స్వపరిచయం
స్వస్థలం నెల్లూరు, పుట్టి పెరిగింది అక్కడే. తల్లిదండ్రులు శ్రీ సింగీతం వెంకట రమణరావు, శ్రీమతి కృష్ణవేణిబాయి. ప్రస్తుతం బెంగుళూరు వాస్తవ్యులుగా ఉన్నారు. ఆరుగురు సంతానంలో మూడో వాణ్ణి.భారతీయ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీరుగా చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాను. నా ప్రవృత్తి రచనలు చేయడం, గానం, చిత్రలేఖనం. విద్యార్హత ఎ.ఎం.ఐ.ఇ., మెకానికల్ ఇంజనీరింగ్. భార్య విజయలక్ష్మి, ఇద్దరు మగపిల్లలు ప్రద్యుమ్నరావు, ప్రద్యోతరావు.రచనా వ్యాసంగం పన్నెండో ఏటో ఛందోబద్ధమైన కవిత్వంతో ప్రారంభమైంది. అలా వ్రాయడంలో ఏకైక గురువు తండ్రిగారే.మొదటికథ 1996లో ప్రచురింపబడింది. కొంత విరామం తరువాత మళ్ళీ 2005లో రచనా వ్యాసంగం పునః ప్రారంభమైంది.ఇప్పటి వరకూ సుమారు పాతిక కథలు అచ్చయ్యాయి. అందులో ఎక్కువ భాగం హాస్య కథలు. అలాగే ఇప్పటివరకూ రాసిన ఏడు నవలలో ఇది వరకు మూడు నవలలు ప్రచురణయ్యాయి. ఈ ‘రాగ విపంచి’ నాలుగవ నవల.సి.పి.బ్రౌన్ అకాడమీ మరియు నవ్య, సంయుక్తంగా నిర్వహించిన నవలల పోటీల్లో నా నవల బహుమతి పొందడం ఆనంద దాయకంగా ఉంది.
ఎస్.ఘటికాచల రావు
13/2, ‘కల్పవృక్ష’, ఎం.సి.మంజు ఫ్లాట్స్, అలగిరి స్ట్రీట్,తేన్‌పళని నగర్, కొలతూర్,చెన్నయ్ - 600 099
ఆకాశంలోనికి అలవోకగా లేచింది అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ ఏయిర్పోర్టు నుంచి ఆ బోయింగ్ విమానం.అమెరికాలో పై చదువులు ముగించుకునిభారతదేశానికి పయనమైంది సౌవర్ణి ఆవిమానంలో. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ముగించింది.ఆడవాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చదవడం చాలా అరుదైన విషయం. ఆ తరువాత ఎం.బి.ఎ కూడా ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణురాలై, అక్కడివాళ్ళు ఆఫర్ చేసిన ఉద్యోగాన్ని వద్దని మరీవచ్చేస్తోంది.పరాయి దేశంలో చదువైతే సరే, ఉద్యోగమంటే ఆమెకు మొదట్నుంచీ ఇష్టంలేదు. అదే ఆమె తండ్రి ఉద్దేశ్యం కూడా. ఆమె చేతిలో తండ్రి రాసిన ఉత్తరం ఉంది. తండ్రి ఏనాడూ ఆమె ఇష్టాన్ని కాదనలేదు. అంత స్వాతంత్ర్యాన్ని తండ్రి వద్దనుంచి పొందినా,ఆమె దాన్ని వక్రమార్గంలోపెట్టకుండా సరైన దిశగా ఆలోచించి స్థిరమైననిర్ణయాలే తీసుకుంటుంది ఎప్పుడూ.విమానం పూర్తిగా గాల్లోకి లేచాక హోస్టెస్ చెప్పిన తరువాత సీటు బెల్టు వదులు చేసుకుంది. తమ ముందున్న మేగజైన్ బ్యాగ్‌లో నుంచి చేతికందిన మేగజైన్ తీసి చదవసాగింది.
తనది కిటికీ పక్కన సీటు. కిటికీలో నుంచి బయటికి చూస్తే పెద్దపెద్ద భవనాలు క్రమంగా అగ్గిపెట్టెల పరిమాణంలో కుంచించుకు పోసాగాయి. క్రమంగా న్యూయార్క్ పట్టణం సరిహద్దు మాత్రమే ప్రపంచ పటంలోని భౌగోళిక స్థితిగతుల మ్యాప్ లాగా కనబడసాగింది. మరి కాస్సేపటికి విమానం చాలా ఎత్తుకు చేరుకుంది. దాదాపుగా నలభైవేల అడుగుల ఎత్తులో ఎగరసాగింది.సుమారుగా పదహారు గంటల ప్రయాణం అక్కడి నుండి ముంబైకి.