‘‘ఇవాళో రేపో అంటున్నార్ట’’.‘ఎవరి సంగతి?’ అని ఆమె అడగలేదు. ‘‘ఎవరు చెప్పారు?’’ అని అడిగింది.‘‘గంట క్రితం నాకు ఫోను చేసి చెప్పారు కామేశ్వరరావు గారు!’’‘‘ఏమయిందట?’’‘‘ఏమో, నేనా వివరాలు అడగలేదు. ఇక్కడ ఆసుపత్రులు లేనట్టు అంత దూరం వెళ్ళాడు. జీవితంలో సరయిన పని ఒక్కటి చెయ్యలేదు. ఎంతకని చచ్చేది!’’ అని ఓ క్షణమాగి, ‘‘రిజర్వేషను దొరికితే సాయంత్రం బండికి నేను వెళ్తాను. నువ్వు వస్తావా?’’ అంది ఆమె, ఎటో చూస్తూ.క్షణమాలోచించి అంది విశాల, ‘‘వస్తాను’’ అని.‘‘రిజర్వేషను దొరికితే కబురు పంపుతాను, ఏ బండికో, ఏ టైముకో సికిందరాబాదు స్టేషనుకు వచ్చెయ్యి’’.‘‘మీ ఆయన రావటం లేదా?’’‘‘రానన్నారు. ఆయనకిష్టం లేదు. ఎవరొచ్చినా రాకపోయినా నాకు తప్పదు కదా?’’ఆ ఏష్ట మొగుడిమీదో, తన మీదో తేల్చుకోలేక పోయింది విశాల ‘తనకూ ఇష్టం లేదు. అయినా తప్పదు వెళ్ళాలి’ అనుకుంది. అయితే పైకేం మాట్లాడలేదు.మారు మాట్లాడకుండా భానుమతి వెనక్కి తిరిగి, వీధి గేటు తీసింది. గేటు ముయ్యను కూడా లేదు. అలా బార్లా తెరిచే, కారెక్కి వెళ్ళిపోయింది. విశాల ఆమెని లోపలికి రమ్మని అడగలేదు. ఆమె కూడా మొక్కుబడి పూర్తయినట్టు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయింది. ప్రహరీ గేటు మూసి వెనక్కు తిరిగింది విశాల.పచ్చగా పాకుడు పట్టిన ఇటుకలతో తన ఇల్లు దర్శనమిచ్చింది ఆమెకు. 

ఎప్పుడో కట్టిన ఇల్లు, బయటి ప్లాస్టరింగ్‌కు అది నోచుకోలేదు. పురాతనపు నాలుగ్గదుల కొంప. ‘ఇంక ఆ ఆశ్రయమూ తనకుండదు కాబోలు. మళ్ళీ మరో ఇల్లు అద్దెకు చూసుకోవాలి’ అనుకుంది విశాల.ఆ వెంటనే బయటకు వెళ్ళి తన చిట్‌ఫండ్‌ కంపెనీ మానేజరు సెల్‌కు ఫోను చేసింది. అప్పుడు ఎనిమిది గంటలే అయింది. ఇంకా ఆఫీసు టైము కాలేదు. అతను లైనులోకి వచ్చాక చెప్పింది. ‘‘మా ఆయనకు సీరియస్‌గా ఉందట! నేను హరిద్వార్‌ వెళ్ళాలి. నాకో వారం రోజులు శలవు మంజూరు చెయ్యండి’’ అని.‘‘అయ్యో, ఆయన హరిద్వార్‌ ఎందుకు వెళ్ళారు?’’ అనడిగాడు మానేజరు.‘‘చూసి వస్తానని వెళ్ళారు లెండి’’ అని క్లుప్తంగా చెప్పి, శలవ మంజూరు చేయించుకుని ఫోను పెట్టేసింది విశాల.్‌్‌్‌మనిషి కనుమరుగయినా ఆ వ్యక్తిని గూర్చిన జ్ఞాపకాలు చావవు. అందుకే అతని తోడి, తన ప్రథమ పరిచయం గుర్తుకు వచ్చింది విశాలకు. తనా ఇంటికి మొదటిసారి ‘అద్దెకు ఇల్లు ఇస్తారా?’ అని అడగటానికి వచ్చిన దృశ్యం ఆమె కళ్ళ ముందు ఆడినట్లయింది.‘‘బాబాయిగారూ! ఇంత ఇల్లు మీకు ఒక్కరికీ పెద్దది కదా!

ఆంటీ వాళ్ళకు రెండు గదులు అద్దెకిస్తారేమోనని తీసుకొచ్చాను’’ అనడిగింది అతన్ని తనను తీసుకువచ్చిన నిర్మల.ఆ అమ్మాయి కూడా అప్పుడు తనతో పాటు చిట్‌ఫండ్‌ కంపెనీలో పని చేసేది. ఆ కంపెనీలో తనకప్పుడు పదిహేను వందల జీతమిచ్చేవాళ్ళు. ఎలాగో తల్లీ, తనూ కష్టం మీద జీవితం వెళ్ళదీసేవాళ్ళు. అమీర్‌పేట నుండి తనను సికిందరాబాదు బదిలీ చేయటంతో, సికిందరాబాదులోనే అద్దెకు ఇల్లు ఏదయినా దొరుకుతుందేమోనని తను ప్రయత్నిస్తుంటే, తనతో పనిచేసే నిర్మల తన్నా చిలకలగూడలోని ఇంటికి తీసుకువచ్చింది.‘‘మా పక్కింటి బాబాయిగారిది పెద్దిల్లు. ఆయనుండేది ఒక్కడే. అంత ఇల్లేం చేసుకుంటాడు! అడిగా చూద్దాం’’ అంది. ఆపైన, ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు అంది. ‘‘ఆయన మంచితనం మీద భరవాసాతోనే వెళ్తున్నాం తప్ప, ఆయనంతకు ముందు ఇల్లు అద్దెకు ఇచ్చినవాడు కాదు. నీ అదృష్టం ఎలా వుందో చూద్దాం. మనమడిగితే కాదంటాడనుకోను’’ అంది నిర్మల.