దివ్యంగా... ధగధగా మెరిసిపోతున్న అద్దాల మేడలు... విశాలమైనరాచబాటలు.... వందల ఎకరాల్లో అందమైన ఉద్యానవనాలు... న్యూయార్కు మహానగరాన్ని భూతల స్వర్గాన్ని చేస్తున్నాయి.మానవుని మేధా సంపత్తికి ప్రతిరూపంగా నిలబడ్డ అతిగొప్ప పట్టణం న్యూయార్కు.ఒళ్లు జలదరింపజేసే ఎన్నో వంతెనలు... ఆ వంతెనల్లో అంతస్తులు... ఆ అంతస్తుల్లో మోటారు వాహనాల, రైళ్ల మూకుమ్మడి పరుగులూ చూపరులను దిగ్భ్రమకులోనుచేస్తున్నాయి.కళ్లు జిగేల్‌ మనిపించే ఆ ఎత్తయిన అద్దాల మేడల అంతర్భాగాల్లో ఉద్యానవనాలు... వాటి రూఫ్‌ టాపుల మీద ఉద్యానవనాలు... ఋతువులననుసరించి రూపురేఖలు మార్చుకునే ఉద్యానవనాలు... న్యూయార్కును నిత్యనూతనం చేస్తున్నాయి.న్యూయార్కులోని మన్‌హాటన్‌ మరీ మనోహరం, శోభాయమానం. ప్రపంచాన్నే శాసించే మరో ప్రపంచం. యావత్‌ ప్రపంచానికి మన్‌ హాటన్‌ ఓ ట్రెండ్‌ సెట్టర్‌.ఇవన్నీ ఒక ఎత్తయితే, ఈ నగరపు రాచ వీధుల్లో తిరగాడే పాలరాతి బొమ్మలాంటి అందమైన అతివలు మరో ఎత్తు. అందరూ వరూధినీ, శశిరేఖలే!

అత్యాధునిక దుస్తుల్లో అత్యంతాకర్షణీయంగా- కన్ను చెదిరేలా తయారై- ఇంద్రలోకంలోని అప్సరసల్ని గుర్తుకు తెస్తారు. తల నుంచి భుజాల మీదుగా తేనె జలపాతమై జాలు వారుతున్నట్లు ఆ వెంట్రుకలు- ఎర్రటి పెదాలు- నిష్పత్తి తప్పని ఆ ఒంటి వంపులు- ప్రకృతి ప్రసా దించిన ఆ అందాలను యథాతథంగా చూపించే ఆ అప్సరసల్లోని తెగువ-‘ఆహో! ఏమి ఈ నగర వైభవం! ఏమి ఈ దేశ సౌభాగ్యం!’ అని చూసేవారి మనస్సులో అనందం పరవళ్లు తొక్కక మానదు.అలాంటి మహానగరపు మన్‌హాటన్‌ కోలంబస్‌ అవెన్యూలో వెంకట్‌సాయి రంగులు మాసి తుప్పు పట్టిన ఓ చిన్న సైకిల్‌ మీద ఫుడ్‌ పార్సెల్స్‌ డెలివరీ చేయడానికి పరుగు తీస్తున్నాడు. రయ్యిమని పోతున్న మెర్సిడిస్‌బెంజ్‌, బిఎండబ్ల్యూ కార్ల మధ్య ఝుమ్మని తన సైకిల్‌ని తీసుకెడుతున్నాడు.అందాల చిలకలు తిరుగాడే ఈ రాచనగరులో తనూ ఒక భాగమైనందుకు... ప్రపంచాన్ని శాసించే ఈ మహానగరంలో తనూ నివసిస్తున్నందుకు అప్పుడప్పుడు మనసులో మురిసిపోతున్నా... గర్వపడుతున్నా... వెంకట్‌ సాయి ముఖంలో మాత్రం ట్రాజెడీ హీరో లక్షణాలే కనిపిస్తుంటాయి ఎప్పుడూ.....

జీవితంలో మంచీ, చెడూ చూచి, ఎదురు దెబ్బలూ తిని, జీవితంలో ఓడి,గెలిచి, గెలిచి. ఓడి జీవితంలో డబ్బు ‘ది పవర్‌ఫుల్‌’ కాదని వాదించి, ఇప్పుడు అవునని నమ్మి, నమ్మిన సిద్ధాంతాలు తారుమారై, నమ్మిన మనుషుల వలన గోల్‌మాలై, తనలోని మంచితనమే సమర్థత అనుకొని, ఇప్పుడు కాదని తెలుసుకొని, ఎంతో తర్జన, భర్జన చేసి సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొని రాయల్‌ డచ్‌ విమానంలో ఎగిరి వచ్చి ‘ద ల్యాండ్‌ ఆఫ్‌ ది హోప్స్‌’ మీద దిగిపోయాడు వెంకటసాయి తన స్నేహితుడు భారవితో.ఎన్నో బంగారు కలలు కంటూ ప్రపంచపు నలుమూలల నుంచి అమెరికన్‌ భూమి మీద అడుగు మోపే లక్షలాది విదేశీయుల్లో తనూ ఒకడయ్యాడు.వెంకటసాయి ఒక మెడికల్‌ డాక్టర్‌. హైదరాబాద్‌ మెడికల్‌ కాలేజీ నుంచి పట్టభద్రుడు.వెంకట్‌ది మీడియం సైజు పర్సనాలిటీ. చామనఛాయ రంగు, నెత్తిమీది జుట్టు కొంత పల్చబడింది. భార్య అశ్విని ఫర్మాయిష్‌ మీద ఈ మధ్య మూతి మీద మీసాలు తీసేయడం లేదు.అందం విషయానికొస్తే వెంకట్‌ బార్డర్‌లైన్‌ కేసే. కానీ బయటకేమీ అనకపోయినా తన అంతరంగిక ప్రపంచంలో వెంకట్‌ అది ఒప్పుకోడు. తను అందగాడ్నేనని అనుకుంటాడు. అలా కాకపోతే జీవితంలో మధ్య మధ్య తారసపడ్డ స్త్రీలు తనని ఆకర్షించడానికి ఎందుకు ప్రయత్నిస్తారన్నది ఆయనలోని వాదన.