రచయిత్రి కె. ప్రవీణరెడ్డి పరిచయం

2004 జనవరిలో రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టిన ప్రవీణరెడ్డి స్వల్ప వ్యవధిలోనే రచయిత్రిగా మంచిపేరు తెచ్చుకున్నారు. కథారచనతో ఆమె రచనా ప్రస్థానం ప్రారంభమైంది. వివిధ వార, మాస పత్రికలలో యిరవై కథలు ప్రచురితమైనాయి. చతురలో ‘‘ఇది జీవితం’’ నవలిక వెలువడింది. నవ్య వీక్లిలో ‘‘ప్రియురాలు పిలిచె రావోయీ’’ ధారావాహిక వెలువడి పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది. ‘‘హితుడా! ఓ రహస్య స్నేహితుడా’’ నవ్యలో వచ్చిన రెండవ సీరియల్‌. ఇది స్పి్లౌట్‌ పర్సనాలిటీని ఛాయామాత్రంగా చూపించి, సస్పెన్స్‌ ప్రధానంగా నడిపిన యితివృత్తం. స్పి్లౌట్‌ పర్సనాలిటీ అనేది ఒక మానసిక వ్యాధి. 1896లో జర్మన్‌ మనస్తత్వవేత్త ఎమిల్‌క్రెప్లిన్‌ పిచ్చికి తొలిదశగా (Dementia precot) అభివర్ణించాడు. స్విస్‌ సైకాలజిస్ట్‌ యూగెన్‌ బ్లూయర్‌ యీ అభిప్రాయంతో ఏకీభవించలేదు. 1911లో ‘‘స్కిజోఫ్రేనియా’’ అని యీ వ్యాధికి పేరు పెట్టాడు. ఇది గ్రీకు భాషాపదం. స్కిజ్‌ అంటే ఆంగ్లంలో ‘‘టు స్పి్లౌట్‌’’ అని, ‘‘ఫ్రెన్‌’’ అంటే మైండ్‌ అని అర్థం. ఈ ద్వంద్వమనస్తత్వంపై తగినంత తెలుసుకుని, యీ కథలో దానిని సందర్భోచితంగా వినియోగించుకున్నారు. ఆమధ్య ఒక సినిమా యిలాంటి పాత్ర ఆధారంగా వచ్చింది. కాని, యీ నవల సుమారు ఏడాది పైగా మా వద్ద పరిశీలనలో వుంది. ఇది పాఠకామోదం పొందిన సీరియల్‌.ప్రవీణరెడ్డి ఎంచుకునే కథ, దానిని నడిపించే తీరు రెండూ ఆసక్తికరంగానే వుంటాయి.

తీవ్రమైన సందేశాలు, అసాధారణ మైన నేపథ్యాలు వుండవు. సగటు పాఠకులను అన్ని దినుసులతో అలరించే ఆలోచన యీమె రచనల్లో కనిపిస్తుంది.సముద్రం, గెలుపు, అద్దంలో చందమామ, ఫ్రెండ్‌, బ్లూబెల్స్‌ కథలు యీమె రచనా శైలితో సహా పఠితలకు జ్ఞాపకం వుండిపోతాయి. ప్రవీణరెడ్డి కథలను పరిశీలించగానే, ఎంపిక చేసిన కొన్నింటిని సంపుటిగా ప్రచురించడానికి విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ముందుకు వచ్చింది. పన్నెండు కథల సమాహారాన్ని ‘‘అద్దంలో చందమామ’’ పేరిట విశాలాంధ్ర అందంగా ప్రచురించి విడుదల చేసింది. తొలి కథా సంపుటి ఒక ప్రఖ్యాత సంస్థ నుంచి రావడం తనకు ఎంతో సంతోషాన్ని యిచ్చిందనీ, ఏ మాత్రం పరిచయం లేని తన కథలను పుస్తక రూపంలో తెచ్చి ప్రోత్సహించిన రాజేశ్వరరావుగారికి ఆమె కృతజ్ఞతలు తెల్పారు. నా అక్షరాలను నేను అచ్చులో చూసుకున్నది 2004లోనే అయినా, అప్పటికి మూడు నాలుగేళ్లు ముందునుంచీ నేను రాస్తూనే వున్నాను. అయితే, అవి నావరకే పరిమితం చేసుకున్నాను. రచనా వ్యాసంగం మా కుటుంబంలో కొత్త. వాటిని ఎవరికి పంపాలో, ఎలా పంపాలో కూడా నాకు తెలియదు. కొందరు నన్ను చూసి ‘‘మీరే రాశారా, మీరే రాస్తారా’’ అని అడిగి నొప్పించిన వారూ వున్నారు. మీరు మంచి వ్యాపకం పెట్టుకున్నారు. కొంచెం కృషి చేస్తే మంచి రచనలు చేయగలరని ప్రోత్సహించిన వారూ వున్నారు. ఆ మాటల్లోంచి వచ్చిన పట్టుదల, యీ మాటల్లోంచి కలిగిన వుత్సాహం నాచేత యీ మాత్రం రాయించాయి. ఈ రచనా ప్రపంచంలోకి వచ్చాక ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నేను సాహిత్యపరంగా చదివింది కూడా తక్కువే. కాలానికి నిలిచే మంచిరచనలు చేయాలన్నది నా కోరిక. నా సీరియల్‌ని ఆదరించిన పాఠకులకు కృతజ్ఞతలు’’ అన్నారు ప్రవీణరెడ్డి యీ సందర్భంగా. రచయిత్రి రంగారెడ్డి జిల్లా, దేవరయాంజాల్‌లో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగారు. ఆర్‌.బి.వి.ఆర్‌.ఆర్‌ మహిళా కళాశాలలో బి.ఏ. చేశారు. భర్త వినోద్‌రెడ్డి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ (యు.ఎస్‌.ఎ), సొంత వ్యాపార వ్యాపకాలలో వున్నారు. కొడుకు, కూతురు యిద్దరూ స్టేట్స్‌లో పి.జి. కోర్సు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి నివాసం హైదరాబాదు. ఈ సంవత్సరమే రచన కాలేజి ఆఫ్‌ జర్నలిజమ్‌లో ‘జర్నలిజమ్‌’ కోర్సు పూర్తిచేశారు.ప్రవీణరెడ్డి తొలి సీరియల్‌ని నవ్య ప్రచురించింది. కొన్ని కథలు కూడా నవ్యలో వచ్చాయి. భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలు యీమె తెలుగు పాఠకులకు అందించగలరని మనసా ఆశిస్తున్నాం.

- నవ్య