నిశీధి.

కాటుక కంటి కంటే ఇండియన్‌ ఇంక్‌ కంటే కారు మబ్బుకంటే నల్లని చీకటి.నల్లటి నీడల్లో కొంచెం తక్కువ ఛాయలో నల్లటి నిటారైన చెట్లు, కాళ్ళకి తగిలి సూదుల్లా గుచ్చు తున్న రాళ్ళు, వెన్నెముక నొణికించే చలి.... ఎటో తెలియకపోతున్నా సరే ముందుకి భారంగా అడుగు తీసి అడుగు వేస్తున్నాడు డాక్టర్‌ రావ్‌.ఒకప్పుడు తన బందీలుగా వుండి ఇప్పుడు తప్పించుకుపోతూ, తన మీద పగతో ఆ గ్రహాంతర వాసులు చేసిన అట్టహాసం తన చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే వుంది.పోలోనియా, పోలినియస్‌జూలియా, జూలియస్‌వాళ్ళ గురువులా వున్న ముసలివాడు హోరా....హైదరాబాద్‌లోని జూబిలీహిల్స్‌ కొండ రాళ్ళ మధ్య తన చుట్టూ చేరడం...వాళ్ళ కళ్ళనుంచి నిప్పురవ్వలు లేసర్‌ కిరణాల్లా తన మీద దాడి చేయడం....‘‘ఆగండి!’’ అని వారించిన హోరా అనే ఆ ముసలివ్యక్తి....‘‘ఇతనికి చావు సరైన శిక్షకాదు! కాల పంజరంలో బందీని చేయడమే... తగిన శిక్ష....!’’ అని వాళ్ళని ఉసిగొల్పడం...వికటంగా సంతోషంగా వాళ్ళు ‘‘బలే బలే ఇదే సరైన శిక్ష’’ అని కేరింతలు కొట్టడం....మరుక్షణంలో మూడు జతల కళ్ళనుంచి వచ్చిన వెలుగు తన కళ్ళని మిరుమిట్లు గొలపడం‘‘డభ్‌’’మన్న పెద్దచప్పుడు, శరీరంలోని కండరాలన్నీ మెలితిరిగినట్టు బాధ, ఎముకల్లో హెలికాప్టర్‌ బ్లేడులు గిరగిరా తిరిగినట్లు ప్రకంపనలు......అగాధంలో కూరుకుపోతున్న భావన...మెలికలు తిరుగుతూ, గిరగిరా గిరగిరా భూమికి అడుగున పాతాళంలోకి పోతున్న ఫీలింగ్‌.కడుపులో తిప్పటం, వర్టిగో! నాసియా (వాంతి వచ్చే ఫీలింగ్‌)!ఇలా అవస్థలు పడి పడి, కొన్ని నిముషాలకి,ధన్‌మన్న చప్పుడులో ఈ నిశీధిలో కీకారణ్యంలో విసిరివేయబడ్డాడు.డాక్టర్‌ రావ్‌కి స్పృహ తప్పింది. కొద్ది నిమిషాల తర్వాతే తెలివి వచ్చింది.

ఒళ్ళంతా భయంకరమైన నొప్పులతో ఎముకలు విరిగాయా అని తడిమి చూసుకున్నాడు....విరగలేదు. కాలు ముందుకు వేసి చేతులు ఆనించి లేచి నిల్చున్నాడు.తల తిరుగుతోంది, చుట్టూ చీకటి, చెట్ల నీడలు, కీకారణ్యం... అవును కాటుకలాంటి, ఇండియన్‌ ఇంక్‌ పూసిన బొమ్మలాంటి అంధకారం, అప్పుడు చెవులకి మెల్లగా వినికిడిలోకి వచ్చిన చప్పుడు....కీచురాళ్ళ మోత. పురాతనమైంది! ఎన్ని శతాబ్దాల క్రితం కాలంలోకి వెనక్కి వెనక్కి విసిరేయ బడ్డాడూ తను!బహుశా తను వాళ్ళని నిర్దేశించి ఇదివరకూ దేశనాయకులని చేసినట్లుగా తననికూడా 18వ శతాబ్దం లోకి విసిరివేశారా?రెండొందల సంవత్సరాల క్రిందటి దక్కన్‌ పీఠభూమియా ఇది లేక దండకారణ్యమా ఇక్కడ ఎవరుంటారు?లేక ఎవరూ లేరా... క్రూరమృగాలు తనని తినేస్తాయా...?కాళ్ళలో నిస్సత్తువ, తలలో తిరగడం...కాల ప్రయాణానికి అలిసిన దేహంలో కరకరా ఆకలి.... దానికి మించిన... భయం భయం... ఏ పులి చెట్ల వెనకనుంచి తన మీద పడుతుందో... ఏ సింహం, ఏ ఆకలి కొన్న చిరుత తనని చీల్చి చెండాడి ఆహారంగా చేసుకుంటుందో...భయం.... ప్రాణాలకోసం... నిత్యం సకల సుఖాలతో ఏసి గదులలో నౌకర్లతో సకల సేవలు చేయించుకునే డాక్టర్‌ రావ్‌కి ఈ అడవిలో ఒంటరి ప్రయాణం చిత్రవధలా అనిపిస్తోంది.... దీనికంటే... తనని ఆ ఇరవై శతాబ్దపు జూబిలీహిల్స్‌లో వారిశక్తులతో కాల్చి బూడిద చేస్తేనే బావుండేది...ఇప్పుడెలా? ఈ కాల పంజరంలో ఎలా బతికేది?.... ఏం చేయాలి?