‘‘ఎప్పటికప్పుడు తాజా వార్తలతో, అందరికంటే ముందు మీ ముందుకు వచ్చే సమాచార స్రవంతి టీవీ ట్వంటీఫోర్‌....మళ్ళా వచ్చే బులెటిన్‌లో కలుద్దాం...అంత వరకూ సెలవ్‌ మీ సీతారెడ్డి’’ అని ఆమె ముగించగానే ఆమె మీదున్న కెమెరా ఫోకస్‌ ఆఫ్‌ అయి సిగ్నేచర్‌ క్లోజింగ్‌ క్లిప్‌ ప్రసారం ప్రారంభమయింది.వార్తలు చదివే, చర్చలు చేసే ఆ రూమ్‌ లోంచి చెప్పుల్తోనే బయటకు వచ్చింది సీతారెడ్డి. సాధారణంగా అందరూ ఆ గదిలోకి వెళ్ళే ముందు మేకప్‌ వేసుకుని, చెప్పుల్ని వదిలి వెళ్తారు. కానీ సీత చాలా స్పెషల్‌. ఆమె చెప్పులు, మేకప్‌ దేన్నీ వదలదు. ఆమెని వారించే ధైర్యం న్యూస్‌ ప్రొడ్యూసర్‌ కానీ, మరొకరు కానీ చెయ్యరు. దానికి చాలా కారణాలున్నాయి.ఆరేడునెలల క్రితం వరకూ ఆమె మామూలు అమ్మాయి. అందరిలానే వార్తలు చదివే ఓ న్యూస్‌ యాంకర్‌. కానీ ఆ తరువాత కాలంలో ఆమె పలుకుబడి విపరీతంగా పెరిగింది. ఓ రోజు ఏదో పని ఉండి యండీ చాంబర్‌లోకి బెల్‌ కొట్టకుండా వెళ్ళిన ఓ రిపోర్టర్‌కి చాలా పెద్ద షాక్‌ తగిలింది. యండీ చెయిర్‌లో కూర్చుని ఉంది సీతారెడ్డి. అయితే ఒక్కతే కాదనుకోండి. అదే కుర్చీలో యండీ కూడా ఉన్నాడు. ఇద్దరూ ఒకటే కుర్చీలో సర్దుకున్నారు. కాకపోతే తన బరువు ఆ అమ్మాయి మోయలేదనే మానవతా దృక్పధంతో ఆమె బరువును కూడా తనే మోస్తున్నాడు యండీ. తన ఒడిలో ఇంత చోటిచ్చాడు. ఆమెకు కూడా అతడి మానవతా దృక్పధం నచ్చినట్లుంది. దాన్ని అతడి నోరు తీపి చెయ్యడం ద్వారా వ్యక్త పరుస్తోంది. కాకపోతే సమయానికి వేరే మిఠాయి అందుబాటులో లేకపోవడంతో మిఠాయి పొట్లంలా ఉండే తన మూతినే దానికి వాడుతోంది.

ఈ ఏకాంత చుంబన సేవ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన ఆ విలేకరి మరుక్షణంలో ఆ ప్రసారాలు తనంత తను నిలిపివేసుకుని తనకు ఉస్మానియాలో లాఠీచార్జి అనుభవాన్ని ఉపయోగించుకుని రేసు గుర్రం మాదిరి పరిగెత్తాడు.కానీ తన దుష్ప్రవర్తన వల్ల ఆ ఇద్దరి మనసులూ నొచ్చికుంటాయనే సంశయంతో, తన ఉద్యోగం ఉందో, ఊడిందో అన్న అనుమానంతో రెండు వారాలు ఆఫీసుకు రాకుండానే, ఫోను ద్వారా తన ఉద్యోగం ఉందనే వార్త అందుకుంటూ గడిపి, తరువాత నెమ్మదిగా తిరిగి గూటికి చేరాడు.

అయితే యండీ కానీ, సీతారెడ్డి కానీ ఆ విషయాన్ని ఈజిప్టు విప్లవం తరువాత ముబారక్‌ ఏమయ్యాడు అన్న విషాయానికి ఇచ్చిన ప్రాముఖ్యత కూడా ఇవ్వకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అయితే విలేకరిగా తన బాధ్యతని మరిచిపోలేదు.ప్రత్యక్ష ప్రసారం ద్వారా తను చూసింది అందరికీ చూపించలేకపోయినా, తన సహచరులకు మాత్రం తాను చూసింది ఐమాక్స్‌ తెర మీద త్రీడీ ఎఫెక్టుతో చూసిన అనుభూతి కలిగేలా వివరించాడు. అది విన్న మగవాళ్ళు సీతారెడ్డిని తమ ఒడిలో ఊహించుకుని సంబరపడినా, ఆడవాళ్ళు మాత్రం ఎప్పుడూ సిగరెట్లు కాలుస్తూ ఉండే తమ యండీ తాలూకూ మూసీనది నాలా లాంటి నల్లటి నోటిని, ఆ నాలా వెదజల్లే దుర్వాసనని ఊహించుకుని వాంతి చేసుకున్నంత పని చేశారు.