిన తోలుగువ్వ (గబ్బిళా)లు కమ్మకట్టమీది అత్తిమాకుల్లో దూరి పొట్ట నిండా పండ్లు తిని, వాటి తావులకు మరలుతున్న పొద్దు.రేయి మనుము (జీవు)ల కూతలు మెల్లమెల్లగా అణుగుతున్నాయి. పిల్లులు వేటను ముగించి ఇళ్లు చేరుతున్నాయి. గూబలు, రాతి గూబలు గూళ్లకు మళ్లుతున్నాయి. పందికొక్కులు వాటి కలుగుల వైపు పరుగులు తీస్తున్నాయి. రీ అని గీ పెట్టిన ఈలకోళ్లు, నోళ్లకు విడుపునిచ్చి కుక్కలు వాటి కావలి పనిని ముగించుకొని మూలల్లో ముడుక్కొంటున్నాయి. రేయి పడక పరుచుకొంటూ ఉంటే, పగలు లేచి పక్క దులుపుకొనే పొద్దు.పగటి మనుము (జీవు)లలో తొలి మెలకువ జీవి, కోడిపుంజు రెక్కల తప్పెటను టప్పుటప్పున మోగిస్తూ, లేవండహో అంటూ కూతలు పెట్టి పల్లెను లేపుతున్నది. జీనివాయిలు, జిట్టి గువ్వలు, పోలువాయిలు, పొట్టి పిట్టలు జిలిబిలి పలుకులను తొలుకొంటున్నాయి. కాకులు కూడా కరకర అరుపులను అందుకొన్నాయి.గుడి నుంచి వలమురి (శంఖ) ఉలివు (నాదం), నగారా సద్దు వెలువడుతూ ఉన్నాయి.కడ కునుకు సోమరితనాన్ని వీడి, ఒళ్లు విరుచుకొంటున్నది పల్లె. ఆవులింతల అలికిడులు వినబడుతున్నాయి.

కౌగిలిలో అంటుకుపోయిన మేనులు విడి వడుతూ ఆడే చిలిపి చెణుకాటలు.పసి బిడ్డలు అమ్మ ఒడిలో పడుకొని తల్లి తాళితోనో ఆవలి చన్నుతోనో ఆడుకొంటూ, పాలు తాగుతూ చేసే చిరు చప్పరింతల సవ్వడులు.పెద్దలు పిల్లలను లేపడానికి చేస్తున్న గాదిలి (ప్రియమైన) గద్దింపులు. తలుపుల కీళ్ల కీచుకీచులు.ముంగిళ్ల ముందు కళ్లాపి చల్లే గాజుల గల గలలు.పాలకోసం ఆకొన్న లేగల అరుపులు. బిగిసిన పొదుగులతో బిడ్డల కేకలకు ఎదురుపలికే అమ్మ ఆవుల కెరకొట్టులు.బతుకు కళను పుంజుకొంటూ నానాటి పనులవైపు పల్లె కదలిక మొదలయింది.పెద్దలు వంకలకూ, పిల్లలు తెరువులకూ కదలినారు. లోబరువును వెలికి నెట్టి తనను వెలచు(శుభ్రపరచు)కొన్న పల్లె, ఆ ఎలపాలా(పరిసరా)న్ని ఎరబర(పాడు) చేసింది.తెరువులోకి వచ్చి, తన బిడ్డను పేరుపెట్టి, ఎలుగెత్తి పిలుస్తున్నది ఒక తల్లి.ఊరి బావి నుండి నీళ్లు చేదుతున్న చేదల సద్దు. ఒక కోడెవాడు పుల్లతో పళ్లు తోముకొంటూ, నీళ్లు చేదే ఆడవాళ్లను ఓరకంట చూస్తూ ఉన్నాడు.తొర్రుపట్టు (కొట్టా)ల్లోని రాతిరోళ్లలో పత్తి విత్తులు రుబ్బుతున్న చప్పుడు వినవస్తూ ఉంది.లేతపొద్దు నునివెలుగులో ఇప్పుడు పల్లె గ్రుంకులిడుతూ ఉంది.పిల్లలు ఆనాటి తమ ఆటలను ఆడడం మొదలుపెట్టినారు. పెద్దలు ఆనాటి తమ పనులలో తలమునకలు అవుతున్నారు.ఊరికి పైతెరువులోని ఆ మిద్దె ఇంటినే కోటవారిల్లు అని అంటారు. కోటకట్టి ఏలినందువల్ల ఆ పేరు రాలేదు. కానీ ఆ ఇంటి చుట్టూ ఒక కాలంలో కోటగోడ ఉండేది. అందువల్లనే కావచ్చు ఆ ఊర్లోనే కాదు పక్క ఊర్ల వాళ్లు కూడా ఆ ఇంటి వారిని కోటవారు అనే పిలుస్తారు.