కృష్ణమూర్తి నంబూద్రి తను కొత్తగా తయారు చేసిన కథాకళి ‘సమవర్తి’ నృత్యగాథని అభినయించి చూపుతున్నాడు. కూచిపూడి నాట్యవిశారదుడు భాగవతుల భరతశాస్త్రి ఆసక్తిగా చూస్తున్నాడు.‘సమవర్తి’ అంటే సాక్షాత్తు యమధర్మరాజే.యమధర్మరాజు అంశ రూపాలే పాండవాగ్రజుడు ధర్మరాజు, ధృతరాష్ట్రభ్రాత విదురుడు.యక్షప్రశ్నల ఘట్టంలో యమధర్మరాజు శక్తి సామర్థ్యాలు, ధర్మ పరిజ్ఞానం వ్యక్తమౌతాయి. నచికేతోపాఖ్యానంలో యమధర్మరాజు ఔదార్యం, సావిత్రి సత్యవంతుల కథలో ఆయన దైవత్వ ప్రత్యేకత, గరుడ పురాణంలో యమలోక వివరాలే గాకుండా పాపులకు పరమ భయంకరంగా, పుణ్యాత్ములకు పరమ సుందర మూర్తిగా దర్శనమిచ్చే ఆసక్తికరమైన అంశాల వంటివి భరతశాస్త్రి చదివి వున్నాడు.కృష్ణమూర్తి నంబూద్రి అభినయిస్తున్న ‘సమవర్తి’ నృత్య నాటిక, యమధర్మరాజుకున్న ప్రత్యేకతల్ని అద్భుతంగా ప్రదర్శిస్తోంది.ప్రదర్శన పూర్తి చేసి, నేరుగా వచ్చి భరతశాస్త్రి పాదాలకు భక్తి పూరస్సరంగా నమస్కరించాడు నంబూద్రి. అతని వినయానికి భరతశాస్త్రి పులకించిపోయాడు, చేతుల్తో పైకెత్తి ఆప్యాయంగా హృదయానికి హత్తుకున్నాడు.‘‘కృష్ణమూర్తీ! నీ విద్యలో నీవు నిష్ణాతుడివని నాకు అర్థమైంది. నంబూద్రిలంటే కొన్ని శతాబ్దాల క్రితం గుంటూరు మండలం నంబూరు గ్రామం నుండీ కేరళ వలస వెళ్ళిన తెలుగు బ్రాహ్మలని చరిత్ర వుంది. తమ గ్రామ నామం వదలకుండా నంబూద్రిలని వ్మవహరించుకుంటున్నారు. ఇప్పటి తరానికివన్నీ తెలియవు. భారతీయ సంస్కృతి మూలాలన్నీ ఒకే ఆత్మ నుండి ఆవిర్భవించాయి. అందుకే భారతీయుల మధ్య భాష, ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేకుండా ఆత్మీయానుబంధాలు పెల్లుబుకుతూ వుంటాయి. నువ్వు నిరంభ్యంతరంగా మా కూచిపూడి గ్రామంలో నివసించవచ్చు. మా నాట్యకళా వేదికను ఉపయోగించుకోవచ్చు. నీకు అన్ని విధాలా నా సహాయం వుంటుంది’’ అన్నాడు భరతశాస్త్రి.కృష్ణమూర్తి కళ్ళల్లోంచి కృతజ్ఞత అశ్రుబిందువులుగా జారి, వినమ్రంగా భరతశాస్త్రి పాదాల ముందు మోకరిల్లింది.

‘‘శాస్త్రిగారూ! మేం నలుగురం వున్నాం. నేను, నా భార్య తులసి, మేనల్లుడు వంశీ, నా కుమార్తె పద్మిని. కొన్ని కారణాల వల్ల కేరళ నుండీ మేమందరం ప్రాణభయంతో రాత్రికి రాత్రి రైలెక్కి ఆంధ్ర ప్రాంతానికి వచ్చాం. అనేక చోట్ల తిరిగి, చివరికి మీ గురించి తెలుసుకుని ఇక్కడికొచ్చాం. మాకు మీరే దిక్కు’’ అన్నాడు చేతులు జోడించి కృష్ణమూర్తి.‘‘అందరికీ దిక్కు ఆ పైవాడే. మనందరం నిమిత్తమాత్రులం. ఇక్కడున్నంతకాలం మీకెలాంటి ఆపదా రాదు.’’కృష్ణమూర్తి మొహంలో ఇంకా భయవీచికలు అలాగే వుండడం గమనించి ‘‘ఇలాంటి హామీ నా శక్తి మీద ఇవ్వటం లేదు. నా మిత్రుడు పైడిరాజు అండ చూసుకుని చెబుతున్నాను.’’‘‘పైడిరాజు ఎవరు?’’‘‘ఈ ఊరికి మకుటం లేని మహారాజు. మంచివారికి దేవుడు. దుర్మార్గులకి యముడు.’’‘‘ఏం చేస్తాడాయన?’’‘‘విదేశాలకు చేపలు ఎగుమతి చేస్తాడు. సంవత్సరానికి వందకోట్ల వ్యాపారం చేస్తాడు, యమకింకరుల్లాంటి అనుచరులు వందమంది దాకా వుంటారు.

మామూలప్పుడే చేపల వ్యాపారంలో హడావిడిగా వుంటారు. ఏదైనా గొడవొస్తే గొడ్డళ్ళతో సిద్ధమౌతారు! ఒక్కొక్కడు కనీసం పదిమందికి జవాబు చెబుతాడు.’’‘‘వింటూంటే ఆశ్చర్యంగా వుంది. అయినా అలాంటి గొప్పవాడు నాలాంటి అభాగ్యుడికి ఎందుకు సాయం చేస్తాడు? కనీసం నాతో ఆయనకి పరిచయం కూడా లేదే?’’‘‘తొందరపడకు కృష్ణమూర్తీ. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. పైడిరాజు రేపే ఇక్కడికొస్తున్నాడు. నేనే స్వయంగా నీకు పరిచయం చేస్తాను. ఇక విశ్రమించు నాట్యం చేసి అలిసిపోయి వున్నావు.’’