ఆ మానవాననంలో  ఏదో కించిద్విషాదం,  కించిన్నిరాశకొంచెంవిరాగం, కించిదసంతృప్తి ఆ మానవ వదనం అందరికీ పరిచితమే అతడే నువ్వూ, నేనూ అంతమందీ వెరసి(శ్రీశ్రీ - మహాసంకల్పం)

రాత్రి పది దాటింది. పగటి రద్దీతో అలసిపోయినట్టుగా ఆబిడ్స్‌ ప్రాంతం ఆవలిస్తోంది. ఇరానీ హోటళ్ల ముందర ఆగివున్న రిక్షాల్లో డ్రైవర్లు ముడుచుకుని పడుకున్నారు. కొందరేమో వెళ్లి బన్ను తింటూ టీ తాగుతున్నారు. బార్లలో భోజనం చెయ్యని కొందరు అక్కడ తాగివచ్చి యిక్కడ బిర్యానీలూ, తందూరీ రొట్టెలూ తింటున్నారు. గిడసబారిన శరీరాలతో, బిరుసు గడ్డాలతో, కారాకిళ్లీ నముల్తూ, సిగరెట్టు దమ్ములాగుతూ గిరాకీలకోసం నిరీక్షిస్తున్నారు కొందరు.రాత్రి బేరాలు మరి కాసేపట్లో ప్రారంభ మవుతాయక్కడ, పువ్వులూ, సెంటూ, పౌడరు వాసనలూ, భోజనం పొట్లాలూ, వీధి దీపాల వెలుగులో మెరిసే నైలాను చీరెలూ, మురికి గదులూ, సారా వాసనా, పోలీసుల బూట్ల టకటకలూ, రెండు వైపులా పరదాలు వేసిన మీటర్‌ లేని ఆటోలవాళ్ల హడావిడి పరుగులూ అన్నింటికీ రంగం సిద్ధమైంది.గుడ్డల షాపుల షోకేసుల్లో వున్న బొమ్మల్ని చూస్తూ నడవరు ఇప్పుడక్కడ. రాత్రి అవసరాలు వేరు. పగలంతా బస్సులతో, వాహనాలతో, జనస మ్మర్దంతో, మరో లక్ష ఫుట్‌పాత్‌ బేరాలతో బిజీగా వున్న చోట ఇప్పుడు హోటళ్ళ కిళ్లీ కొట్ల దగ్గరా, వీధి దీపాల నీడల్లో, చీకటిగా వున్న బస్‌ షెల్టర్లలో మరో వ్యాపారం ప్రారంభమైంది.డిసెంబరు నెల. చలిగా వుంది. మొహాలు మఫ్లర్లలో దాక్కున్నాయి. పెదవుల మధ్య ఎర్రగా, వెచ్చగా సిగరెట్లు వెలుగుతున్నాయి. ఘాటైన పొగ, తాగేవాళ్లకే కాక ఎదుటివాళ్లకు కూడా మత్తెక్కిస్తూ, వుషారు కలిగిస్తూ వుంది. ఆకలి, నిషా, జేబులో డబ్బు మత్తెక్కిస్తున్న కళ్లు. ఉబ్బిన మొహాలు స్థిమితం తప్పిన ఒళ్లు. తడబడే కాళ్లు. రోజూ జరిగే తంతు.

వాళ్లేం చేస్తున్నారో, ఎవరి మనసుల్లోఏ ఊహలుదాగున్నాయో, ఎవరి అవసరాలు ఏమిటో తెలుసు కోవటానికి వాళ్లను అడగాల్సిన పని లేదు. పరిశీలించ వలసిన అవసరం కూడా లేదు. పేపరు హెడ్‌లైన్లలా దూరం నుండి కూడా వాళ్ల మొహాల్లోని భావాల్ని చదవవచ్చు.కొత్తవాళ్లను ఆ సరదాలు రెచ్చగొడుతున్నాయి. ఒకసారి రుచి చూసిన వాళ్లకు మరోసారి కావాలని పిస్తున్నాయి. అలవాటైన వాళ్లు అలవాటుగా పాత పరిచయస్తుల్ని పలకరిస్తున్నారు. పేదలు, పేదలు కాని గుమాస్తా బాబులు, వాళ్లపై అధికారులు, చిన్న వ్యాపారస్తులు, కాస్త పెద్ద వాళ్లు, విద్యార్థులు, యువకులు, మధ్యవయస్కులు, చింతచచ్చినా పులుపుచావని వాళ్ళు అందరికీ కావాలి సుఖం. కొందరికి మొదటిసారి. కొందరికి మరోసారి. లెక్క మరచిన సుఖభోగులకు నిత్యపారాయణ.రాత్రిలో వుందో, చలిలో వుందో, ఆ స్థల మహత్మ్యమోగాని, అక్కడ నిల్చుంటే అవే కోరికలు కలుగుతాయి. ఆ గాలిలో, వాతావరణంలో, ముక్కుపుటాలలో ప్రవేశిస్తున్న వెచ్చని వాసనల్లో, కాలిగజ్జల్లో, చేతిగాజుల్లో, బరువుగా, నెమ్మదిగా కదిలే ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో తెచ్చిపెట్టుకున్న కల్ల మెరుపుల్లో, చిరునవ్వుల్లో, గిడసబారిన మనుషుల పరుషమైన వర్థనల్లో, ‘అంతా సుఖంగా, మంగా మీ ఇష్టప్రకారమే జరుగు తుందన్న హామీల్లో, జేబులోని నోట్లు కల్పించిన భద్రతల, లేదా యిదే ‘అడ్వెంచర్‌’గా తీసుకుంటున్న వాళ్ల సాహసికతలో వుందోగాని అది కోరికల, అవసరాల లోకం. వాళ్ల కోరికల వేడికి కాబోలు ఆ చలిలో కూడా చమటపడుతున్నది.