‘‘పిన్నీ! పెళ్లికి రావద్దా నేను?’’కార్డులు ఎవరెవరికి రాయలో... బట్టలు ఎక్కడ తీసుకోవాలో... ఎవరెవరికి చీరలు పెట్టాలో... ఎవరికి జాకెట్టు ముక్కలతో సరిపెట్టాలో... ఇత్యాది చర్చలన్నీ వేడివేడిగా జరుగుతున్న నేపథ్యంలో సంయుక్త అడిగిన ప్రశ్న అందరిని ఉలిక్కిపడేలా చేసింది.సంయుక్త తల్లి శారద ముఖం మ్లానమైంది. ఏదో పనున్నట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది. మిగిలిన వాళ్లందరూ ముఖాలు చూసుకున్నారు. ముందుగా తేరుకున్నది వసంతే. వసంతంటే శారద చిన్న తోడికోడలు. ‘‘అదేం మాటమ్మా? అన్నయ్య పెళ్లికి నువ్వు రాకుండా ఎలాగా? అంతా ఎలా వస్తారో నువ్వూ అలాగే వద్దువుగానీ’’ అంది. వాత్సల్యంగా.‘‘థ్యాంక్స్‌ పిన్నీ! నేనేం రాబోవడం లేదు. పెళ్లి హడావుడి అంతా మా ఇంట్లోనే ఉంది. అత్తయ్యలు, పిన్నులు... ఇంకా ఎవరెవరో వస్తున్నారు. వెళుతున్నారు. ఎవరికివాళ్లు తమదే బాధ్యతన్నట్టు పనులన్నీ మీదకెత్తుకుని చేస్తున్నారు. కానీ ఇప్పటి దాకా నా ప్రస్తావనే రాలేదు. తెలుగు సినిమాల్లోలాగా నా ఫోటోకి దండ వేసేసారేమోనని డౌటొచ్చి అడిగినాంతే’’ అంది సంయుక్త‘‘ఔనే సంయుక్తా, పెళ్లికి పిలవలేదని అంత ఇదవుతున్నావు? నువ్వు చేసిన పని ఏమంత బావుందని? మరొకరు మరొకరూ అయితే నువ్వన్నట్టే చేసేవారు. మీ అమ్మానాన్న కాబట్టి నిన్ను ఇంకా ఇంటికి రానిస్తున్నారు. వాళ్ల పిల్లవని చెపకుంటున్నారు’’ అంది పెద్ద మేనత్త జయలకి్క్ష

.సంయుక్త ఏదో జవాబివ్వబోయేంతలో ‘‘సమ్మూ’’ అని లోపల్నించి తల్లి పిలుపు వినిపించి లేచి వెళ్లింది. ఆమె గదిలోకి రాగానే తలుపు దగ్గరగా వేసింది శారద. ‘‘నీ మానాన నువ్వు హాయిగా బతుకుతున్నావు. నీ సరదాలేవో నువ్వు చూసుకోక వాళ్లనెందుకమ్మా రెచ్చగొడతావు? ఈ పెళ్లికి నువ్వు రాకపోతేనేం? నచ్చజెప్తున్నట్లు అంది.‘‘నేనొస్తాననే అనుకుంటున్నావా? వద్దామని నాకున్నా వాళ్లు రానిస్తారా? నా ఒక్కదానికే ఎందుకీ శిక్ష? శేషు బావకి ఎందుకు లేదు? గొంతు దుఃఖంతో రుద్ధమవుతుంటే అడిగింది. ఆమె వెనకే వచ్చి తలుపు దగ్గిర ఆగిపోయిన వసంత తను కూడా తలుపు తోసుకొని లోపలకి అడుగుపెట్టింది.

‘‘అదడిగింది నిజమే అక్కయ్యా! శేషుకి మనిళ్లలో అన్ని మర్యాదలు యధాప్రకారం జరుగుతున్నాయి. దీన్ని మాత్రం చిన్న చూపు చూస్తున్నాం’’ అంది.‘‘నువ్వు పిలుస్తావు. తగుదునమ్మా అని అది బయల్దేరి వస్తుంది. అక్కడ వాళ్లు దీన్ని హేళన చేస్తే? దీని భర్తను అవమానపరిస్తే? ముప్పయేళ్లయింది వసంతా నేనీ ఇంటికి కాపరానికికొచ్చి. వీళ్ల అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అందరూ ఒక తానులే... పల్లెటూరి అహంభావాలు... తెలిసీ తెలియని మూర్ఖత్వాలు... సమ్మూ కాబట్టి మీ బావగారు కొంచెం తగ్గారు. మరెవరైనా అయితే ఆయనా వీళ్లతో చేతులు కలుపుతారు. ఇపడేనా ఆయన దీనితో మాట్లాడరు. ఇది కూడా ఆయనొచ్చే టైముకి వెళ్లిపోతుంది...’’ అని ఆగింది శారద.వసంత విచలితురాలైంది.‘‘....భూమ్మీద పడిన క్షణం నుంచీ ఇది ఆ శేషుగాడి భయానికి హడలి చస్తూనే బతికింది. నవ్వన్నది ఎరగదు. ఇపడే... ఏదో కాస్తం సుఖంగా బతుకుతోంది. దాని మానాన అది ఉంది. వదిలేయ్‌.’’ శారదకి ఏడుపొచ్చేసింది. కళ్లలో నీళ్లు నిండాయి. బయటకి తెలియరాదన్నట్టు చపన కళ్లు తుడుచుకొని దుఃఖాన్ని నిగ్రహించుకొంది.