‘‘అమ్మా ఎవరొచ్చేరో చూడు’’ అంటూ స్రవంతి నవ్వుతూ లోపలికి వస్తుంటే ‘‘ఎవరే వ చ్చింది’’ అంటూ కుతూహలంగా కూతురు వెనుకే లోపలికి వస్తున్న ఆ ఆరడగుల వ్యక్తిని చూడగానే ఇట్టే పోల్చుకుంది గంగ.గంగ వదనం అతడ్ని చూడగానే ప్రపుల్లమయింది. ‘‘మీరా చైతన్యబాబూ రండి రండి ఇలా కూర్చోండి’’ అంటూ సంతోషంతో రెండడుగులు ముందు కేసిఆహ్వానించింది.చైతన్య అక్కడే ఉన్నా సోఫాలో కూర్చున్నాక ‘‘చైతన్యా మీరెలా ఉన్నారు? మీరు బాగా మారిపోయారు’’ అంది ఆప్యాయంగా.‘‘నేను బాగానే ఉన్నాను. నేను మారానో లేదో నాకైతే తెలియదు గాని నీలో మాత్రం ఏమార్పూ లేదు. అప్పుడెలా ఉన్నావో ఇప్పుడూ నా కళ్లకు అలాగే కన్పిస్తున్నావు. కాలానికి ఏం చిట్కా వేసేవో చెబితే నాలాంటి వాళ్లు కూడా ఫాలో అవడానికి వీలుంటుంది కదా’’ చైతన్య నవ్వుతూ అన్నాడు.‘‘అదేం లేదు బాబూ’’ కొంచెం సిగ్గు పడుతూ తలొంచుకుంది గంగ.‘‘అన్నట్టు శివ ఎలా ఉన్నాడు?’’ అడిగేడు చైతన్య.‘‘బాగానే ఉన్నారు’’ గంగ చెప్తుండగా స్రవంతి లోపల్నుంచి యాపిల్‌ జ్యూస్‌ తెచ్చి ‘తీసుకోండంకుల్‌’ అంటూ చైతన్య కందించింది.

‘‘మా స్రవంతి మీకెలా తెలుసు? మీరిద్దరూ ఇలా కలవడం ఎలా సంభవం? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది’’ గంగ తన విస్మయాన్ని బయటపెట్టింది.‘‘నాకిదివరలో ఈ అంకుల్‌తో అసలు పరిచయమే లేదమ్మా. ఈ రోజు జరిగిన మా కాలేజ్‌ ఫంక్షనుకు ముఖ్య అతిథిగా ఈయన్ను ఆహ్వానించేరు. నేను చేసిన కూచిపూడి నృత్యానికి ప్రథమ బహుమతి రావడంతో బహుమతి ప్రదానోత్సవం ఈ అంకుల్‌ చే తుల మీదుగా జరపడంతో...’’‘‘ఆగమ్మా ఆ తరువాత జరిగింది నేను చెప్తాను’’ అంటూ మధ్యలోనే ఆపేడు చైతన్య. అతడేం చెప్తాడోనని ఆసక్తిగా వింటోంది గంగ.‘‘స్రవంతిని చూడగానే చాలా పరిచయం ఉన్నట్టనిపించింది. తేరిపార ఆమె ముఖంలోకి చూస్తే ఆ కళ్లు, ముగ్ధమోహనరంగా చిర్నవ్వులు చిందించే ఆ బుల్లి పెదాలు, నున్నగా మెరిసే ఆ బుగ్గలు అన్నీ నీ పోలికలే కన్పించేయి గంగా. కొద్దిసేపు తటపటాయించినా చివరకు అడక్కుండా ఉండలేకపోయాను’’ ఆపేడు చైతన్య.‘‘ఏమని చైతన్యబాబూ....’’ కుతూహలం తొంగి చూసింది గంగలో.‘‘మీ అమ్మపేరు గంగ, మీ నాన్నపేరు శివే కదూ’’ అని. ‘‘నిజమే మా అమ్మానాన్న మీకెలా తెలుసంటూ’’ స్రవంతి ఆశ్చర్యంగా అడిగింది.‘‘అవునమ్మా నాకు ఊహ తెలిసీ బంధువులమంటూ మనింటికెవరు వచ్చిందే లేదు. అలాంటిది ఈ అంకుల్‌ మీ ఇద్దరి గురించి అడిగేసరికి నేను ఒక్కక్షణం షాకయ్యేను.

‘‘మా అమ్మ, నాన్న మీకెలా తెలుసని’’ అడిగితే ‘‘వాళ్లు నాకు బాగా తెలుసు. ఇప్పుడెక్కడుంటున్నారని’’ అడిగేరు. ‘‘ఇక్కడే ఉంటున్నామని’’ చెప్పగానే ఇలా మిమ్మల్ని చూడాలంటూ నా వెనుకే వచ్చేరు’’ చెప్పింది స్రవంతి.‘‘గంగా మీరీ ఊళ్లోనే ఉన్నారని తెలిసేక మిమ్మల్ని చూడకుండా ఇంటికి వెళ్లాలనిపించలేదు. అందుకే మీ అమ్మాయి కూడా వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టేను’’ చైతన్య మాటలకు గంగ నొచ్చుకుంది.‘‘అలా ఎప్పుడూ అనుకోవద్దు చైతన్యా. ఇంతకాలానికి మిమ్మల్ని చూడ్డం నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? తాతయ్యగారు, అమ్మమ్మ బాగానే ఉన్నారు కదూ’’ అడిగింది గంగ.