‘‘ఇది నీ ఆఖరి మజిలీ’’ దగధగా ప్రకాశించే ఓ అస్పష్టమైన ఆకారం నా కళ్ళముందు నిలిచింది.కాళ్ళూ, చేతులు కదలడం లేదు.‘ఎవరు’ అని అడగబోయాను. మాట రావడం లేదు.‘‘నీ అస్థిత్వాన్ని అయిన నన్నే ఎవరని అడుగుతున్నావా’’ కళ్ళు చికిలించి చూశాను. అది నేనే!‘ఓ! అంతరాత్మవా’ అయిష్టంగానే అన్నాను. నాకూ, అంతరాత్మకీ ఎపడూ పడదు.‘‘పిచ్చివాడా! నీలోని సత్యాన్ని నేను. నన్ను కనుగొనాలనే ఆలోచనే నీకు లేదు. ఎంతసేపూ అశాశ్వతమైన ఆనందాలకోసం, క్షణికమైన సంతృప్తులకోసం ప్రాకులాడావు. ఎపడు నిన్ను వారించినా, నా నోరుమూసి, లోపలికి నెట్టావు. జీవితమంతా వ్యర్థం చేసుకున్నావు. ఇపడిక నన్ను అడ్డుకునే శక్తి నీకు లేదులే’’.నాకు కోపం వచ్చింది. ‘‘గెటౌట్‌! సారీ, గెటిన్‌! ఇది నా ఆఖరి సమయమంటున్నావ్‌. మరి ఆ కాస్త టైంలో నీ గీతోపదేశం నాకొద్దు. మరొక్కసారి తనివితీరా నా జీవితాన్ని తలచుకోనీ. నా బాల్యం, పసిడి రేకుల పరువం, ఫ్యామిలీ లైఫ్‌, అన్నిటినీ నెమరేసుకుంటాను. టైం వేస్ట్‌ చేయకు, పో’’నాలోనే ప్రతిధ్వనించే ఈ మాటలకీ, కోపానికీ బెదిరిపోయి, ఆ రూపం అదృశ్యమయింది. నేను కళ్ళు మూసుకోబోతూ పై రూఫ్‌ వంక చూసి ఆశ్చర్యపోయాను. ఒక సినిమా స్ర్కీన్‌లా దర్శనమిచ్చింది. దానిపైన కదిలే బొమ్మలు.‘అరె. ఆ ముద్దులొలికే పిల్లాడెవరు? ఇంకెవరు? చిన్నప్పటి నేనే! అబ్బో! ఆ చిలిపి చేష్టలు చూడు’ మురిసేలోపే సీన్‌ మారింది. స్కూల్‌ లైఫ్‌! ‘అయ్యో మనసారా చూడనివ్వరేం’!ఇంతలో కాలేజ్‌ డేస్‌! ‘వావ్‌! మై మోస్ట్‌ లవబుల్‌ ఫేజ్‌. ఎవరికైనా యవ్వన కాలాన్ని రొమాన్స్‌ని బీట్‌చేసే అనుభూతులు ఉండవేమో. ‘అయ్యో! అపడే అయిపోయింది!’‘‘రిమోట్‌ ఏదిరా’’ కేకవేయబోయి, నా అశక్తత గుర్తొచ్చి ఆగిపోయాను. నిస్సహాయంగా కళ్ళెదుట కన్పించే సీన్స్‌ చూస్తున్నా.

మరో 5, 6 నిముషాల్లో, గంట క్రితం దాకా జరిగిన ప్రతి సంఘటన రిపీటై ఆగింది. స్ర్కీన్‌ కూడా క్లోజ్డ్‌. కళ్ళనుంచి నీరు.నిజంగా చచ్చిపోతానా? భయంగా ఉంది.దేవుడా! నొప్పి, బాధ లేకుండా తీసుకుపో, రామనామం జపించనా?‘రాముడు పెద్ద ఇగోయిస్ట్‌. తన గొప్పకోసమే బ్రతికాడు. సీతకి అన్యాయం చేసిన డిక్టేటర్‌’ అంటూ ఓ ఉమెన్స్‌డే రోజు స్పీచ్‌ ఇచ్చి ఆడపిల్లల అభినందనలు పొందానే!పోనీ కృష్ణుడు? ‘పాండవులది అన్యాయం, దుర్యోధనుడిదే కరెక్ట్‌. పాండవ పక్షపాతి అయిన శ్రీకృష్ణుడో పొలిటీషియన్‌’ అని కాలేజీ మ్యాగజైన్‌కి రాసి చచ్చానే? వాళ్ళకవి గుర్తుంటే? పోనీ... శివా, వెంకటేశా, జగన్మాతా, అయ్యప్పస్వామీ!‘నేను కూడా చచ్చిపోతానా? ఆ..ఖ..రి..కి నేను కూడా?’ఇన్నాళ్ళూ ఎవరైనా పోయారని వినగానే ‘అయ్యో పాపం’ అని జాలిపడేవాడిని. అక్కడికి నేనేదో చిరంజీవినైనట్లు! ఈరోజు, నాకు అర్థం అయిపోయింది. ఆఖరికి... నాకూ చావు తప్పదన్నమాట. ఒక దుఃఖం తెర నన్ను బంధిస్తోంది. ‘ఈ ప్రపంచం కలో, మాయో ఏరోజూ ఆలోచించలేదు. అంత టైం ఏది? బిజీ లైఫ్‌! ఒక్కక్షణం ఖాళీ లేదు. ఇపడు మరణశయ్య మీదున్నాను. బోలెడంత సమయం ఉన్నట్లు అన్పిస్తుంది, కానీ ఈ ప్రపంచానికి ఇక నన్ను భరించే టైం లేదు.ఇన్నేళ్ళుగా ఏం చేశాను? ఏం సాధించాను? పుట్టాను, పెరిగాను, బతికాను. నా ఫ్యామిలీ, మాట్లాటలు, పోట్లాటలు, స్నేహాలు, సరసాలు, పెట్టుపోతలు తిరిగి పొందడాలు, అభిరుచులు, అనుభూతులు, కలతలు, కలహాలు ఇవన్నీ నన్ను కమ్మేశాయి. వీటన్నిటి నుంచి విడివడి ‘నేను’ అంటూ అసలున్నానా! ‘ఫలానా వారి సంతానం’, ‘ఆ ఆఫీసులో ఉద్యోగి’, ‘ఆవిడ భర్త’, ‘వాళ్ళ నాన్నగారు’ ఇవేనా నాకు గుర్తింపునిచ్చే మాటలు.నా హయాంలో ఉన్నన్నాళ్లూ నా నిర్ణయాలు చెల్లించుకున్నాను. కొన్ని అపలు, ఆస్తులు చేసుకున్నాను. రిటైర్‌ అయ్యాక బాధ్యతలు తగ్గాయి. నా ఇంపార్టెన్స్‌, పవర్‌ లాక్కోబడ్డాయి. కొంత టైం మిగిలింది. బలవంతంగా ఆధ్యాత్మిక చింతనవైపు నెట్టబడ్డాను. అక్కడా ఏమంత ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేదు. ఇక ఇపడు, ‘అంతా అయిపోయింది’ అనుకుంటుంటే ఏదో వ్యథగా ఉంది. ‘మరింత బాగా జీవించి ఉండాల్సి ఉంది’ అనిపిస్తుంది.