అతని జిహ్హ కాఫీ కోసం అర్రులు చాస్తూంటే, చెవులు, కళ్ళు టీ.వీ. న్యూస్‌లో లీనమయ్యాయి. భర్త తన మాట పట్టించుకోలేదని గ్రహించిన మనోరమకు ఉక్రోషం ముంచుకువచ్చింది. కాఫీ కప్పు అందిస్తూ ‘‘మీకేం? తమరికి కావల్సిన వార్తలు టీ.వీలో చూసేస్తారు. ఆ పేపరు వాడిని పట్టించుకోరు అది అలుసుగా తీసుకొని ఆ కుర్రాడు రోజురోజుకీ మరింత ఆలస్యం చేస్తున్నాడు. అంతలా ఆ టీ.వీకి అతుక్కుపోకుండా కాస్త ఇటు దృష్టిపెట్టి వాడిని మందలిస్తే ఆ పేపరేదో పెందళాడే మొహాన కొడతాడేమోననే ఆలోచనే లేదు’’ రుస రుసలాడింది.‘‘ఏ రాచకార్యాలో వెలగబెడుతున్నట్లుగా మాట్లాడే బదులు ఆ పనేదో నువ్వే చేయ వచ్చుగా?’’ భార్యను అనాలనుకున్నా ఆ మాటలనే ధైర్యం చాలక మింగేస్తూ ఇది ప్రతీ ఆదివారం ఉండే ప్రహసనమే అనుకున్నాడు తనలో. కాఫీ తాగటం పూర్తి చేసింది మనోరమ.తువ్వాలు భుజంపై వేసుకుంది. బాత్‌రూంలోకి వెళ్ళబోతూ ‘‘ఏమండీ మీరూ త్వరగా తెమలాలి ఈరోజు పక్కింటి వాళ్ళబ్బాయి పెళ్ళి ఉందిగా’’ అన్నది.అతను సరేనన్నట్లుగా తాపీగా తల వూపాడు. ఆమె స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగిస్తూండగా పక్కింట్లోంచి సన్నాయి మేళం వినిపించింది. ‘‘ఓహో! పెళ్ళికొడుకు విడిదింటికి బయల్దేరు తున్నట్లున్నాడు’’ అనుకుంది దేవుడికి అరటి పళ్ళు నైవేద్యం పెడుతూ.ఆమె పూజచేస్తున్నా మనసంతా పక్కింట్లోనే ఉంది. హడావిడిగా హారతిచ్చి రెప్పపాటులో దండం పెట్టేసి, కిటికీవైపు నడిచింది. కర్టెన్‌ కాస్త పక్కకు లాగి కుతూహలంగా పక్కింటి వైపు చూసింది. 

మామిడాకుల తోరణం కట్టిన గేటు ముందు పూలు అలంకరించిన కారు ఆగి ఉంది. మేళతాళాల మధ్య బంధువులు తోడు రాగా ముస్తాబైన పెళ్ళికొడుకు కారువైపు వస్తున్నాడు. అది చూస్తూనే మనోరమ-‘‘ఏమండీ పెళ్ళికొడుకు బయల్దేరుతున్నాడు చూద్దురు గానీ రండి... రంది’’ అంటూ పిలిచింది ఆతృతగా.స్నానానికి వెళ్లబోతూన్న మహీపతిరావు ‘‘అదేంటి త్వరగా తెమల మన్నావు గదా!’’ అనాలనుకున్న మాటల్ని గొంతులోనే నొక్కేసి కర్టెన్‌ వైపుకి వెళ్ళాడు.‘‘అదిగో పెళ్ళికొడుకును చూడండి అసలా మొహంలో కళే లేదు. ఆ మధుపర్కాలు చూశారా ఎంత నాసిగా ఉన్నాయో? ఆ కారుకు పూలేవి? అరడజను మూరలన్నా కట్టారో లేదో మరీ బోసిగా ఉంది’’.అటు చూశాడు మహీపతి. పెళ్ళికారు మరీ అంత బోసిగా ఏం లేదు. ఆ అబ్బాయి మొహం చిరునవ్వుతో కళగానే ఉంది. దుస్తులూ బాగానే ఉన్నాయి అనుకుంటూ అక్కడ్నించి వెళ్ళబోయాడు. అది గమనించిన మనోరమ అతన్ని ఆపింది.‘‘దేనికంత హడావిడి. అదిగో వరుని తల్లిదండ్రులను చూడండి. వాళ్ళ మొహాల్లో కొడుకు పెళ్ళి జరుగుతుందన్న ఉత్సాహం వీసమంతైనా లేదు. పైగా దిక్కులు కమ్ముకున్న ఆ మొహాలు ఎలా వెలవెల బోతున్నాయో చూడండి!’’ అన్నది.భార్య చెబుతున్నట్లుగా కళ తప్పటాలూ, వెలవెలబోవటాలూ ఇలాంటి వేమీ అన్పించలేదు. తనకన్నీ మామూలుగానే కన్పిస్తున్నాయి. ఈమె కళ్ళలో ఆ దేవుడు స్పెషల్‌గా లెన్స్‌ ఏమైనా అమర్చాడేమో. ప్రతిదీ రివర్స్‌లో కనిపిస్తున్నాయ్‌ గొణుక్కుంటూ గడియారం వంక చూశాడు. పెళ్ళి ముహూర్తం సమయానికి తాము కూడా ఫంక్షన్‌ హాలుకు చేరుకోవాలి కదా! ఓ వేళ ఖర్మకాలి ఆలస్యం అవుతే కారణం ఏదైనా తననే బాధ్యుణ్ణి చేసి భార్య అనబోయే మాటలకు జడిసి స్నానానికి వెళ్ళాడు మహీపతిరావు.