‘‘అమ్మా! కారు వచ్చిందే! అన్నయ్య వచ్చేసాడు!’’ ఉద్వేగంగా అంది వకుళఅరుగు మీద నుంచి లోపలకి ఇంట్లోకి తొంగి చూస్తూ!శ్రావ్యంగా వినపడుతున్న చెల్లెలి గొంతు విని కారులోంచి దిగుతున్నరవితేజ కళ్లు చెమర్చాయి!‘‘ఎన్నాళ్లకి, ఎన్నేళ్లకి!’’అతని మనస్సు రెపరెపలాడింది! ‘ఎక్కడ అమెరికా!ఎక్కడ ఇండియా?’ ఆరేళ్ల తర్వాత తను పుట్టి పెరిగిన కోనసీమ గడ్డ మీద కాలు మోపుతుంటే అతని మనస్సులో ఆనందపు కెరటాలు ఉవ్వెత్తున ఎగిసాయి!‘అన్నయ్యా!’ వకుళ వచ్చి సంతోషంతో అతని రెండు చేతులూ పట్టుకొంది.ఆప్యాయంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు!‘‘నాన్నా, రవితేజ! వచ్చావా? నీకోసం ఎదురు చూసి చూసి కళ్లు కాయలు కాచిపోయాయిరా!’’ లోపల్నుంచి లక్ష్మీదేవి వస్తూనే కొడుకుని రెండు చేతులతో చుట్టేస్తూ భోరుమని ఏడ్చేసింది.’’అమ్మా!’’ రవితేజ కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి.ఆవిడని దగ్గరగా తీసుకొని, ’’ఇక వచ్చేసానుగా, ఏడవకమ్మా!’’గద్గదికంగా అన్నాడు!‘‘లక్ష్మీ! ఏమిటిది మరీ చిన్నపిల్లలాగా! ముందు వాడ్ని లోపలకి రానీ!’’ వెనుకగా వచ్చి భార్యని భుజం మీద తడుతూ అన్నారు సత్యమూర్తి. కొడుకుని చూడగానే ఎగసి వస్తున్న ఆనందాన్ని కళ్లల్లోనే ఆనంద బాష్పాలుగా దాచుకుంటూ!‘‘నాన్నగారూ ఎలా వున్నారు?’’ చటుక్కున వంగి తండ్రి పాదాలకి నమస్కరించాడు రవితేజ.

‘‘రవి!’’ అంటూ అతన్ని వదల్లేనట్టుగా ఇన్నేళ్ల బాధను చూపెడుతున్నట్టుగా బలంగా కౌగిలించుకున్నారాయన. తండ్రి స్పర్శ-అతనిలో చిన్నతనపు జ్ఞాపకాలన్నింటిని తట్టి మరీ లేపి వేరే లోకానికి తీసుకెళ్లింది! అలాగే నిలబడిపోయాడు.‘‘సరి, సరి! నన్నంటూ మీరేమిటి ఇలా మీ కొడుకుని అస్సలు వదల్లేకపోతున్నారు!’’ చీర కొంగుతో కళ ్లనీళ్లు తుడుచుకుంటూ లక్ష్మీదేవి పరిహాసమాడింది పక్క నుంచి.ఇంతలో వకుళ పళ్లెం నిండా ఎర్రనీళ్లు తీసుకువచ్చి, ‘‘అన్నయ్యా! అందరం నీ గురించి చాలా బెంగ పెట్టేసుకున్నామురా! ముఖ్యంగా నాన్నగారు మరీనూ!’’అంది తండ్రిని చూస్తూ!‘‘చాల్లే! నువ్వెప్పుడూ నాన్న కూతురివేలే!’’ పెద్దక్క వనజ చిన్నగా నవ్వుతూ వకుళ తలమీద చిన్నగా మొట్టింది.‘‘అక్కా ఎలా వున్నావు?’’ రవితేజ పలకరించాడు. బాగానే ఉన్నానన్నట్లు తలూపింది వనజ.‘‘ముందా పళ్లెం ఇలా ఇవ్వండే మీరు!’’ కళకళలాడిపోతున్న ముఖంతో లక్ష్మీదేవి కొడుక్కి దిష్టి తీసి అతన్ని లోపలకి తీసుకెళ్లింది.లోపలకి వస్తూంటే, ‘‘ఏరా రవి, ఎలా వున్నావురా?’’ పెద్దబావ శ్రీధర్‌ చనువుగా పలకరించాడు భుజం మీద చేయి వేసి.

‘‘చాలా మారిపోయావు రవి’’ అంటూ చిన్న బావ శ్రీనివాస్‌ ఆశ్చర్యం ప్రకటించాడు. అందరిని చిరునవ్వుతో పలకరిస్తూ ఇంట్లోకి అడుగుపెట్టాడు రవితేజ.కాని, అతని కళ్లు పదే పదే తన మనస్సుకి కావల్సిన వ్యక్తి కోసం గాలిస్తున్నాయి. కాని తను ఎక్కడా కనపడలేదు.‘‘అన్నయ్యా! చాలా తెల్లబడ్డావు! అమెరికా నీళ్లు నీకు బాగా పడ్డాయిరా!’’అంది వకుళ. కాఫీలు తాగాక.ఆరడుగుల ఎత్తులో బలంగా, అందంగా వున్న కొడుకుని పదే పదే చూస్తూ మురిసిపోతున్న లక్ష్మీదేవి, ‘నీ ముఖం వకుళా, వాడసలే నల్లబడి చిక్కిపోతేనూ!’ అంది ముద్దుగా కూతుర్ని విసుక్కుంటూ.‘‘అమ్మా! ఓ మాట చెప్పనా! ఏ తల్లికైనా పిల్లలు నాలుగు రోజులు తమ దగ్గర లేకపోతే వాళ్లు చాలా చిక్కిపోయినట్లు కనపడతారు’’ అంటూ వకుళ వెటకారమాడింది.‘‘నిజమేనే వకుళా! నాలుగు రోజులకే ఏ తల్లికయినా అలాగే అనిపిస్తే మరి నా పిల్లాడు నా కంటికి కనపడక ఎన్నేళ్లయింది చెప్పు? నీ పదేళ్ల కొడుకుని నా దగ్గర ఓ వారం రోజులు వుంచవే అంటే, అమ్మో వారమే? అబ్బే కుదరదు. చదువులు పోవు? అంటూ ఏదో ఒక వంక పెట్టి నా మనవడిని నీతో లాక్కుపోతావు? మరి రవి వెళ్లి ఆరేళ్లు దాటింది. అందరిని వదిలి వెళ్లి వాడు అక్కడ అమెరికాలో ఎలా వున్నాడో, ఏం తింటున్నాడో, ఏం చేస్తున్నాడో అని క్షణ క్షణం వాడిని తలుచుకుంటూ, బాధపడుతూ ఇన్నేళ్లూ నరకంలో వున్నట్లు గడిపాను. తల్లిగా నేను పడ్డ బాధ పగవాడికి కూడా వద్దు’’ లక్ష్మీదేవి గద్గదికంగా అంది.