కనగాల మసీదులో అజా వినబడి వినబడకముందే నిద్ర లేచింది నాగమ్మ. జేజి వాకిలూడుస్తోంది. ఎంకయ్య గిలకబావి దగ్గరకు కావిడేసుకెళ్లాడు. కుండలు సట్టులన్నీ బయటేసి నీళ్లు జల్లింది ఆదిమ్మ. పడ్డ దూడ ముందు పేడకళ్లు తీసి, నాలుగు ఎండు పరకలేసింది. కసువంతా ఊడ్చి, దాన్ని సీమచింత చెట్టు కింద కట్టేసి ఎండు గడ్డేసింది. కోళ్ల గంపల్లేపితే కోళ్లన్నీ కీకర బేకరంటూ రెక్కలు టపటపలాడిస్తూ కంపలంట, దొడ్డులంట పరిగెత్తినయి.నాగమ్మ తోకల ఎంకటేసు ఇంటెనకున్న ఈత చెట్టుల దగ్గరకెళ్లింది. పండి రాలిన ఈత కాయలేరుకుందామని. అప్పటికే కిందపడ్డ పండిన ఈతకాయల్ని ఏరుకుని గెడకర్రతో ఈత గెలల్లో పండిన కాయల్ని దులుపుతున్నాడు రాముడు.ఈరమ్మ, ఎంకాయమ్మ ఈత కాయలు తింటూ - ‘‘ఆ పక్కనుండయి రా ఈ పక్కన సూడు’’ అని వాడికి చెబుతున్నారు. నాగమ్మ కొక్కకాయకూడా దొరకలేదు.రాముడి గెడకర్ర లాక్కుంది. ‘‘ఇట్టాగంట్రా గెడపొట్టుకునేది? ఎదవనాయాలా యిదిగో ఈ గెల్లో సూడు ఎన్నికాయలు పండినయ్యో. గుడ్డినాయాలకి ఒక్కటీ కనబడలా’’ - అంటూ గెడకర్రతో ఒక్క దులుపు దులిపేసరికి బడబడమంటూ దోసెడు ఈతకాయలు రాలినయి.అంతాకల్సి ఈతకాయలన్నీ ఏరుకున్నారు. కాయలు తిన్న తర్వాత గెడకర్రకు కొంకె కట్టి ‘‘పిచ్చిమ్మ ఇంటెనక సీమసింతసెట్టు గుత్తులుగుత్తులు కాయలు కాసిందే కోసుకుందామా?’’ అంది నాగమ్మ.‘‘పిచ్చమ్మా?బూతులు తిట్టుద్దే వద్దులే’’ అంది ఈరమ్మ.‘‘నిన్నే పల్లికోన పోయిందిగా! ఇయ్యాలకూడా రాదు. నిన్న మా అమ్మతో సెబుతుంటే యిన్నా’’ అన్నాడు రాంగోడు. అంతాకల్సి పిచ్చమ్మ సీమసింతకాయలు చెట్టును దులిపేశారు. వాటిని తినేసి అట్నుంచటే పైడిమ్మ చెరువులో ఈతలెయ్యడానికెళ్లారు.ఫఫఫఉచ్చు లెంకయ్య ఇంటి ముందున్న బంగినపల్లి మామిడిచెట్టు సందులేకుండా యిరగ్గాసింది. చెట్టుమీద ఆకులకన్నా కాయలే ఎక్కువగా కనబడుతున్నాయి. పొడలు పొడలుగా నీడ పడుతుంది చెట్టుకింద.దానయ్య, సుబ్బడు, ఏకోబు, కోటేసు, నాంచారయ్యలంతా కల్సి ఆ చెట్టుకింద గోళీలాట ఆడుతున్నారు. ఈతలేసి అప్పుడే అక్కడికొచ్చింది నాగమ్మ. బట్టలన్నీ వంటిమీదే ఆరిపోయినయి. జుత్తు ఇంకా తడారలేదు.‘‘ఏందే పైడిమ్మ సెరువులో ఈతలేసొత్తున్నావా? కలింకాయలు తేలా?’’ అడిగాడు కోటేసు.‘‘ఆడే తిన్నాం రా’’ అంది నాగమ్మ ‘‘కలిమి దుంపలు ఎయ్యే’’ అన్నాడు సుబ్బడు.

ఆడి మాటలు పట్టించుకోకుండా ‘‘నేనూ గోళీలాటడతాన్రా’’ అంది జేబులో గోళీలు తీస్తూ.‘‘వద్దులేమ్మా’’ అన్నారు నాగేసు, బుల్లియ్య.‘‘రెండు నీళం బిల్లేరు గోళీలు పెద్ద పించర్లు యిత్తారా నేను గానీ ఓడిపోతే’’ అంది నాగమ్మ.అక్కడున్న అందరికీ నాగమ్మ దగ్గరున్న నీళం బిల్లేరు గోళీలంటే ఆశ పుట్టింది.‘‘సరే! ఓడిపోతే గోళీలన్నీ తీసుకుని లగెత్తకూడదమ్మాయ్‌! నీ నీళం గోళీలు పెద్ద పించర్లు రెండు యివ్వాల్సిందే’’ అన్నాడు నాంచారయ్య.

చుట్టూ గుండ్రంగా బరిగీసి, సెంటర్లో గోళీలు పెట్టారు. నాగమ్మ కూడా రెండు గోళీలు పెట్టింది.వాటివంక గురి చూసి చేతిలో వున్న పెద్ద పించరుతో కొట్టింది నాగమ్మ అంతే! గోళీలన్నీ బరిదాటినయి.గంటలో అందరి జేబుల్లో ఉన్న గోళీలన్నీ ఖాళీ అయిపోయి, నాగమ్మ జేబులోకొచ్చినయి. బుల్లియ్య గొనుకున్నాడు. యాకోబుకేడుపొచ్చి ఇనిపిచ్చీ, ఇనిపిచ్చనట్టు తిట్టుకున్నాడు. నాగేసుకి రోషం పొడుచుకొచ్చింది ఇంత పొడుగున.‘‘ఇది తొండాటంటూ’’ నాంచారయ్య గోల చేశాడు.‘‘ఇంక నీతో జల్మలో ఆడం పో!’’ అంటూ సుబ్బడు ఒట్టేసుకున్నాడు.‘‘మొన్న లంకబీడులో గేదెలు గేలప్పేసే ఆటలో కూడా నువ్వే గెలిచేవు నీతో మేం మాటాడం’’ అన్నాడు నాంచారయ్య.