ఆకాశంలో మబ్బులు పిశాచగణం జుత్తు విదిలించి, కోరలు చాచి దాడికి సిద్ధమైనట్లు నల్లగా నిండిపోయి ఉన్నాయి. ఇక లోకంలో వెలుతురే ఉండదు, భవిష్యత్‌ మొత్తం అంధకారకుహరమే అన్నట్టు ఉంది. ఆకాశంలో ఎక్కడా వెలుతురు జాడ లేదు.అసలే రాత్రి. కారు చీకటి మాటున కపాలస్ఫోటనతో వెలువడే కరాళ ధ్వనులే శృతిగా, పీడిత తాడిత శోకతప్తుల హాహాకారాలే లయగా క్షుద్ర గణాలు బీభత్స గానాలాపనతో పెచ్చరిల్లే సమయం.పిశాచాలు సైతం బయటకు రావడానికి భయపడి పిడచకట్టుకుపోయే భీతిల్లే వాతావరణం. చెట్లు సైతం దెయ్యం పట్టినట్టు ఊగిపోతున్నాయి. గాలి అప్పుడు గాలిలా లేదు. క్షుద్రదేవత షంబోరా తన రక్తం కారే నోటిని పూర్తిగా తెరిచి హా... అంటూ ఊదినట్టు, ప్రళయం ముందు దూకుతున్న కాలుడిలా ఉంది.దట్టంగా ఉన్న అడవి. అడవి కొసకు ఉన్న కుగ్రామం నర్తోరా. అంతా కలిపి వంద ఇళ్ళు కూడా ఉండవు అక్కడ. కానీ ఒక్కో ఇంట్లో ఉన్న ప్రతి మనిషీ ఓ మంత్రగాడే. ఆ గ్రామంలో ఆడా, మగా చివరికి పిల్లలకి కూడా మంత్ర విద్యలు సాధన చేయడం మామూలు విషయం.దారిన పోయే తాచుపాము మంత్రంతో బంధించి దాన్ని తలకి, చేతులకి చుట్టుకుని ఆడుకోవడం ఆ ఊళ్ళో చిన్న పిల్లలకి అలవాటే.అలాంటి ఊళ్ళో కూడా ఆ పూట బయటికి రావడానికి భయపడుతున్నారు అందరూ. చిక్కటి చీకట్లో కలిసిపోయిన ఆ ఊరిని నాలుగు పక్కలా పిశాచాలు చుట్టుముట్టి ఉంటాయి. తమ ప్రీత్యర్థం ఏ క్రతువు చేసి తమకు రక్తం, మాంసం, ఎముకలు, నరాలు ఇంకా తైలము వంటి వాటితో ఏ క్షుద్రనైవేద్యం పెడతారో అని ఆబగా చూస్తూ ఉంటాయి.అయితే ఆ పిశాచాలు కూడా భయంతో బిగుసుకుని ఉన్నాయి. ఓ మహాశక్తి ఒళ్ళు విరుచుకుని విజృంభించే వేళ ఆ శక్తి పాదాల తాకిడికే తాము నలిగి నాశనమైపోతామని బితుకు బితుకు మంటున్నాయి.

అంతటి మహాశక్తిని లేపేవాడెవ్వడు. లేపినా దాని తాకిడిని తట్టుకోగలడా? తట్టుకుని కట్టడి చేసి తన ఆధీనంలోకి తెచ్చుకున్నా ఆ శక్తిని ఏ ప్రళయానికి వాడతాడు?కిర్రుమన్న శబ్దంతో ఓ గుడిసె తలుపు తెరుచుకుంది. ఊరు ఆ శబ్దానికే ఉలిక్కిపడింది. ఆరడుగుల ఆజానుబాహువు బయటికి వచ్చాడు. పిశాచగణం తిత్తిరి పిట్ట రూపంలో క్రక్రక్రక్ర.... అంటూ అరచి అతడు తలపెట్టిన పని ఎంత ప్రమాదకరమైందో హెచ్చరించే ప్రయత్నం చేశాయి.ఎడమచేతిని గాల్లో తిప్పి ఓ మంత్రం జపిస్తూ ష్‌... అని శబ్దం చేశాడు అతడు. పిశాచగణమంతా భయంతో బిగుసుకుపోయింది. అప్పటివరకూ ఉన్న శబ్దం ఆగిపోయింది. విసురుగా వీస్తున్న గాలితో చేరి గోల చేస్తున్న పిశాచాలన్నీ ఆగిపోయాయి. గాలి కూడా అక్కడ లేనట్లు గడ్డ కట్టిన నిశ్శబ్దం.ఊరి జనమంతా ముసుగులు మరింతగా బిగించుకుని మునగదీసుకున్నారు.అతడి అడుగుల చప్పుడు చప్పుడులా లేదు. రుద్రవీణ వికృత లయలో, తప్పిన శృతిలో వెలువరిస్తున్న ప్రేతగీతంలా ఉంది.పిల్లలు ఆ అడుగుల చప్పుడుకి జడుసుకున్నారు. నిశ్శబ్దం కుంభిని పై అతడి అడుగుల శబ్దానికి తోడై మరింతగా భయాన్ని పెంచుతోంది.అతడు సాగిపోతున్నాడు. అడుగుల చప్పుడు ఊరినుంచి ఏ దిక్కుగా పోతుందా అని ఆసక్తిగా వింటున్నారు యువ మంత్రగాళ్ళు. అతడిని వెంటాడి అతడు చేసే ఘోరకాండను చూడాలనే కుతూహలం ఊపేస్తున్నా, శ్మశాన సామ్రాజ్య అధిపతులై పిశాచ, భూత, ప్రేతగణ పరివేష్టితమై సకల క్షుద్రశక్తులను బానిసలుగా చేసుకున్న ఏలికను ఆరాధించే క్రమం ఎంత భయానకమో, ప్రమాదకరమో వాళ్ళకి తెలుసు.