ఆరోజు ఉగాది!గీత వంటింట్లో పూజాసామాగ్రి సిద్ధం చేసుకుని ఉగాది పచ్చడి చేద్దామని దినుసులన్నీ తీసి ఒకచోట పెట్టింది. ముందురోజు సాయంత్రం భర్త పెరట్లో వున్న వేపచెట్టుని, దాన్నిండా పూసిన వేపపూతని సంబరంగా చూస్తూ -‘‘గీతా! చూశావా! రేపు ఉగాది పచ్చడికోసమని ఎంత వేపపూత పూసిందో!’’ నవ్వుతూ అన్నాడు.గీత విసుక్కుంటూ -‘‘ఆఁ! ఆఁ! బోలెడు పూత! పురాణంలోని వంకాయలు పులుసులోకి రావన్నట్టు అంతెత్తున్న చెట్టుమీది పూత పచ్చట్లోకి వచ్చేదెట్లా అని?’’ మూతి వంకర్లు తిప్పింది!కామేశం నీరుకారిపోయి తల గోక్కుంటూ ‘‘నిజమే కదూ!’’ అన్నాడు.వెంటనే బాబిగాడు ‘‘ఆఁ! నా దగ్గరుందో ఐడియా!’’ గట్టిగా అరిచాడు.‘‘ఏమిట్రా’’ అని ఇద్దరూ చూశారు.‘‘చెట్టెక్కి నేను వేపపూత కోస్తాను!’’ ఉత్సాహంగా చెప్పాడు.‘‘చాల్లే! చాల్లే! ఇలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు చేశావంటే అట్లకాడ తిరగేసి కాల్చి వాతపెడతాను! పండగపూట చెట్టెక్కి నడ్డి విరిగే పనులు చేస్తావా?’’ గీత కోపంగా కొడుకుని తిట్టింది.‘‘పోనీ ఆ పని నేను చెయ్యనా గీతా?’’ కామేశం చపన అనగానే ఆమె విచిత్రంగా చూసి -‘‘ఏంటీ? నడ్డి విరక్కొట్టుకునే పనా?’’ మరింత కోపంగా అన్నది.‘‘అబ్బా కాదు గీతా! జాగ్రత్తగా చెట్టెక్కి మట్టి కాకుండా వేపపూత కోసిపెడతానులే!’’గీత అయిష్టంగా తల వూపి ‘‘ఏంటో! రెండు గదుల ఇల్లు కట్టినపడే కాస్త డాబా మీదికి వెళ్ళటానికి వీలుగా మెట్లు కట్టుకుని ఉంటే ఎంత బావుండేది? నెత్తినోరు బాదుకుని అపడు చెప్పినా మీ చెవికెక్కలేదు!’’ నిష్టూరంగా అన్నది.వెంటనే బాబిగాడు ‘‘ఏంటీ! నువ్వు నెత్తినోరు బాదుకుని నాన్నతో చెప్పావా?’’ అంటూ పడిపడి నవ్వాడు.

అసలే చిరాకుగా వున్న గీత కొడుకుని కోపంగా చూసింది.‘‘నువ్వేంట్రా మధ్యలో - నెత్తి నోరు బాదుకుని అనగానే నిజంగా బాదుకుని అని కాదు! గట్టిగా చెప్పాను అని!’’‘‘మరి అట్లా చెప్పొచ్చుగా! నువ్వు నెత్తి నోరు బాదుకుంటుంటే ఎలా ఉంటావో వూహించుకుంటే భలే నవ్వొస్తోంది!’’‘‘వస్తుందిరా! వాత పెడితే ఎగురుతావే - అది తల్చుకుంటే నాకూ నవ్వు వస్తుంది!’’కామేశం ఇద్దర్నీ వింతగా చూసి ‘‘అబ్బబ్బా! ఇద్దరికీ వొక్క నిమిషం పడదుగదా! ఇపడివన్నీ ఎందుగ్గానీ రేప్పొద్దున్నే లేచి స్నానం చేసి జాగ్రత్తగా చెట్టెక్కి వేప్పూత కోస్తాను! సరేనా?’’ అన్నాడు సంభాషణ ముగిస్తూ!ముందురోజు భర్త చెప్పిన విషయం గుర్తొచ్చి గీత హాల్లో చూస్తే కామేశం లేడు.గదిలో కూతురు నీలిమ కొత్త పట్టుపరికిణీ కట్టుకుంటోంది.‘‘పసుపు కుంకుమ కాస్త రాసేవే?’’ అడగ్గానే ‘‘ఆఁ’’ అనేసి కొత్తబట్టలు చూస్కుంటూ మురిసిపోతోంది. వరండాలో బాబిగాడు బొమ్మలేస్తూంటే‘‘మీ నాన్నగారేరిరా?’’ విసుగ్గా అడిగింది.‘‘పెరట్లో వున్నట్టున్నారు! కాస్త విసుగు తగ్గించుకుని వెళ్ళి చూడు!’’ బాబిగాడు తలెత్తకుండానే చెప్పాడు.గీత పెరట్లోకి వెళ్లి చూస్తే కామేశం ఈజీ చెయిర్‌లో హాయిగా కూర్చుని ఆకాశం వంక చూస్తున్నాడు. గీత విసవిసా వెళ్ళి ‘‘ఇపడు టైం ఎంతయిందో తెలుసా? పొద్దున్నే వేపపూత కోసిపెడతానని చెప్పారు? గుర్తుందా?’’ విసుగ్గా అడిగింది.కామేశం ఉలిక్కిపడి చూసి ‘‘వేపపూత నేను కోస్తానన్నానా? అదెపడు?’’ ప్రశ్నించాడు.‘‘అదేంటండీ! నిన్న మీరేగా చెట్టెక్కి కోస్తానన్నారు?’’ విస్తుబోయింది.కామేశం మరింత ఆశ్చర్యంగా ‘‘ఏమిటీ? చెట్టెక్కి కోస్తానన్నానా? నేనా?’’ ఏమీ ఎరగనట్టే అన్నాడు.గీతకి కోపం వచ్చి బాబిగాడ్ని పిలుస్తూ ‘‘ఒరేయ్‌ బాబిగా! ఇట్లా రారా! నిన్న సాయంత్రం మీ నాన్న ఏం చెప్పారో నీ నోటితో నువ్వే చెబుదువుగాని - రారా!’’ కేకవేసింది.బాబిగాడు వచ్చి ఏదో అనేలోగా కామేశం కన్నుకొట్టి నవ్వేడు. బాబిగాడు నవ్వుతూ ‘‘నిన్న సాయంత్రమా? నిన్న నేను క్రికెట్‌ మ్యాచ్‌ ఉంటే వెళ్ళాను కదమ్మా!’’ అన్నాడు.‘‘అది కాదురా! నిన్న సాయంత్రం మీ నాన్నగారు వేపచెట్టెక్కి...’’ పూర్తిగా తల్లిని చెప్పనీయకుండానే ‘‘అబ్బా! నిన్న సాయం త్రం నేనసలు ఇంట్లోనే లేను! నాన్నగారు చెట్టెక్కుతానన్నారో పుట్టెక్కుతానన్నారో నాకేం తెలుసు?’’ బాబిగాడు సీరియస్‌గా అన్నాడు.