‘‘నమస్కారం సార్‌! రమ్మన్నారట’’సంధ్య గొంతు విని ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్న ప్రిన్సిపల్‌ రామానుజం గారు, ‘‘ఆ సంధ్యా! రామ్మా!’’ అంటూ‘‘వీరు చంద్రశేఖర్‌! మన కాలేజ్‌కి కొత్తగా వచ్చిన లెక్చరర్‌!’’ అంటూ పరిచయం చేసారు.‘‘నమస్కారం సార్‌!’’ సంధ్య రెండు చేతులు జోడించింది.ప్రిన్సిపల్‌ ఎదురుగా కూర్చున్న అతను పక్కగా తిరిగి ‘‘నమస్తే’’ అంటూ సంధ్య వంక చూసి నిశ్ఛేష్టుడయ్యాడు! ‘‘చంద్రశేఖర్‌ !’’ సంధ్య మా కాలేజ్‌ బెస్ట్‌ స్టూడెంట్‌!’’ ఇంకా ఆయనేదో చెప్పబోతుంటే ఫోన్‌ మ్రోగింది. ఆయన ఫోన్‌ మాట్లాడుతూ ఉండిపోతే. చంద్రశేఖర్‌ సంధ్య వంక చూస్తూ ఉండిపోయాడు. సంధ్య పరిస్థితి ఇబ్బందికరంగా అయింది.రామానుజం గారు ఫోన్‌ పెట్టేసి,‘‘సంధ్యా, ఇంతకీ నిన్ను ఎందుకు పిలిచానంటే వీరు రీసెర్చి పేపర్లు సబ్‌మిట్‌ చేస్తున్నారు. కొంచెం ఆ కంప్యూటర్‌ ఎంట్రీ పనులు అవి నువ్వు చేసిపెట్టు. దానికి ఆయన నీకు పేమెంట్‌ ఇస్తారు!’’ అన్నారు. ‘‘అలాగే సార్‌!’’ సంధ్య అతని చూపుల నుంచి తప్పించుకొని బయటపడింది.‘‘చంద్రశేఖర్‌ సంధ్యకు తల్లిలేదు. తండ్రి ఊళ్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఇక్కడే హాస్టల్‌లో ఉంటుంది. ఇలాంటి జాబ్‌ వర్క్‌లు అవీ ఇప్పించి కొద్దిగా ఇలా ఆదుకుంటున్నాను. మీరు ఈ ఊరికి కొత్త, ఇదే రావడం కాబట్టి ఆ అమ్మాయిని మీకు అటాచ్‌ చేశాను! మన ల్యాబ్‌ వాడుకుని మా కాలేజ్‌కి మంచి పేరు తెచ్చి పెట్టండి!’’ ‘‘బెస్ట్‌ ఆఫ్‌ లక్‌!’’ అన్నారాయన! చంద్రశేఖర్‌ ఆయనకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి బయటకు వచ్చేసాడు.అతని మనస్సంతా గందరగోళంగా ఉంది. అశాంతితో రగిలిపోతోంది.

‘‘మాస్టారు! వ్రాసిన రీసెర్చ్‌ పేపర్లు ఉంటే ఇవ్వండి? ఈవాళ మూడు ఫ్రీ పీరియడ్లు ఉన్నాయి. మీ వర్క్‌ పూర్తి చేస్తాను!’’ సంధ్య గొంతు విని స్టాఫ్‌ రూమ్‌లో కూర్చుని నెక్స్‌ ్ట క్లాసుకు ప్రిపేరు అవుతూ బుక్‌ చదువుతున్న చంద్రశేఖర్‌ తలెత్తి చూశాడు.లేత ఆకుపచ్చ చీరలో పచ్చగా మెరిసిపోతూ వనదేవతలా ఉంది సంధ్య. అతని కళ్ళలో కోటి మెరుపులు మెరిసాయి ఆమెను చూడగానే! తడబాటుగా ఆమె నుంచి చూపులు తిప్పుకొని, మౌనంగా వ్రాసిన పేపర్లు అందించాడు.‘‘నన్ను చూడగానే అతని ముఖంలో ఎన్నో మార్పులు ఆశ్చర్యం, ఆనందం, ఆలోచన ఎందువల్లో?’’ సంధ్యకి ఒక్కోసారి అతని ప్రవర్తన అర్థమయ్యేదికాదు, వింతగా అనిపించేది.చంద్రశేఖర్‌ చాలా తక్కువగా మాట్లాడేవాడు. ఒక్క క్లాసులో తప్పించి అతని గొంతు బయట వినపడటం చాలా అరుదనే చెప్పుకోవాలి.నెమ్మది నెమ్మదిగా అతనితో పరిచయం పెరిగిన కొలది, తనకి తాను తెలియకుండానే అతని వ్యక్తిత్వానికి ఆకర్షితురాలైంది.అతనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఆమె మనసులో ఏర్పడసాగింది. నిజం చెప్పాలంటే హుందాగా ఉండే చంద్రశేఖర్‌ మాస్టారంటే ఆడపిల్లలందరికీ ఒక రకమైన క్రేజీగా ఉండేది. మగ పిల్లలందరికి ఒక రకమైన హడలు. చదువు విషయంలో మటుకు అతను చాలా కఠినంగా వ్యవహరించేవాడు.అతని అందం, బట్టలు, మాటలు ఇలా అతని గురించి ఎన్నో చర్చలు జరిగేవి. సంధ్యకి అతని వర్కు పూర్తయిపోతుంటే బెంగగా అనిపించేది. ఈ చనువు, సాన్నిహిత్యం మళ్ళీ దొరకవేమో అనిపించేవి, పదే పదే!అలాగే చదువు చెప్పటంలోను, తన వర్కు చేయించు కోవడంలోను సంధ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడు చంద్రశేఖర్‌. ఎంతమందిలో ఉన్నా కూడా అతను ఆమెను ప్రత్యేకంగా చూడటం ఆమె మనసులో మధురమైన ఊహలకి దారితీసింది.