ఆకాశం కుప్పకూలి నేల రాలిందా అన్నట్లు దట్టమైన మేఘాలు రహదార్ల నిండా అలముకొన్నాయి. శిరోజాలు విరబూసుకున్న ఉగ్రదేవతల్లా దట్టమైన ఆకులతో ఉన్న చెట్లు ప్రళయ ఝంఝామారుతానికి ఊగిపోతున్నాయి. అడవుల్లో జంతు సమూహాలు ఏదో ఉత్పాతం జరిగిందన్న సూచనగా దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నాయి.భయంకరమైన ఆ దృశ్యాలూ, రహదార్లను, అడవులను, వాటి వెనుక ఉన్న పర్వతాలను ప్రకంపింపజేసే ఆ జంతువుల రోదనలు ఎవరినైనా చలింప చేస్తాయి. ఎవరి మానసిక స్థైర్యాన్నైనా దెబ్బతీస్తాయి. ఆ సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రథ చక్రాల ధ్వనులు, గుర్రపు డెక్కలచప్పుడు, ఏనుగు ఘీంకారవాలు ఆ రోదనలకు మరణ మృదంగాల్లా మ్రోగి ఒక వికృతలయను అందిస్తున్నాయి. అయితే ద్వారక నుంచి బయలు దేరి మహా వేగంతో సాగుతున్న వందలాది రథాలపై పయనిస్తున్న వారు మాత్రం చలించడం లేదు. ఈ పరిణామాలకు వారు ఆశ్చర్యపోతున్నారు. దట్టమైన మేఘాల్లా వారి మనస్సులో ఆలోచనలు క్రమ్ముకున్నాయి. తమ చుట్టూ ఏదో ఒక తెలియని చీకటి ఆవరించుకున్నట్లు కనపడుతున్నది.

ఈ ప్రయాణం అంతులేని ప్రయాణమా? తాము ఎక్కడికి వెళుతున్నట్టు?తుపానులో జలదాలను మైమరిపించే మెరుపుల్లా రథాలపై ప్రయాణిస్తున్న ఆ అందమైన కాంతల్ని చూస్తుంటే ఇంకా చూడబుద్ధి అవుతోంది. వారు సామాన్య కాంతలు కారు.. వారెవరంటే... రుక్ష్మిణి, సత్యభామ, జాంబవతి, లక్ష్మణ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర. ఒక్కొక్కరూ మహాద్భుత సౌందర్య రాశులు. వారందరూ శ్రీకృష్ణుడి అష్టమహిషులు. వారే కాదు. కృష్ణుడి శృంగార రసాస్వాదనలో మమేకమైన ఎందరో సుందరీమణులు, అసూర్యంపశ్యలు, ప్రముఖ యాదవ వీరుల ముద్దుల భార్యలు సైతం ఆ రథాలపై ప్రయాణం చేస్తున్నారు.అయితే అంతఃపుర కాంతలు ప్రయాణిస్తున్న ఆ రథాలపై తేరిపారి చూసే, ధైర్యం ఎవరికుంటుంది? ద్వారక నుంచి బయలు దేరిన ఆ రథాలకు నాయకత్వం, రక్షణ భారం వహిస్తున్నది పాండవ మధ్యముడు అర్జునుడని అందరికీ తెలుసు. ఎంతటి తుపాను వచ్చినా, ఎలాంటి ప్రకృతి వైపరీత్యం సంభవించినా అతడి పేరు స్మరిస్తే చాలు కెరటాలు వెనక్కివెళ్లిపోతాయని, అలముకున్న దట్టమైన మేఘాలు చెదిరిపోతాయని, ఉరుములు, మెరుపులైనా శాంతిస్తాయని వారు విన్నారు.

ఏ ప్రకృతి అయితే అర్జున, ఫల్గున, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, విజయ, సవ్యసాచి, ధనుంజయ... అని అర్జునుడి పేర్లు స్మరిస్తే తన భయానక రూపాన్ని ఉపసంహరించుకుంటుందో, అదే ప్రకృతి తన ప్రళయ తాండవాన్ని ప్రదర్శించడం వార్ని చకితులను చేయడం లేదు.ఆశ్వాలు డస్సిపోయాయి. ఏనుగులు ఇంకా మందకొడిగా అడుగులు వేస్తున్నాయి. రథ చక్రాలు తిరిగీ తిరిగీ సడలిపోతున్నాయి. రథాలపై సాగుతున్న వారిలో ఒక్కోసారి దుఃఖం పెల్లుబుకుతోంది. మరోసారి క్రుంగిపోయి శాంతిస్తున్నది. తామిక ద్వారక చూడనట్లేనా? ఆ భూతల స్వర్గం ఇక తమకు గోచరించదా? తాము పయనిస్తుంటే సముద్ర జలాలు ద్వారకను మహోగ్రంగా ముంచెత్తడం కళ్ళారా చూసి వారు భయకంపితులయ్యారు. వారిలో ఎందరో భర్తలను పోగొట్టుకున్న యాదవకాంతలు, పిల్లల్ని పోగొట్టుకున్న వృద్ధులు, తండ్రులు లేని పిల్లలు అర్జునుడినే సర్వస్వంగా భావించి ఆయన వెంట పయనించారు.గత కొద్ది రోజులుగా వారి కళ్లముందు మృత్యువు తాండవిస్తున్నది. మహా భారత యుద్ధం జరిగి ధర్మరాజు పట్టాభిషేకం జరిగి మూడున్నర దశాబ్దాలు దాటిన తర్వాత భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు కలిగాయి. ఉదయం పూట పెద్ద గాలులతో ఇసుక వర్షం కురిసింది. మేఘాలు లేకుండా పిడుగులు పడ్డాయి. ఉల్కలు రాలాయి. మండు వేసవిలో దట్టమైన పొగమంచు ఆవరించింది.