కథ: కొమ్మూరి సాంబశివరావు

నవీకరణ: మల్లాది వెంకటకృష్ణ మూర్తి

వందేళ్ళ క్రితం అగాథాక్రిస్టీ యింగ్లీషులో రాసిన డిటెక్టివ్‌ నవలలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాయి. అగాధాక్రిస్టీ పేరు యిప్పటికీ ఎన్నో దేశాలలో వినిపిస్తూనే వుంటుంది. నూతన సహస్రాబ్దిలో అడుగుపెట్టాం. భాషలో, మాట్లాడే తీరులో మార్పులు వచ్చాయి. సంస్కృతి సంప్రదాయాలు మారా యి. సాంకేతిక రంగం చుక్కలదాకా విస్తరించింది. మారిన నేపథ్యంలో అగాథాక్రిస్టీ నవలల్ని యీనాటి రచయితలతో కొత్తగా రాయించి సర్వత్రా విడుదల చేశారు. చేస్తున్నారు. మూలకథను తీసుకుని దానికి కొత్త హంగులు చేర్చి, రూపొందించిన నవలలు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రయోగాన్ని తెలుగులో కూడా ప్రయత్నించాలనే వుద్దేశంతో కొమ్మూరి సాంబశివరావు సుమారు యాభై ఏళ్ల క్రితం రాసిన డిటెక్టివ్‌ నవలను, మల్లాది వెంకట కృష్ణమూర్తి నవీకరించారు.

తెలతెలవారుతుండగా తలుపు తట్టిన చపడైంది. దాంతో భాస్కరరావుకి మెలకువ వచ్చింది. అది తన గది తలుపు చపడని గ్రహించి ఆయన లేచి బద్ధకంగా పక్క మీద కూర్చున్నాడు. ఆయ న స్పర్శ తగలడంతో పక్కనే పడుకుని వున్న భాస్కరరావు భార్య సీతమ్మ కళ్ళు తెరచి చూసి, మళ్ళీ కళ్ళు మూసుకుంటూ నిద్రమత్తుతో చెప్పింది.‘‘పడుకోండి’’భాస్కరరావుకి మళ్ళీ తలుపు చపడు వినిపించడంతో లేచి వంటి మీద అడ్డదిడ్డంగా వున్న లుంగీని సరిగ్గా కట్టుకుని వెళ్ళి తలుపు తీశాడు.‘‘హేపీ బర్త్‌డే టు యూ డాడీ’’ గుమ్మం అవతల నిలబడ్డ అతని పదహారేళ్ల రెండో కూతురు మీనా చెప్పింది. తన చేతిలోని పూలగుత్తిని తండ్రి చేతిలో వుంచింది. ఆమె చేతిలో ఇంకో పూలబొకే వుంది.‘‘థాంక్‌ యూ’’నవ్వుతూ చెప్పాడు భాస్కరరావు.‘‘ఏమిటి?’’ అంటూ లే చింది భాస్కరరావు భార్య సీతమ్మ.‘‘ఇవాళ డాడీ బర్త్‌డే. అందుకని పొద్దున్నే విష్‌ చేస్తున్నాను మమ్మీ’’ చెప్పింది మీనా.‘‘ఇవాళేం తారీకు? డిసెంబర్‌ ఆరా?’’ అడిగిందావిడ లేచి కూర్చుని.‘‘అవును ఈ సంగతి నీకు గుర్తే లేదా? మమ్మీ ఈ బొకే నీకు, మీ ఇరవై అయిదవ మేరేజ్‌ ఏనివర్సరీకి’’ ఇంకొకటి తల్లి చేతిలో వుంచింది.ఆ గదిలోకి అడుగు పెట్టిన భాస్కరరావు పెద్ద కూతురు రేవతి తండ్రి చేతిలో గిఫ్ట్‌ రేప్‌ చేసిన ఓ పార్శిల్‌ని వుంచి చెప్పిందాయనతో.

‘‘మెనీ హేపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే డాడీ. అండ్‌ బెస్ట్‌ విషెస్‌ ఫర్‌ ఏ హేపీ మేరేజ్‌ ఏనివర్సరీ’’.‘‘థాంక్‌ యూ.. థాంక్‌ యూ’’ ఆనందంగా చెప్పి కదిలి బాత్‌రూంలోకి వెళ్ళాడు. చన్నీళ్ళతో మొహం కడుక్కుని ఆయన బయటికి వచ్చేసరికి సీతమ్మ ఆ పార్శిల్‌ని విప్పింది. అందులోని అట్టపెట్టె లోంచి చక్కటి చేతిగడియారాన్ని తీసి ఆయనకిచ్చింది. దాన్ని చూడగానే ఆయన కళ్ళు మెరిసాయి. చాలా కాలంగా ఆయన కొత్త వాచీని కొనాలనుకుంటూ దాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు.‘‘అది కాలేజీ అయ్యాక ఓ గంట ఎందుకు ఇంటికి లేటుగా వస్తోందని రెండు, మూడుసార్లు అడిగారు కదామీరు? మీకు బర్త్‌డేకి ఈ వాచీని ప్రజెంట్‌ చేయ డానికి బంజారాహిల్స్‌లోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ కార్నర్‌లో పార్ట్‌టైం వెయిటర్‌గా జాబ్‌ చేస్తోంది’’వెంటనే భాస్కరరావు రేవతి వంక ఆప్యాయతతో కూడిన కృతజ్ఞతతో చూశాడు.