జీవితం గాఢమైంది. నిగూఢమైంది.స్వల్ప విషయాలకే ఆనందపడేలా చేస్తుంది.కారణం లేకుండానే బాధపెడ్తుంది. కష్టపడకుండా, కొనకుండా, సంపాయించకుండా దొరికిన ప్రేమ కోసంతాపత్రయపడేలా చేస్తుంది. హృదయంలోని ప్రేమనంతా బయటపెట్టి ఎన్నో అడగాలనుకునేలా చేస్తుంది.రాత్రింబవళ్లు ఉవ్విళ్లూరుతూ నిద్రను చెదరగొట్టి,స్వప్నాలను దాచుకొని, సమస్యల్ని సృష్టించి ఒకరి కోసం ఒకరు బాధపడేలా చేస్తుంది.దేదీప్య మొబైల్‌ తీసి నెంబర్‌ నొక్కి కాల్‌ బటన్‌ ప్రెస్‌ చేసింది. అవతల మొబైల్‌కి సిగ్నల్స్‌ వెళుతున్నాయి.మనసు లోతుల్ని తాకుతూ ‘కాలర్‌ టోన్‌’ గోదారి ప్రవహిస్తున్నట్లు, పక్షులు పాడుతున్నట్లు, చిరుగాలి చుట్టూ చేరి ‘నీ కళ్లు నేను తుడవనా’ అన్నట్లు అన్పిస్తోంది దేదీప్యకి.అవతల వైపు నుంచి...‘‘హలో..చెప్పు దేదీప్యా!’’ అంటూ అతని గొంతు గట్టిగా విన్పించింది. ఎన్ని సార్లు ఫోన్‌ చెయ్యమన్నా చెయ్యని దేదీప్య ఇప్పుడెందుకు చేసిందో అర్థం కాక...అతని గొంతు వినగానే ఏం మాట్లాడాలో తెలియక...‘‘హాయ్‌!’’ అని పలకరించిందే కానీ ఆమె గొంతు పెగల్లేదు.‘‘మాట్లాడు దేదీప్యా! ఎందుకు ఆగిపోయావ్‌?’’ అంటూ అవతల గొంతు ఆత్రంగా ధ్వనించింది.ఆమె మాట్లాడకుండా గట్టిగా ఏడ్చేసింది.‘‘ఎక్కడున్నావు దేదీప్యా? ఎందుకేడుస్తున్నావ్‌? ఏం జరిగింది?’’ అని అంటున్న అతని హృదయ తంత్రులు ఆమెకేం జరిగిందోనన్న భయంతో తెగిపోయేలా ఉన్నాయి.

అతని గొంతులోని మార్దవానికి ఆమె మనసు కరిగిపోయింది.కాలం కడలిని దాటుకుంటూ, మరుగున పడ్డ జ్ఞాపకాలను ఆమె మనసు స్పృశిస్తుంటే చెవి దగ్గర మొబైల్‌ పెట్టుకొని ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఏడుస్తోంది.అర్థం చేసుకున్నాడతను.‘‘ఏడవకు దేదీప్యా! నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. నీ మనసు పూర్తిగా నీలోకి వచ్చిన తర్వాతనే..నాతో సరిగ్గా మాట్లాడగలనన్న నమ్మకం నీలో ఏర్పడిన తర్వాతనే నా మొబైల్‌కి కాల్‌ చెయ్యి’’ అన్నాడతను.వెంటనే ఆమె మనస్సు గతంలోకి వెళ్లిపోయింది.సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం..దేదీప్య ఎంబిఏ సీటు కోసం కాకతీయ యూనివర్శిటీ కాంపస్‌లో ఉన్న కౌన్సిలింగ్‌ బ్రాంచి దగ్గరకి వాళ్ల అన్నయ్య దేవేందర్‌తో వెళ్లి...అక్కడ చెట్ల నీడలో నిలబడింది.ఆమె చూపులు చెట్లను, ఇళ్లను దాటుకుంటూ ఎక్కడికో వెళ్లి నిలిచాయి.ఆకాశం, భూమి కలిసే చోటును చూడాలంటే ఆమెకు చాలా ఇష్టం.

ఆకాశం ఒక చిత్రకారుని కాన్వాస్‌లా మారి మబ్బుల డిజైన్‌ కోసం ఎదురు చూస్తుంటే మబ్బులొచ్చి సూర్యునికి అడ్డుపడ్డాయి. సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటకు రాకముందే దేదీప్య కళ్లకి అభిరాం కనిపించాడు.‘‘ఎవరీ హ్యాండ్‌సమ్‌ గాయ్‌,’’ అని మనసులో అనుకోకుండాఉండలేకపోయింది. కొన్ని క్షణాలు అతని వైపు అలాగే చూసింది.స్టూడెంట్స్‌తో, పేరెంట్స్‌తో ఆ ప్రదేశం కిటకిటలాడుతోంది.మైక్‌లో ‘ర్యాంక్స్‌’ అనౌన్స్‌ చేస్తున్నారు.‘స్ర్కీన్‌ డిస్‌ప్లే’ చేస్తున్నారు.దేదీప్య అక్కడే నిలబడి అందులో వస్తున్న ర్యాంక్‌ క్యాటగిరిని, సీట్స్‌ని గమనిస్తోంది. వాళ్ల అన్నయ్య కూడా అదే పనిలో ఉన్నాడు.మధ్య మధ్యలో అభిరాంని చూస్తోంది దేదీప్య.ఎంబిఏ సెంకడియర్‌ చదువుతున్న అభిరాం వాళ్ల కజిన్‌ కోసం అక్కడికి వచ్చాడు.వాళ్లంతా తమకి సీటు ఏ కాలేజీలో వస్తుందో, ఏ కాలేజి ఛూజ్‌ చేసుకోవాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు.అక్కడున్న అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ ఒకరినొకరు పట్టించుకునేలా లేరు. వాళ్లల్లో కొంతమంది పేరెంట్స్‌ కోసం, కొంతమంది కాల క్షేపం కోసం, మరి కొంతమంది బాగా చదివి ఉన్నతమైన స్థాయిలోకి రావడం కోసం వచ్చిన వాళ్లే ఉన్నారు. ఉన్నతమైన స్థాయిలోకి వెళ్లాక నలుగురికి ఎంతో కొంత ఉపయోగపడాలనుకునే వాళ్లు కూడా ఉన్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తి దేదీప్య. కొండంత ఆత్మవిశ్వాసంతో స్థిర నిశ్చయంతో ఆమె ఆలోచన లెప్పుడూ ఆమె ముఖంలో ప్రతిఫలిస్తుంటాయి.