జీవితమంటె కాలంలో కదలిక, మనుష్యుల మధ్య మానవ సంబంధాల మధ్య పరిచిత భావనలు, కాలంతో కదలాడుతుంటాయి.రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఆసియాలోనే అతిపెద్దది. రెండు పెద్ద టెర్మినల్స్‌తో గంభీరంగా వుంటుంది. వివిధ ప్రాంతాల మనుష్యులు, వారి వేర్వేరు భాషలు, ఎన్నో సౌకర్యాలు, రకరకాల తినుబండారాలు, నడవటం అవసరం లేకుండా చిన్నచిన్న వాహన కారియర్లు (గోల్ఫ్‌కార్ట్‌), రకరకాల డ్రస్సులతో కళకళలాడుతూ చిన్నాపెద్దలు అటూ ఇటూ తిరుగుతూ హడావుడిగా వుంది.మధ్యమధ్యలో ‘యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌’ అనౌన్స్‌మెంట్‌ రొద. అస్థిమితంగా ఏదో ఆందోళనతో తిరుగుతున్నారు మనుష్యులు.రెండు పెద్ద సూట్‌కేసులు, ఓ చిన్నహేండ్‌బ్యాగుతో రేవతి. మొదటి సారిగా అమెరికా ప్రయాణం. న్యూజెర్సీలో కొడుకు కార్తీక్‌ నివాసం. ఐ.ఐ.టి. క్యాంపస్‌ సెలక్షనులో సెలక్టయి, శిక్షణ పూర్తి చేసుకొని పూర్తి కాలం ఉద్యోగిగా బహుళజాతి సంస్థలో పెద్ద జీతంతో ఫర్నిష్‌డ్‌ అపార్ట్‌మెంట్‌ తీసుకొని రేవతిని రమ్మనడం జరిగింది.పాస్‌పోర్టు వీసా తదితర కార్యక్రమాలన్నిటికీ రేవతి స్నేహితురాలు రాణి కొడుకు పవన్‌ సహకరించాడు. రాణి కుటుంబం హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పవన్‌ కూడా అమెరికా వెళ్తుండటంతో రేవతి ధైర్యంగా బయల్దేరింది.మధ్య తరగతి నుండి ఒక మహిళ అమెరికాకు బయల్దేరడం తమ కుటుంబాలలో రేవతితో మొదలు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని విశ్రాంత సమయాన ఈ వయస్సులో వెళ్ళగలగటం రేవతి ఊహించలేదు.బాహ్యపరిస్థితుల నుండి వచ్చేటటువంటి ఒత్తిడులు, విలువలు, ప్రమాణాలు, వీటి మధ్య వుండే చర్య ప్రతి చర్య, సంఘర్షణ ఇవి మనిషి వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. ఇవి సమతౌల్యంగా సాగితే మనిషి నిండుగా వుండటం, ఆ లక్షణాల ప్రవృత్తి ప్రవర్తన వుంటాయి. ఆ పరిస్థితుల నుండి వచ్చిన వ్యక్తి రేవతి.మొదటిసారి వీసా చిన్న పొరపాటుతో తిరస్కరించడం జరిగింది. 

వెంటనే రెండవసారి అన్ని జాగ్రత్తలు తీసుకొని అప్లై చేయడం జరిగింది. ఇబ్బందికర ప్రశ్నలు ఏమీ లేకుండా వీసా మంజూరు అయింది.కొందరు నెమ్మదిగా మృదువుగా ఫోన్లలో అటూఇటూ నడుస్తూ మాట్లాడుతున్నారు. వివిధ విన్యాసాలతో భంగిమలతో సంతోషంగా వున్నారు. ఎంతో వింతగా అనిపించింది ఈ వాతావరణం రేవతికి.బాధాతప్త హృదయాలతో చాలా భారంగా కొందరు ఆత్మీయులకు వీడ్కోలు పలికే సన్నివేశాలు ఒకవైపు.డిపార్చర్‌ లాబీ అన్నిరకాల విశేషాలతో శోభాయమానంగా వుంది.పవన్‌ మధ్యలో వచ్చి రేవతికి కాఫీ అందించి వెళ్ళాడు.రెండు సూట్‌కేసులు ‘చెక్‌ ఇన్‌’ చేయించుకొని వారికి అప్పగించింది. అందులోని పచ్చళ్ళు, పప్పుపొడి పాకెట్‌లు బయటకు తీసివేశారు. కార్తీక్‌కు చాలా ఇష్టమయినవని ప్రత్యేక శ్రద్ధతో తయారుచేసింది రేవతి. అందులోనే వుంచమని ప్రాధేయపడింది.

చాలా నిర్లక్ష్యంగా ‘నాట్‌ ఎలోడ్‌’ అని పక్కన పడేశారు. ప్రాణం ఉసూరుమంది. చేసేదేమీలేక సరిపెట్టుకుంది. పవన్‌ మరేమీ మాట్లాడ వద్దన్నాడు.‘‘దీని విలువ వీళ్ళకేమీ తెలుసురా?’’ కసిగా అంది రేవతి. కొంచెం సేపు రుసరుసలాడింది.తర్వాత ఏదో రకంగా టాపిక్‌ మార్చి ఆమె మూడ్‌ మార్చగలిగాడు పవన్‌.‘‘అత్తా, అమెరికాలో ఎన్నాళ్ళుంటావు’’ పవన్‌ అడిగాడు.‘‘చలి లేకపోతే వుంటా! చలి వుంటే తిరుగు టపా’’ అంది రేవతి.‘‘ఏం ఫరవాలేదు. హీటర్సు వుంటాయిట, కారు, ఇల్లు పూర్తిగా వేడిగా వుంటాయిట. ఎక్కడికయినా వెళ్తే అక్కడ హీటర్సు వుంటాయి. చలి ప్రాబ్లం వుండదు’.