ప్రోలోగ్‌...

ఐదు వేల అడుగుల ఎత్తయిన కొండ మీద ఒక యువకుడు నిలుచున్నాడు. కింద అందమైన అగాధం లాంటి లోయ వుంది. కాని అది అతడికి భయంకరంగా అనిపిస్తోంది. ఎందుకంటే మరుక్షణం అతడు కిందకి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. అక్కడే అతడు మరణించాలని పథకం రచించుకున్నాడు.చుట్టూ చూసాడు. నిర్మానుష్యంగా వుంది. ఎత్తయిన కొండలు ఎగురుతున్న పక్షులు, నీలంగా పైన ఆకాశం. ఈ ఆహ్లాదకరమైన అందమైన ప్రకృతికి అతడికి ఏ మాత్రం ఆనందం ఇవ్వడం లేదు. కారణం. అతడు పంచభూతాల్లో కలిసిపోవాలని నిర్ణయించుకున్నాడు.తనకి జన్మనిచ్చిన తల్లిని గుర్తు చేసుకున్నాడు. జీవితంలో తాను అనుకున్నవేవి సాధించలేని అసమర్థతని గుర్తు చేసుకున్నాడు. ఉన్న మిత్రులు శత్రువులుగా మారి మాట్లాడి బాధపెట్టిన సందర్భాలు గుర్తు తెచ్చుకున్నాడు.తానొక్కడు ఈ భూమ్మీద లేకపోయినంత మాత్రాన ఈ విశ్వ ప్రయాణంలో ఏ మార్పు రాదు అని తీర్మానించుకున్నాడు. భగవంతుడికి థాంక్స్‌ చెప్పుకున్నాడు.అన్నీ మరిచిపోయాడు. అన్నింటిని మరిచిపోయాడు. నలిగిపోతున్న మనసులోంచి జారిపోతున్న శక్తినంతా కూడదీసుకుని ఒక్కదుటున కొండ శిఖరం మీద నుంచి లోయలోకి దూకబోయాడు.ఆ క్షణమే ‘‘ఆగు!’’ అని దిక్కులు పిక్కటిల్లేలా కేక వినపడింది. వెంటనే ఆగాడు.

పండిన పంటంతా కళ్ళ ముందరే తగలబడిపోతోంది. తానే తగలబెట్టేసాడు. గిట్టుబాటు ధర లేదు. చేసిన అప్పులు తీరలేదు. కొత్త అప్పులు. భార్యా బిడ్డలకు తిండి పెట్టలేని పరిస్థితి. భూమిని నమ్ముకున్నా, ఏ ఏటికాయేడు దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితి. ఇక బ్రతుకు లేదు. ఊళ్ళో తల ఎత్తుకు తిరగలేడు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, నీచ రాజకీయాలు నడుపుతూ గొప్పోళ్ళు పేదోళ్ళను పీల్చి పిప్పి చేస్తున్న పరిస్థితి. ప్రజా సంక్షేమం మరిచిపోయి ప్రభుత్వం ప్రజలతో వ్యాపారం చేస్తున్న వైనం. ఇక భగవంతుడు కూడా రక్షించలేడు.పిట్టల్లా ఒకరి తరువాత ఒకరు తనలాంటి వాళ్ళు రాలిపోతున్నారు. ఎవరు పట్టించుకుంటారు? ఇదిలా జరగాల్సిందే...పురుగుల మందుని చేతిలోకి తీసుకున్నాడు. సన్నకారు రైతు మల్లన్న కన్నీరు ధారాపాతంగా కారుతుండగా, ఏడుస్తూ నోట్లో పోసుకోబోయాడు. ‘‘ఆగు’’ అని ఎవరో తన చేతిని పట్టుకుని ఆపినట్లయింది. ఆగక తప్పలేదు. ఆగాడు.

తరాలు మారిన స్త్రీ తలరాత మారలేదు! అన్ని రంగాల్లో మహిళ ముందుకు దూసుకుపోతోంది. ఆమెను ఎవరూ ఆపలేరు. ఆమె ఒక మహాశక్తి. స్త్రీ ప్రభంజనం ఈ యుగం...ఇలాంటివన్ని వార్తల్లో కథనాలు... మీడియా ప్రసారాలు...చట్టాలు ఎన్ని ఉన్నా కట్నాలను ఆపలేవు. ఏదో ఒక రూపంలో అత్తింటి వారు సంతోషించకపోతే కోడలికి మనుగడ లేదు. రోడ్డు మీదకు వచ్చి ప్రసార మాధ్యాల ముందు నిలబడిన యువతుల సంఖ్యఎంత? ఎంతో మంది బయటకు రాలేక, కక్కలేక మింగలేక వివాహ వ్యవస్థలో ఉన్న లోపాలకు బలి అవుతూ, పురుషాహంకారానికి ఎదురు తిరగలేక స్త్రీగా పుట్టినందుకు తమ ఖర్మ అని బావిస్తూ బ్రతుకులు వెళ్ళదీస్తున్నవారు లెక్కలేనంతమంది.పెళ్ళయిన మొదటి రోజు నుంచీ చూస్తోంది...ఏ రోజు సుఖమూ లేదు. సంతోషమూ లేదు. పిల్లలని కనే యంత్రంలాగా, సేవ చేసే మరబొమ్మలా ఈ బ్రతుకు ఎంతకాలం?ఇక తను బ్రతకదు. ఈ రాత్రితోనే తన జీవితం సరి. నిద్రపోతున్న పిల్లలను చూస్తోంటే కన్నీరు ఆగడం లేదు. గుండె బ్రద్దలయిపోతోంది. భర్త రాడు. ఏ అర్థరాత్రో, అపరాత్రో తాగి తందనాలడుతూ వస్తాడు.