ఆకాశానికి భూమికి ఏకధారగా వర్షం కురుస్తోంది.ఉండుండి ఆకలిగొన్న సింహం అసహనంగా గర్జించినట్లు ఆకాశం భీకరంగా ఉరుముతోంది.విశాఖ పట్టణం రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారంపై డిజిటల్‌ క్లాక్‌ సమయం అర్థరాత్రి కావస్తోంది అని తెలియచేస్తోంది.రొద చేసుకుంటూ ప్లాట్‌ఫారం పైకి వచ్చి ఆగింది ఒక రైలుబండి. రావాల్సిన సమయం కంటే నాలుగు గంటలు లేటుగా వచ్చిన ఆ రైలులోని ప్రయాణీకులు ప్లాట్‌ఫారంపై రైలు ఆగి ఆగకుండానే తోసుకుని తోసుకుని సామానుతో సహా దిగడం మొదలు పెట్టారు.ఆమె అందరికంటే ఆఖరున దిగింది. చీరకొంగు మెడపై నించి భుజాల మీదుగా ముందుకి చుట్టుకుంది. ఆమె ఒళ్ళంతా చీరతో చుట్టుకుని వున్నా ఒకసారి ఆమెను చూసిన వారు ఆగి మళ్ళీ చూసే ఆకర్షణ ఆమె ప్రతి కదలికలోనూ తొణికిసలాడుతోంది. చేతిలో ఉన్న చిన్న బాగేజిని వీల్స్‌ పై లాగుతూ బయటకు నడిచింది. బెదురు చూపులతో చుట్టూ మాటి మాటికి చూసుకుంటూ నడిచింది. గుంపులుగా నడుస్తున్న జనాలను తప్పించుకుంటూ జాగ్రత్తగా నడిచింది.విపరీతమైన గాలులు వీస్తూ కురుస్తున్న కుంభవృష్టికి స్టేషన్‌ లోపల బయట కూడా హటాత్తుగా కరెంట్‌ పోయింది. అప్పటి వరకూ ప్రకాశవంతంగా వున్న స్టేషన్‌ ఆవరణ, ప్లాట్‌ఫారంలలో చిక్కటి చీకటి అలుముకుంది. వెంటనే తమ తమ మొబైల్స్‌ తీసి యథాశక్తి వెలుతురు విరజిమ్మారు ప్రయాణీకులు. మిణుగురు పురుగులు రెక్కలు విప్పి ఎగిరితే విరిసిన వెలుతురు తునకల్లా ప్రయాణీకుల చేతుల్లోని మొబైల్‌ ఫోన్ల నుంచి వచ్చే వెలుతురు, జల్లెడలోంచి వెన్నెల కాంతులు కురిసినట్టు వెల్లివిరిసాయి.కరెంట్‌ పోయి చీకటి అలుముకోగానే ఆమె ఒక్క క్షణం నడక ఆపి భీతహరిణేక్షణలా తడబడుతూ చూసింది. కాని అక్కడక్కడా మొబైల్‌ ఫోన్ల కాంతులు ప్రకాశించడంతో తేరుకుని స్టేషన్‌ వెలుపలికి నడిచింది.ఒక వైపు వర్షం, మరో వైపు చీకటి. ఆటోలకు, టాక్సీలకు డిమాండ్‌ పెరిగిపోయింది. నోటికి వచ్చినంత డిమాండ్‌ చేస్తూ నచ్చిన రూట్‌లోనే వెళ్తామంటూ ప్రయాణీకులతో బతిమాలించుకుంటున్నారు ఆటోవాలాలు.

ఆమె ఒక పక్కగా నుంచుని బాగ్‌లో నుంచి తన మొబైల్‌ ఫోన్‌ తీసింది. నెంబర్‌ డయల్‌ చేసి చెవికి ఆనించుకుంది. ఫోన్‌ రింగయింది. కాని అవతల వ్యక్తి స్పందించలేదు. ఆమె ముఖంలో మరింత ఆందోళన కనబడింది. వణుకుతున్న చేతులతో మళ్ళీ కాల్‌ చేసింది.‘ఏటమ్మా, ఏడకెళ్ళాలి’ అంటూ దగ్గరగా వచ్చాడు ఒక ఆటో వాడు. చొక్కా పైన లూజుగా ఒక పాత జర్కిన్‌ వేసుకున్నాడు. చింపిరి జుత్తు నీళ్ళతో తడిచి దూరానికి వాసన వస్తోంది. వాడు నోరు తెరిచి ఆమె వైపు చూస్తూనే వున్నాడు. ఆమె వాడి వైపు కోరగా చూసి ఫోన్‌పై దృష్టి పెట్టింది. రెండో సారి కూడా ఫోన్‌ పూర్తిగా రింగయింది కాని స్పందన లేదు.‘‘ఏటి ఎవరూ నేరా’’ అన్నాడు ఆటోవాడు చుట్టూ చూస్తూ.వాటి మాటలకు ఆమె గుండెలు దడదడలాడాయి. గబగబా తన బాగేజీ లాక్కుని మళ్ళీ ప్లాట్‌ఫారం వైపు వెళ్ళింది. అదే ఆమె చేసిన పొరపాటు! అలమంద నుంచి లేగదూడ వేరు పడితే వేటకుక్కలు వెంటపడినట్లు మరో ఇద్దరు మృగాళ్ళు ఆమె వెనకగా వెళ్ళారు.