పండు వెన్నెల. నిండు జాబిల్లి. మంచు చినుకులు ఆకులపైకి జారుతున్నాయ్‌... వెన్నెల్లో హాయిగా ఆడాలని.అసలే శీతాకాలం. డాబా మీద ఓ మూల పడక్కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని, కొంచెంగా వణికించే చలిని కూడా లెఖ్ఖచెయ్యకుండా శరత్‌ వెన్నెల మేళవింపుని అనుభవిస్తున్నాడు రాజారాం.అతని జీవితంలో యిలా ఎన్నోరాత్రులను అలాగే కూర్చుని అనుభూతి చెందేవాడు ఆనందంగా.కానీ యీరోజు మాత్రం అంగీకరించాల్సిన దిగులుని, బరువెక్కిన గుండె బరువును దింపుకోవడానికి వెన్నెల తోడుకోసం మేడ మీదకి వచ్చాడు. అవును మరి, స్వంతం, శాశ్వతం అనుకున్న తనవాళ్ళు ఒక్కొక్కరు దూరమవుతుంటే, తన బాధ్యతల్ని విజయవంతంగా నెరవేరుస్తున్నందుకు ఆనందించాలో, వాస్తవాలని ఒప్పుకుని మనసు బుజ్జగించి మలుచుకోవాలో తెలియట్లేదు.జీవితం మనం చిత్రించడానికి చేతపట్టుకునే కుంచె కాదు. మనల్ని చిత్రించే కుంచె.భారంగా నిట్టూర్చాడు రాజారాం.అతని వ్యధకి కారణం వుంది. నిన్న యిదే సమయానికి పచ్చటి తోరణాలతో, దేదీప్యమానమైన లైట్లకాంతితో, వెలిగిపోయిన ఆ యిల్లు యిప్పుడు బోసిగా, కళావిహీనంగా వుంది.నిన్న చిన్నకూతురుకి పెళ్లిచేసి అత్తారింటికి పంపించాడు. 

రాజారాం రిటైర్డు సబ్‌రిజిస్ర్టార్‌. అతనికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కొడుకు చక్రవర్తి, తర్వాత పెద్దకూతురు వసుంధర, మళ్లీ చాలా కాలం తర్వాత అంటే దాదాపు పదిహేనేళ్ళకి చిన్నకొడుకు మురళి, చిన్నకూతురు శివాని పుట్టారు.ఇప్పుడు శివాని పెళ్ళి జరిగింది. మేళతాళాలతో కన్నుల పండుగగా కళకళలాడిన వాతావరణం పెళ్ళయిపోగానే, అందరూ వెళ్ళిపోయేసరికి వెలవెల బోతోంది.అల్లారు ముద్దుగా పెంచిన కూతురు వెళ్ళి పోయింది. వెంటనే యిల్లు కూడా ఖాళి అయి పోయింది. మనసులాగే.బహుశా తనలాగే ప్రతి తండ్రికి, యిలాంటి పరిస్థితి జీవితంలో ఒకసారి తప్పదేమో.నవ్వుకున్నాడు రాజారాం.‘‘నాన్నా’’ పిలుపుతో తలతిప్పి చూశాడు. పెద్దకూతురు వసుంధర.‘‘ఉ’’ అన్నాడు అన్యమనస్కంగా...‘‘చలిలో ఎంతసేపుంటారు నాన్న? క్రిందకి రండి. అమ్మ భోజనానికి రమ్మంది.’’‘‘అప్పుడే?’’‘‘తొందరగా తిని పడుకోవాలి. ప్రొద్దున్నే నాలుగింటికి రైలు.’’‘‘ఓ...’’ అని లేచాడు రాజారాం ‘‘నువ్వుకూడా వెళ్ళిపోతున్నావా? మనవడ్ని కూడా తీసుకొస్తే బావుండేదమ్మా! సరదాగా వుండేవాడు.’’‘‘ఒక్కరోజు కూడా మానడానికి లేదునాన్న. స్కూల్లో ఒప్పుకోరు’’‘‘అందరూ ఒకేసారి వెళ్ళిపోతే బాధగా వుందమ్మా.’’‘‘అన్నయ్య కూడా అమెరికా నుండి వచ్చుంటే బావుండేది నాన్నా! పిల్లల్ని వదిన్ని చూసి చాలా రోజులైంది.’’‘‘కొత్త బంధాలు, కొత్త అనుభూతులు. అనుకున్నంత అనుకూలంగా వుండవమ్మా అక్కడి పరిస్థితులు.’’మెట్లు దిగుతూ వసుంధర ‘‘నాన్న మీకో విషయం చెప్పాలి’’ అంది మెల్లగా.‘‘ఏమిటమ్మా?’’‘‘మీ అల్లుడుగారి ఎక్స్‌పోర్టు బిజినెస్‌ బాగా పెరిగింది. విశాఖపట్నంలో ఆ వ్యవహారాల్ని ఆయన అన్నయ్యలు చూసుకుంటున్నారు. బహుశా పిల్లలకి పరీక్షలు అయిపోగానే, మేం కూడా చైనాకి వెళ్ళిపోవచ్చు. అక్కడ కొత్త ఆఫీసు తెరుస్తారట.’’విని, కొంచెంసేపు మౌనంగా వుండి, ‘‘నీ జీవితంలో యింకో మార్పు. తప్పేదేముందమ్మా. అల్లుడుగారు చెప్పినట్లే చెయ్యి...’’‘‘మాతో పాటు మీరూ, అమ్మ కూడా వస్తే, కొన్నాళ్ళు బావుంటుంది నాన్నా.’’నవ్వాడు రాజారాం ‘‘నాకు కుదరదమ్మా. మీ తాతయ్యకి ఎప్పుడూ ఒంట్లో ఏదో ఒక హడావిడి. మీ అత్తయ్య కూడా... యిక్కడే వుందిగా..’’రాజారాంకి ఒక చెల్లెలు. సీతారత్నం. సీతారత్నంకి పెళ్ళయ్యి ఒక కొడుకు. కొడుకుకి యింకా వూహ కూడా సరిగ్గా రాకముందే ఆమె భర్త ఆక్సిడెంటులో పోయాడు.