మృగశిర కార్తె అడుగుల సడితో నేలంతా చల్లబడాలి.తొలకరి చినుకుల దరువులతో భూమి ఎదలు పులకరించాలి.ఎక్కడో దూరంగా మట్టిమీద రాలిన చినుకుల వాసన అలలు అలలుగా తీసుకొచ్చి జీవుల ఎదల్ని లోతుగా స్పర్శించాలి.ఆర్ద్రకార్తె వచ్చీరాకముందే పగడాల్లాంటి ఆర్ద్ర పురుగులు నాగటి చాళ్ళ మట్టి పొత్తిళ్ళ మీద రైతు ఆశల్లా అందంగా పారాడాలి.వర్షం కురిసి వెలిసిన రాత్రి మండ్రగబ్బలు, తేళ్ళు, జర్లు, పాములు తమ తమ బొరియలు వదలి కళ్ళాల్లో, దిబ్బల్లో, ఇంటి ముంగిళ్ళలో యధేచ్ఛగా తిరుగుతూ జనాల్ని భయపెట్టాలి.వాన రావాలి. ఈ సంబరమంతా జరగాలి.తొలకరి వానలు కురవక ఎన్నాళ్ళయిందో!అదనులో పదను వాన పడక ఎన్ని రుతువులైందో!ఆర్ద్ర దాటి పునర్వసు కార్తె కూడా నడిగొనింది.తొలి ఏకాదశి పండుగ సైతం చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది.సంక్రాంతి లాగా అది పెద్దపండుగ కాకపోవచ్చు.రైతులకు తొలి పండుగ గదా!ఓవైపు మిద్దె దొనల్లోంచీ, కొట్టం చూరులనుంచీ వాననీళ్ళు దూకుతూ వుంటే - మరోవైపు జొన్నల్ని పేలాలుగా వేయించి, పిండి విసిరి బెల్లపు పాకంలో కలిపి ఉండలుగా చేసి వాటిని అపురూపంగా తినటం కలగా మిగిలిపోయింది. 

రెండో రోజుకే రాళ్ళలా గట్టిపడిన పేలపిండి వుండల్ని జేబుల్లో దాచుకొని బర్రెల వెంట తిరుగుతూ కొరుక్కుతినటం కేవలం కలే అయ్యింది. కరువు దెబ్బకు పండుగ పారిపోయింది. తెలుగువారి తొలిపండుగ ఎటో కొట్టుకుపోయింది.వాన రాకనే ఈ దౌర్భాగ్యమంతా!ఒక్క వాన చాలు! నేలంతా పదునయ్యే వాన... వాగులు, వంకలు, చెరువులు, దొరువుల్ని ఏకంచేసే వాన...నాలుగు చినుకులకే తమకు ఈకలు, తోకలు వస్తాయి గదా! అంత వాన కురిస్తే చెరువంత రెక్కలు రావూ! ఈ పాషాండాన్ని వదలి అందరూ రెక్కలూపుకుంటూ కొర్ర బువ్వలాంటి తమ పల్లెమట్టి మీదకు చేరుకోరూ!గోడకింద పుల్లదుమ్ములో తమకు తోడుగా పడున్న నాగళ్ళను ముసలాళ్లింకా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. వాటిని ఇంటి ముంగిట్లోకి చేర్చి పందకం సరిచేయాలి. సమయానికి ఎద్దులో దున్నలో దొరక్కున్నా తామే కాడికింద మెడలు వంచి అయినా పొలాన్ని దున్నాలి.వాన రావాలి.నిన్న మొన్నటి కంటే ఈ రోజు మేఘాల సందడి ఎక్కువైంది.అందుకే ఈ ఆలోచనలన్నీ.ఇనుప గోళంలో ఇటుకలు పేర్చి తలగుడ్డ సవరించుకొంటూ తలెత్తి ఆకాశం కేసి చూశాడు శివన్న.ఎక్కణ్ణించో హడావుడిగా తోసుకొస్తూ దట్టంగా గుమిగూడుతున్నాయి కారుమబ్బులు.వాటికేసి కన్నార్పకుండా చూశాడు.ఎదలోపల్నుంచి ఆశలు పొటమరిస్తోండగాఆకాంక్షగా చూశాడు.తలగుడ్డను తీసి రెండు చేతుల్లో పట్టుకొని ఎదల వద్దకు చేర్చుకొంటూ ‘‘కాశి నాయనా! ఇప్పుడన్నా ఒక్క పదును వాన కురిపీ తండ్రీ’’ అన్నాడు ఆర్ద్రంగా.

చుట్టూ పనిలో నిమగ్నమై వున్న కూలీలంతా ఒక్కసారిగా అతని కేసి చూశారు.అతని చూపులవెంట ఆకాశంకేసి తలెత్తారు.మేఘాల కదలికల్ని చూసి కొందరు గట్టిగా నిట్టూర్చారు.వాళ్ళ కనుగుడ్ల మీదుగా బాగా బతికిన వాన కార్తెలు కలకలం చేసుకుంటూ కదలిపోయాయి.‘‘ఆ కాలం మల్లా వస్తదా?’’ శివన్న ఎదలో మొలకెత్తిన ప్రశ్న.ఇట్లాంటి వానమబ్బుల్ని ఎన్ని చూడలేదనీ!ఆకాశంలో మేఘాలు కన్పిస్తే చాలు పురివిప్పిన నెమలి అయ్యేవాడు. సన్నని ఉరుము రాగాలకే ఎదలు పులకరించి ఎన్ని రాత్రిళ్ళో నిద్రను పక్కకు నెట్టి యాలపదాలతో గడిపిన జాములున్నాయి. నాలుగు చినుకులకే పరవశించి తోటి సావాసగాళ్ళతో కలిసి కులుకుడు భజనకు అడుగులు తొక్కిన రోజులున్నాయి.