నెట్‌ ఓపెన్‌ చేశాను.గూగుల్‌ సెర్చి ఇంజన్‌లోకి వెళ్ళి అలవోకగా ఒక వెబ్‌సైట్‌ టైపు చేశాను. చాలా బ్లాగులు వచ్చాయి. ఒక బ్లాగుని క్లిక్‌ చేశాను. అది నా ఇ-మెయిల్‌ని, పాస్‌వర్డ్‌ని అడిగింది. ప్రేమ-పరుగుఃలైఫ్‌. రిస్క్‌ అని రాసి, పాస్‌వర్డ్‌ని టైపు చేశాను. లాగిన్‌ పూర్తయింది.వెలుగులు విరజిమ్ముతూ నా లాప్‌టాప్‌ మానిటర్‌ మీద థ్రిల్లర్‌ నవల ఇలా ప్రారంభం అయ్యింది.సూర్యుడు తన పద్ధతిని మార్చుకుంటున్నాడు. ఆకాశం సర్దుబాటు చేసుకుంటోంది.వసంతం తన గమనాగమనాలను మార్చుకుంటోంది. వనంతదనుగుణంగా సర్దుబాటు చేసుకుంటోంది.గ్రహగతులు మారుతున్నాయి. అంతరిక్షం అనుకూలంగా ఉంటోంది.గులాబీల తోటలో మల్లెలు విరిస్తే ఆశ్చర్యం! అలాగే మల్లెపూల మధ్య గులాబీ వికసిస్తే ఆశ్చర్యం!ప్రేమికులు మారుతూ ఉంటారు. ప్రేమ మారదు! దానిని చేరుకునే మార్గాలు మారుతూ ఉంటాయి. అదెంత ఉన్నత శిఖరాలలో ఉన్నా దానిని పొందాలి. పొంది తీరాలి!ప్రేమ ఒక హృదయశక్తి. అది దేనితోనూ సర్దుబాటు చేసుకోదు. ఒక్క విజయోత్సవంతో తప్ప.

‘‘ఆంటీ! ఈ రోజు మహేశ్‌ ఇక్కడే ఉంటాడు. నీకేం అభ్యంతరం లేదు కదా’’ అంది దివ్య హాల్లోంచి వంటింట్లోకి వినిపించేటట్లు.‘‘నాకేం అభ్యంతరం లేదు. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాడు కదా. ఎప్పుడూ లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వస్తుంది? నీ ఇష్టం’’ అంది రూయమ్మ కిచెన్‌లోంచి బయటకు వస్తూ. ఆమెను కొందరు రూయ అని కూడా పిలుస్తారు. దివ్యకు ఆమె ప్రత్యేక సేవకురాలు. అయినా రూయమ్మని ‘ఆంటీ’ అని సంబోధిస్తుంది.దివ్య ఇంజనీరింగ్‌ కాలేజీలో ఫైనలియర్‌ చదువుతోంది. ఒక ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌ కోర్సు కోసం విశాఖపట్నం కాలేజి ఎంచుకుంది. హైదరాబాదు నివాసమైనా, విశాఖపట్నం అంటే దివ్యకు చాలా ఇష్టం. ఆమె తండ్రి వీరబాబు. విశాఖపట్నంలో ఆమె ఉండటానికి సర్వ సదుపాయాలు అమర్చాడు. అందులో భాగమే రూయమ్మ.రూయమ్మకు నలభై ఏళ్ళు ఉంటాయి. విసుగు, విరామం లేకుండా పనిచేస్తుంది. హైదరాబాదు నుంచి వీరబాబు మనుషులు ఎంతమంది వచ్చినా, వాళ్ళందరికీ వండి, వడ్డిస్తుంది. అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుంది. వచ్చినవాళ్ళని సంతోషపెట్టి పంపుతుంటుంది. అందుకే రూయమ్మ అంటే వీరబాబుకి చాలా నమ్మకం.

ఆమెను ఒక పనిమనిషిగా చూడక బంధువులాగ చూసుకుంటాడు. అటువంటి మనిషిని తన కూతురికి అన్నీ చూసుకోవడానికి నియమించాడు. రూయమ్మకు దివ్య అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఆమె కాలేజీలో జాయినయిన మొదటి రోజునుండీ తనే అన్నీ చూస్తోంది.పెద్ద గెస్ట్‌హౌస్‌ లాగ ఉంటుంది ఇల్లు. అందులో దివ్య గది ప్రత్యేకంగా ఉంటుంది. ఇల్లంతా తన స్వంతంలాగ తిరుగుతుంది రూయమ్మ. ప్రతిక్షణం దివ్య ఆలనా పాలనా చూడటానికి తాను ఇక్కడ ఉన్నానన్న విషయాన్ని ఆమె నిరంతరం గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది. దివ్య గురించి ఏం తెలుసుకోవాలన్నా వీరబాబు, రూయమ్మనే అడుగుతాడు. వీరబాబుకి హైదరాబాదులో లెక్కలేనంత ఆస్తి ఉంది. అతని ఏకైక కుమార్తెదివ్య. దివ్య స్నేహితుడు మహేశ్‌.‘‘ఈ రోజు నీకు కాలేజి లేదా? వెళ్ళి వెంటనే వచ్చేసావు?’’ అడిగింది దివ్యని రూయమ్మ.ప్రతిరోజూ ఒక టైము ప్రకారం తన పనులు చేసుకుంటుంది దివ్య. ఈ రోజు కూడా అనుకున్న సమయానికే కాలేజికి వెళ్ళింది. మహేశ్‌తో కలిసి వెనక్కి వచ్చేసింది.