శ్రీనిలయం ముందు కారు ఆగింది.మేం కారు దిగగానే ఆత్మీయుల స్పర్శలా హాయనిపించే ప్రాతఃకాలపు పిల్లగాలి పూల పరిమళాలను వెదజల్లుతూ పరామర్శ చేసింది.సరిగ్గా అప్పుడే ఎక్కడినుండో ఓ కోయిల ‘కూ...’ అంటూ రాగం తీసింది మాకు స్వాగతం చెబుతున్నట్లుగా.ఆ ప్రశాంత ప్రభాత సమయంలో కోయిల తీయని పలకరింపుకూ, చల్లగాలి అలరింపుకూ మనసు పులకించింది. ప్రకృతి కూడా మమ్మల్ని మౌనంగా, మధురంగా ఆశీర్వదిస్తున్న అనుభూతి కలిగింది.ఒక క్షణం కళ్ళెత్తి పరిశీలనగా చూశాను.శ్రీనిలయం...ఇంకా పూర్తిగా కరిగిపోని తెలిమంచు తెరల మధ్య మేలి ముసుగు ధరించిన మహారాజ్ఞిలా ఉంది! అందంగా, అట్టహాసంగా ఉన్న ఆ భవనం నిజంగా ‘శ్రీ’కి నిలయమే సుమా అన్నట్లుగా ఉంది! ఆ ఆవరణంతా శోభాయమానమూ, పరిమళభరితమూ కావిస్తున్న రంగు రంగుల క్రోటన్సు, రకరకాల పూల మొక్కలూ మాకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా చిరుగాలి అలలకు అందంగా తలలూపుతున్నాయి!నేటి నుండీ జీవితం కొత్త మలుపు తిరిగి కొత్త పరిసరాలలో, కొత్త వ్యక్తుల మధ్య కొనసాగబోతోంది!ఒక క్షణం ఏదో తెలియని సంకోచంతో మనసు రెపరెలాడింది.బెరుకుగా నిలబడిపోయిన నా వేపు విష్ణు చిరునవ్వుతో చూసి నా అరచేతిని పట్టుకుని మెల్లగా నొక్కారు. ఆ స్నేహపూర్వక స్పర్శ నుంచి... చూపు నుండి నాకేదో ఉత్సాహం అంది వచ్చినట్లయింది! నా సంకోచం చెల్లా చెదరైపోయింది!నేను కోరుకున్న, నన్నే కావాలనుకున్న వ్యక్తితోనే జీవితాన్ని పంచుకోగలుగుతున్న అదృష్టవంతురాలిని!

విష్ణు సహచర్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా ఉండగలననే నమ్మకం నాకుంది!ఆ క్షణం శ్రీనిలయం చేతులు చాపి ఆదరంగా ఆహ్వానిస్తున్న ఆత్మంధువులా కనిపించింది!అవును..ఈ శ్రీనిలయం నా ఆశల నందనోద్యానం!నా సుందర స్వప్నాలను నిజం చేసే మధుర బృందావనం!నలుగురున్న ఇల్లు నవ్వులతో నందనవనాన్నే మరిపిస్తుందని నా అభిప్రాయం. అందుకే ఎక్కువ మంది ఉన్న ఇంటికి కోడలుగా వెళ్ళాలనేది నా కోరిక! ఆ కోరికకు పునాది తోడబుట్టినవాళ్ళు లేకుండా నేను ఒంటరిగా పెరగటమే అయివుంటుంది.నన్ను మనసారా ఇష్టపడుతున్నట్లుగా తెలిసిన వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలనేది నా మరో కోరిక. పెద్దల నిర్ణయించే పెళ్ళిలో పిల్లల ఇష్టానికే కాకుండా కట్నకానుకలు, కుటుంబ సాంప్రదాయాలు లాంటి విషయాలెన్నింటికో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మిగతా విషయాలన్నీ నచ్చితే, పిల్లల ఇష్టాన్ని పక్కన పెట్టేసి పెళ్ళి నిర్ణయించేస్తుంటారు కూడా! పిల్లలే ప్రేమించి పెళ్ళిచేసుకుంటే, వాళ్ళ మొదటి ప్రాధాన్యతా, చివరదీ కూడా ప్రేమదే అవుతుంది. వాళ్ళ ఇల్లు మరో బృందావనమే అనిపిస్తుంది.నా రెండు కోరికలూ తీరాయి. కాబట్టి ఈ శ్రీనిలయం నాకు నందనవనమూ, బృందావనమూ!విష్ణుననుసరించి ఉత్సాహంగా రెండడుగులు వేయగానే ‘‘పెదబాబూ... ఆగండాగండీ...’’ అంటూ దండలతో పరుగున వచ్చినామెను చూడగానే ఆ ఇంట్లో పనిచేసే ముత్యాలని పోల్చుకున్నాను. అంతా ‘పిచ్చమ్మ’ అని పిలుస్తారట.

ఆ ఇంట్లో వాళ్ళెవర్నీ ఇంతకు మునుపు నేను చూడకపోయినా విష్ణు ద్వారా విన్నందువల్ల అందరూ నాకు తెలిసిన వ్యక్తులే అనిపిస్తోంది!ముత్యాలు సన్నగా, పొట్టిగా ఉంది. చీరె కట్టుకుని పైన మళ్ళీ షర్టు వేసుకుంది. రెండు జడలు! బాగా బిగించి అల్లి చివర వూలు దారంతో పువ్వులాగా ముడివేసినందువల్లనే అనుకుంటా అవి రెండూ తలకి రెండు పక్కలా నిలబడిపోయినట్లుగా తమాషాగా ఉన్నాయి. చేతికి తాటాకు రిస్టువాచీ! మొహంలో వయసు వచ్చినా వదిలిపోని పసితనం! అదేనేమో పిచ్చి అంటే...!