హాల్లో గోడకు తగిలించిన గడియారం ఠంగు ఠంగుమంటూ అయిదు గంటలు కొట్టింది.అప్పుడే ఆఫీసు నుంచి వస్తున్న నరేన్‌ దానివైపొక్కసారి కోపంగా చూసి, చేతిలో బ్రీఫ్‌కేసును విసురుగా సోఫాలో పడేసి పేము కుర్చీలో కూలబడ్డాడు.ఆ కూర్చోవడంలో కాలికి తగిలిన చిన్న ప్లాస్టిక్‌ స్టూల్‌ను ఒక్క తన్ను తన్నాడు.పక్కగదిలో నుండి భుజాన టవలుతో స్నానానికి బయలుదేరిన అతని మిత్రుడు వివేక్‌ కాలికి తగలడంతో....‘‘ ఒరేయ్‌, నేను ఉక్కు పిండాన్ని కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు తన్నిన తన్నుడుకి కాలు విరిగి మంచంలో పడితే నువ్వు సేవలు చెయ్యలేక చచ్చుండేవాడివి!‘‘అవునూ రోజూ ఆఫీసుకెళ్లేటప్పుడు బుజ్జిముండ ఏదీ అని వెతుక్కుని కాళ్ల కింద పెట్టుకొని బూట్లు తొడుక్కునేవాడివి పాపం ఉన్నట్టుండి ఆ పిచ్చిముండ నిన్నేం చేసింది?’’ అని అడిగాడు.ఆ చిన్న ప్లాస్టిక్‌ స్టూలు తగిలితేనే కాళ్లు విరిగేటంత అర్భకులు ఈ కొంపలో లేరు గానీ... అని ఒక్క సెకను ఆగి తలపట్టుకొని ...‘‘అరేయ్‌ నాకు తెలీక అడుగుతాను అసలీ పుష్కరాలు ఎందుకొస్తాయిరా?’’ అన్నాడు విసుగ్గా నరేన్‌.ఆ తలుపు దగ్గర నుంచి కదలి సోఫా దాకా వచ్చి కూర్చుంటూ‘‘ఏదీ గోదావరి పుష్కరాలు మాటేనా నువ్వడిగేది?’’ నాకు తెల్సినంత మటుకు బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు.... అంటుండగా‘‘అబ్బబ్బా... నేను పుష్కరాలు ఎప్పుడొస్తాయి అని అనలేదు. ఎందుకొస్తాయి మన ప్రాణం తియ్యడానికి అని అడిగాను. నువ్విప్పుడు ఎప్పుడొస్తాయో క్లాసు పీకాల్సిన అవసరం లేదు.’’

‘‘నరేన్‌.. నువ్వు నోరు లేని స్టూలు మీద, నోరున్న నా మీద, రాబొయ్యే పుష్కరాల మీద విరుచుకుపడి ప్రయోజనం ఏమిటి? సమస్య ఏమిటో చెప్పు పరిష్కారం ఆలోచించుదాం’’ తాపీగా పక్కనున్న టీపాయ్‌ మీద కాగితంలో పోసిన వేరుశనక్కాయలు వొలుచుకొని తింటూ అడిగాడు.‘‘నా ఖర్మ నా జీవితమే ఒక సమస్య! దానికి తోడు ఈ పుష్కరాలొక్కటి! అమ్మ వస్తుందట... పుష్కర స్నానానికి! లక్షణంగా కాశీలో రోజూ గంగాస్నానం చేస్తూ ఉండే ఆవిడకు గోదావరీ పుష్కర స్నానమేమిట్రా? ఆవిడకు ఆలోచన లేదనుకో మా అన్నయ్యకయినా ఉండాలా?’’‘‘రేవా తీరంలో తపస్సు, కాశీలో మరణం, కురుక్షేత్రంలో దానం చేసినంత పుణ్యం వస్తుంది గోదావరిలో స్నానం చేస్తే అని పేపర్లో పడుతోంది కదా.... అమ్మ అది చూసి వుంటుంది. అయినా అమ్మ వస్తోందంటే సంతోషిస్తారు ఎవరన్నా... నువ్వేమిట్రా ఇలా బెంబేలు పడతావు?‘‘అమ్మ వస్తోందంటే సంతోషమే.. కానీ నా భార్యామణి చేసిన ఘనకార్యం అమ్మకు చెప్పలేదు.’’తలపట్టుకున్నాడు నరేన్‌.అమ్మకి ఏమని చెప్పాలో... ఎలా చెప్పాలో నాకు తెలీలేదు. ఒక్క కొడుకని కళ్లలో వొత్తులు వేసుకొని పెంచుకొంది. ఆరోగ్యం సరిలేదు. ఎపుడెలా వుంటుందో అని పట్టుపట్టి పెళ్లి చేసింది. అలాంటావిడకునా భార్య ఇంకెవర్నో ప్రేమించిందట. పెళ్లి కూడా చేసుకోవాలను కున్నారట... వాళ్లమ్మ ఈ పెళ్లి చేసుకోకపోతే బావిలో దూకుతానంటే చేసుకున్నదట! అతగాడు అమెరికాలోనో.... ఆస్ర్టేలియాలోనో ఉన్నాట్ట... రావడానికి కాస్త టైం పడుతుందట. రాగానే డైవోర్స్‌ తీసుకొని అతగాడితో వెళ్లిపోతానని మొదటి రాత్రే చెప్పిందని గుండె జబ్బు మనిషితో ఎలా చెప్పనురా?