ఒంగోల్లోని తూర్పుపాలెం... సమయం సాయంత్రం ఐదు గంటలు...అప్పుడే స్కూల్‌ వదిలారు. పిల్లలుల పెద్దగా అరుచుకుంటూ బైటికొచ్చారు. ఎనిమిదో తరగతి చదువుతున్న సిద్దార్థ పుస్తకాల సంచిని భుజాలకు తగిలించుకుని గేట్‌ బైటికి మెల్లగా నడుస్తూ, నెట్టుకుంటూ అరుచుకుంటూ పోతున్న పిల్లల వైపు అసహనంగా చూశాడు. రోజూ ఇంతే. స్కూల్‌ వదలగానే బైటపడ్డట్టు పిల్లలు కేరింతలు కొడ్తూ ఇళ్ళ వైపుకు పరుగెత్తారు. ప్రిన్సిపాల్‌గారు డిసిప్లీన్‌ డిసిప్లీన్‌ అంటూ ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు. గేటు దాటకముందు క్యూ పద్ధతి పాటిస్తారు కానీ గేటు దాటటం ఆలస్యం పంజరంలోంచి బైట పడిన పక్షుల్లా మారిపోతారు.సిద్దార్థ ఇదే విషయాన్ని తన నానమ్మతో చెప్తే ‘చదువంటే ఆసక్తి లేనోళ్ళు, స్కూలంటే ఇష్టంలేనోళ్ళు స్కూల్‌ వదలగానే అబ్బా పీడా వదిలిందని ఆనందంతో గంతులేస్తారేమో నాన్నా’ అంది.‘మరి నాకెందుకు అలా అన్పించదూ’ అని అడిగితే ‘నువ్వు బంగారు కొండవి. చదువుల తండ్రివి’ అంటూ బుగ్గలు పుణికింది.ఇంటికొచ్చేదారిలోనే రామాలయం ఉంది. అక్కడ ఎన్ని పావురాలో... గుంపులు గుంపులుగా... దైవదర్శనానికొచ్చిన భక్తులు పావురాలకు జొన్నలు విసురుతున్నారు. అవి కువకువలాడు కుంటూ తింటున్నాయి. ఆ దృశ్యం చూడడం సిద్దార్థకెంతిష్టమో....రోజూ చూసినా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది.గింజల్ని తింటున్న పావురాల వైపు చూస్తూ సిద్దార్థ అక్కడే నిలబడ్డాడు. అవి తమ మెడల్ని ఒయ్యారంగా తిప్పటం ఎంత బావుందో...పిల్లలెవరో హుష్‌ అంటూ వాటిని అదిలించినట్టున్నానరు. ఒక్కసారిగా బూడిద రంగు మేఘం కమ్మేసినట్లు పావురాలు శబ్దం చేసుకుంటూ పైకి ఎగిరాయి. గుడి ప్రాకారం మీద కొన్ని నిముషాలు కూచుని నేల మీద ఉన్న గింజల వైపు ఆశగా చూసి మెల్లగా ఒకొక్కటే దిగొచ్చి మళ్ళా గింజల్ని తినటంలో లీనమైపోయాయి.కొద్దిసేపు చూశాక ఇంటి వైపుకి కదిలాడు. దారికి రెండు వైపులా గుబురుగా పెరిగిన తుమ్మ చెట్లున్నాయి. చీకటి పడ్డాక ఆ దారెంట నడవడమంటే పిల్లలందరూ భయపడ్దారు. ఓ చెట్టు కింద ఏదో కదిలినట్టనిపించి సిద్ధార్థ నిశితంగా చూశాడు. 

పిల్లి...నల్లపిల్లి...దాని నోట్లో ఏదో ఉంది మరికొంత దగ్గరగా జరిగి చూశాడు. పావురం రెక్క...అక్కడే మరో పిల్లి ఉంది. ఓ రెక్క తెగిపోయిన పావురం మెడని నోట్లో ఇరికించుకుని పరుగు లంకించుకుంది. నల్లపిల్లి తన నోట్లోని రెక్కని వదిలేసి ఆ పిల్లి వెంట బడింది. దాని నోట్లోని పావురాన్ని లాక్కునే ప్రయత్నంలో భీకరంగా అరిచి పోట్లాటకు దిగింది.అప్పటికి ఆ దృశ్యం మిగతా పిల్లల కంట పడింది. రాళ్ళు తీసుకుని పిల్లుల వైపు గురి చూసి కొట్టారు. గాయపడిన పావురాన్ని వదిలేసి ఆ రెండు పిల్లులు పారిపోయాయి. పిల్లలు దగ్గరకెళ్ళి చూశారు. పావురం ఒంటినిండా రక్తం...ఓ కాలు విరిగిపోయింది. మెడ సగం కొరికి వదిలేయడం వల్ల చచ్చిపోయినట్టు పడిపోయి ఉంది. కానీ చావలేదు. దాని గుండె కొట్టుకోవడం కన్పిస్తోంది.‘‘పాపం చూడరా...ఎంత రక్తం కారుతుందో...ఇది బతకటం కష్టం. అరగంటకో గంటకో చచ్చిపోవడం ఖాయం’’ అన్నాడొకడు. సిద్దార్థ ఆ పావురాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అది సగం తెరిచిన కళ్ళతో సిద్దార్థ వైపు చూసింది. ఆ చూపులో అనంతమైన వేదన కన్పించింది. కుడిచేతి వ్రేళ్ళతో దాన్ని ప్రేమగా నిమిరాడు. అది మరింత దీనంగా వాడి వైపు చూసినట్లనిపించింది. ఆ చూపులో వేడుకోలు....అది మాట్లాడలేకున్నా దాని మూగ భాష తనకర్థమౌతోంది. ఆ బాధ నుండి విముక్తి కలిగించమని తనని ప్రార్థిస్తున్నట్లు....