చెన్నయ్‌లో జరిగిన మేనేజ్‌మెంట్‌ సదస్సులో పాల్గొని తిరిగొచ్చాక - రెండు వారాలు దాటినా ఆ జ్ఞాపకాలు మరపునకు రావటం లేదు.మధురమైన జ్ఞాపకాలు ... మెరీనా బీచ్‌ లో మసక వెల్తురులో ... జలతారు పరదాల రెపరెపల్లా కదుల్తోన్న అలల్ని చూస్తో ... పడవచాటున కూచుని తన గొంతులోంచి జాలువారే తీయటి పాటను వింటో ... కమ్మగా కురుస్తోన్న వెన్నెల తడి స్పర్శతో పాటు నన్నానుకుని కూచుని నా ఒడిలో ఒదిగిపోయిన ఆమె వెచ్చదనాన్ని అనుభవిస్తో ... స్వర్గం ఎక్కడో లేదు - ఇక్కడే కదూ ఉందీ అని మురిసిపోతూ ... అటూ యిటూ బెదురుగా చూసి ... జన సంచారం లేనపుడు చపన ముద్దిడి ... మైకంలా కమ్ముకొస్తున్న ఆ మాధుర్యాన్ని తట్టుకునే విఫలయత్నంలో ఓడిపోతూ ...‘‘వేడి వేడి పల్లీలు తిందామా’’ అంది.‘‘మనం ప్రేమికులమా?’’‘‘ప్రేమికులైతే ఏంటట గొప్పా . . అవునూ - మనమూ ప్రేమికులమే. నువ్వు మజ్నూ, నేను లైలా ... నువ్వు సలీం, నేను అనార్కలి ... సరేనా’’ గలగలా నవ్వింది సెలయేరు మువ్వలు తొడుక్కున్నట్లు ...‘‘వాళ్ళ ప్రేమలు విషాదాంతాలు’’‘‘జీవితాలు విషాదంతో ముగుస్తాయేమో కానీ ప్రేమకు అంతమేమిటి? ప్రేమ అజరామరం. అందుకే వాళ్ళ ప్రేమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. పోన్లే మరొకరితో పోలికెందుకు? మనకు మనమే సాటి’’.నేనేమీ మాట్లాడలేదు.తనే మరలా అంది ‘‘ఈ వెన్నెట్లో నీ కబుర్లని నంజుకుంటూ గరం గరం పల్లీలు తింటుంటే చాలా మజాగా ఉంటుంది’’పల్లీలమ్మే కుర్రాణ్ణి పిలిచి రెండు పొట్లాలు కట్టించి, ఒకటి నా చేతిలో పెట్టింది.తినబోతుంటే - ‘‘నువ్వెక్కడ దొరికావయ్యా బాబూ ... శుద్ధ బుద్ధావతారం. సరసం తెలీదు. చూడు మొద్దబ్బాయ్‌ ... నా పొట్లంలోంచి నువ్వు తిను. నీ పొట్లంలోంచి నేను తింటాను’’ అంది.‘‘అదేమిటీ’’ అంటే-‘‘అదంతే.

అలా కాదంటే మరో మార్గం ఉంది. నీ పొట్లంలోది నాకు తిన్పించు. నా పొట్లంలోది నీకు తిన్పిస్తా. అపడే మజా’’‘‘ప్రతి దానికి మజా అంటావు నీ వూత పదమా’’ అన్నాను నవ్వుతూ.‘‘వూతపదం కాదు - జీవనవేదం లాంటి పదం. మజా లేకుండా ఎందుకు బతకటం? జీవితానికి అర్థం, పరమార్థం ఆ పదంలోనే ఉన్నాయి. మజా చేయాలి. ఎంజాయ్‌ చేయాలి. దొరికినంత సుఖాన్ని జుర్రుకోవాలి. దొరకని దాన్ని దోచుకోనైనా సరే అనుభవించాలి’’ నాకు మరింత దగ్గరగా జరిగి నా నడుం చుట్టూ చేయి వేసింది.ఆమె ఎడమ వక్షం బిగుతుగా, బలంగా గుచ్చుకుంటోంది. నేను వివశత్వానికి లోనవుతూ ... ఆమెను మరింతగా హత్తుకుంటూ ...ఆ సముద్రపు ఒడ్డున మేమిద్దరం తప్ప మరో నర సంచారం లేనట్లు ... ఆ తీరం మా ఆధీనంలో ఉన్నట్లు ... దానికి రాజూ రాణీ మేమిద్దరమే అన్నంత అధికారంతో...స్వేచ్ఛతో ...ఆకాశంలో పొటమరించిన కాసిని నక్షత్రాలు సిగ్గుతో కళ్ళు వాల్చి - ఓరగా మా వైపు చూసి - చందమామ కోసం వెతుక్కుంటున్నాయి.అలల లతాంగనలు తెల్లటి నురగల మేలి ముసుగుల చాటున ముసిముసిగా నవ్వుకుంటూ తీరం తాకి .. మమ్మల్ని చూసి... మరింత ముడుచుకు పోయి వెనక్కెళ్ళిపోతున్నాయి. మరలా కుతూహలం చంపుకోలేక మరలి వస్తున్నాయి.వెన్నెల మా మధ్య కాసింత చోటు కోసం ఇరుకున పడుతోంది.మాకు సమయమే తెలీలేదు.రాత్రి పదిగంటలు ...‘‘ఆకలేయటం లేదా ... భోజనవేళ దాటి పోయింది’’ అన్నాను.‘‘నీ కౌగిళ్ళు చాలవూ ... ఆకలెందుకు గుర్తొ స్తుంది? మనసూ, తనువూ తృప్తితో నిండిపోతుం టేను’’ అంది వెన్నెల గిన్నెల్లాంటి కళ్ళతో నా మొహాన్ని తడుపుతూ ...