మరో పదిహేను రోజులు గడిస్తే గానీ - వేసవి ఎండ - దాడికి దిగదు. గడువుకి ముందర దాడికి దిగే అగ్రరాజ్యం కాదది. అందుచేత ఉదయపు ఎండ హాయిగా వుంది. సముద్రమ్మీదుగానూ, నాగావళి నది మీదు గానూ వీస్తోన్న గాలి చల్లగా, ఆహ్లాదంగా వుంది.సుభాషిణి స్కూటర్‌ వెనుక సీట్లో కూర్చున్నది. రోడ్డు కిరువైపులా - రకరకాల షాపులూ, వచ్చీపోయే కస్టమర్లూ. రోడ్డు మీద గూడా - వాహనాల్తో, జనంతో రద్దీగా వుంది. స్కూటర్‌ నెమ్మదిగా, జాగ్రత్తగా నడుపుతున్నాడు సుభాషిణి భర్త.ఒక హోటల్‌ పొయ్యి మీద మరిగే నూనె వాసన ఘాటుగా సుభాషిణి ముక్కును తాకింది. ఆ హోటల్‌ కేష్‌ కౌంటర్‌ దగ్గరి స్టీరియోలోంచి - స్ర్తీ, పురుష కంఠాల్లో దేనికీ చెందని కంఠంతో వాయిద్య రొదల మధ్య యేదో పాట విన్పించింది. దానితోపాటూ - కేష్‌ కౌంటర్‌ వద్ద కూచున్న ఓనర్‌ - ఎదవకాన, యెదవా; ఎంగిలిప్లేట్లు కనిపించలేదేట్రా? తియ్యి, బేగి తియ్యీ, ఎదవకాని యెదవా మినప కుడుముల్తో మాత్రమే బలిసిన దేహంతో, పలు మృగాల స్వరపేటికలు కలిగిన గొంతుతో వేసిన కేకలు విన్పించేయి.‘‘...మనలో చాలామందికి స్వరపేటికలఖ్ఖర్లేదు. ఒరేయ్‌, ఒసేయ్‌, ఎద్దూ, మొద్దూ, కాదూ, లేదూ, పో, పో, వాద్దొద్దూ - యిలాంటివి మాట్లాడ్డానికి స్వరపేటికలెందుకు? శరీర భాష చాల్ను, కదండీ...’’ అంది సుభాషిణి, భర్త వీపు మీద కుడిచేత్తో తడుతూ.సుభాషిణి భర్త - యేకాగ్రతతో స్కూటర్‌ నడుపుతున్నాడు. 

రోడ్డు మీద జనంతో రద్దీయే గాక, అతని అంతరంగంలో కూడా అనేకానేక భయాలూ, సందేహాల్తో రద్దీగా వుంది.సుభాషిణికి, కొన్నాళ్ళుగా గొంతునొప్పి. స్వరపేటిక మీద ఇనుప బూట్లతో తొక్కినట్లుంటుంది. మాట పెగలదు వొక్కోసారి. గొంతులోకి - ఆహారపానీయాల్తో పాటూ, యేవో సంకెళ్లు దిగుతున్నట్లుంటుంది. అలాంటప్పుడు, పచ్చిమంచి నీళ్లు తాగాలన్నా భయమే ఆమెకు.మరొకొక్కప్పుడు - గొంతులోంచి మాటలు, నీటి ఊటల్లా గలగలా...! ఏవేవో కబుర్లూ, కలలూ, ఆశలూ, ఆకాంక్షలూ...!స్వరపేటిక మూగబోయినా, ఊటబావిలో నీటిలా మాటలూ ఉప్పొంగినా - ఆందోళన పడ్తాడు సుబాషిణి భర్త. ఆమె మామూలు స్థితికి వొచ్చేక, ఆందోళన తగ్గి నిట్టూరుస్తాడు.‘‘... స్వరపేటికను తొక్కేస్తోన్న యినుప బూట్లు యెవరివి? ఇది లోకమా? నిర్బంధ శిబిరమా..?’’ అని ప్రశ్నించి భర్తను అనుమానంగా చూస్తుంది,

అంతలోనే!ఏమయింది యీమెకు? ఎవర్ని శంకించి, దేన్ని వ్యతిరేకిస్తోంది? ప్రశ్నల్తో - అంతరంగం రద్దీగా వున్న అజయ్‌ భుజాన్ని మళ్లీ పొడిచి - యేదో ప్రశ్నించింది సుభాషిణి. దాంతో, అసహనంతో -‘‘... నువ్వు కాసేపు నోర్మూసుకో. నా భుజాన్ని పొడవకుండా కూచో..’’ అని కసురుకున్నాడు అజయ్‌.కానీ, అంతలోనే, కసరుకున్నందుకామె యెంత నొచ్చుకుంటుందో, అసలే అనారోగ్యం - అని తలచి, స్కూటర్‌ స్లో చేస్తూ, వెనుకకు చూస్తూ, సుభాషిణికి ‘సారీ’ చెప్పేడు!స్కూటర్‌ స్లో అవలేదు. బ్రేక్‌ పడలేదు. తిన్నగా వెళ్లి, ముందున ఆగివున్న - ఓ కారు బ్యాక్‌ గార్డెన్‌ గుద్ది ఆగింది.ఆ కారు దగ్గర నిల్చొని, నోటితో గూడా కొన్నింటిని తగలెయ్యొచ్చన్నట్టు - సిగరెట్‌ తగలేస్తున్నాడో సఫారీధరుడు.